- ప్యాకేజీలు పెట్టి డబ్బులు వసూళ్లు
- డబ్బులు ఇవ్వకపోతే లేబర్ రూంలో నరకం
- డెలివరికి వచ్చిన వారికి కనీసం రూ.5 వేలు వసూలు
- ఇదీ కరీంనగర్‌లోని మాతాశిశు సంరక్షణ కేంద్రం పరిస్థితి
‘కరీంనగర్‌కు చెందిన లక్ష్మి తన కూతురు డెలివరీకి ఉండటంతో డబ్బులకు ఇబ్బందిగా ఉందని టౌన్‌లోని మాతా శిశు సంరక్షణ కేంద్రానికి తీసుకొచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రే కదా డబ్బులు ఎందుకు ఖర్చవుతాయని అనుకుంది. కానీ ఆసుపత్రికి వచ్చిన దగ్గర నుంచి మొదలుకుని డిశ్చార్జి అయ్యే వరకు తక్కువలో తక్కువగా ఐదు వేలు ఒడిశాయి.’
కరీంనగర్, వెలుగు: కరీంనగర్‌లోని మాతాశిశు కేంద్రానికి ఉమ్మడి జిల్లాతోపాటు ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల నుంచి డెలివరీల కోసం వస్తుంటారు. కేసీఆర్ కిట్ ఇస్తున్నప్పటి నుంచి ఈ హాస్పిటల్‌లో ప్రసవాల సంఖ్య పెరిగింది. అయితే డెలివరీల కోసం వస్తున్న వారికి మాత్రం ఇక్కడి సిబ్బంది చుక్కలు చూపిస్తున్నారు. చేయి తడపనిదే సేవలు అందిచడం లేదు. బాలింతలకు ఎలాంటి సపర్యలు చేయాలన్నా.. పైసలు ఇవ్వనిదే పని కావడం లేదు. ఎంతోకొంత ఉన్నవారు పోనీలే అని ఇస్తున్నారు. పూర్తిగా డబ్బులు లేని వారైతే ఇబ్బంది పడుతున్నారు. ఆసుపత్రి వర్గాలు మాత్రం పట్టించుకోవడం లేదు. పేదలకు ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం అంటూ ప్రభుత్వం ప్రకటనలు చేస్తుంటే ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్లు, స్టాఫ్ తీరు మాత్రం ఇలా ఉంది. మెరుగైన సేవలేమో కానీ.. చేతివాటం మాత్రం రోజురోజుకూ పెరుగుతోంది.
ఆస్పత్రిలో అడుగు పెట్టింది మొదలు
పురిటినొప్పులతో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చింది మొదలు సిబ్బంది చేయి చాస్తున్నారు. ప్రతీ సేవకు ఇంత ధర అన్నట్లుగా ఆయాలు, నర్సులు, శానిటేషన్ సిబ్బంది వసూళ్లకు తెగబడుతున్నారు. ఆపదలో ఉండి ఆస్పత్రికి వచ్చిన గర్బిణికి అమ్మలా ఆదరించి కాన్పుచేసి తల్లి, బిడ్డను ఆరోగ్యంగా ఇంటికి చేర్చాల్సిన స్టాఫ్ మానవత్వం లేనట్లుగా వ్యవహరిస్తున్నారు. కదల్లేని స్థితితో ఉన్న గర్భిణి, బాలింతకు డ్రెస్ మార్చినా, బెడ్‍షీట్ మార్చినా కనీసం వంద రూపాయలు ఇస్తేనే సేవలు అందిస్తున్నారు.
డబ్బులు ఇవ్వకపోతే నరకం
ఆస్పత్రిలో సిబ్బందికి డబ్బులు ఇవ్వని వారి పరిస్థితి దారుణంగా ఉంటుంది. పురిటి నొప్పులతో బాధపడుతున్నా.. కడుపులో పిండం అడ్డం తిరిగి చావు బతుకుల మధ్య కొట్టుకుంటున్నా పట్టించుకోరు. సాధారణ కాన్పు పేరుతో కాలయాపన చేస్తూ చూసీచూడనట్లుగా వ్యవహరిస్తారు. ఇదేమిటని ప్రశ్నిస్తే కాన్పు చేస్తామంటూ లోనికి తీసుకువెళ్లి లేబర్ రూమ్‍లో అనరాని మాటలు అంటూ నరకం చూపిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ‘డబ్బులు ఎందుకు ఇవ్వాలి.. మీరు జీతాలు తీసుకుంటున్నారు కదా’ అని ప్రశ్నిస్తే కాన్పు చేయకుండా మధ్యలోనే వదిలేసి ఇబ్బందులు గురిచేస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. ఈ విషయమై సూపరింటిండెంట్ డాక్టర్ రత్నమాలను వివరణ కోరగా.. ‘పేషెంట్ల నుంచి డబ్బులు వసూలు చేయడం క్షమించరాని నేరం. డెలివరీ కోసం వచ్చిన వారు ఎవరికీ ఒక్క రూపాయి ఇవ్వద్దు. ఎవరైనా అడిగితే నేరుగా నా దృష్టికి తీసుకురండి’ అంటూ సమాధానమిచ్చారు.
కాన్పుకు రూ.3 వేలు.. ఆపరేషన్‍కు రూ.5 వేలు..
అంబులెన్స్ దిగి వార్డులో అడుగు పెట్టగానే అమ్మా ఎక్కడి నుంచి వచ్చావు అంటు ఆయా తీయగా పలకరిస్తుంది. ఆ తర్వాత ‘ఏ సహాయం కావాలన్నా అడుగు చేయడానికి నేను ఉన్నాను’ అంటూ బుట్టలో వేసుకుంటుంది. కొంత సమయానికి నర్సమ్మ వచ్చి కేస్ షీట్ తీసుకొని చూసి పరీక్షలు చేయాలంటూ పరిశీలించి వెళ్లగా.. అలా రెండు మూడు గంటలు గడిచి నొప్పులు పడుతున్నా ఎవరూ పట్టించుకోరు. అందుబాటులో ఉన్న ఆయా, నర్సుకు వెళ్లి చెబితే ‘ఇప్పుడే కదా వచ్చింది.. డెలివరీకి ఇంకా చాలా టైం ఉంది ఆగు’ అని అంటున్నారు. ఇట్ల ఎన్ని గంటలు పురిటి వేదన పడినా సిబ్బంది చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ‘ఇలా ఎంతసేపు బాధపడుతావమ్మా. నేను డాక్టరమ్మకు చెప్పి కాన్పు చేయిస్తాను. ఏమైనా ఉంటే చూసుకుంటావా..’ అంటూ అప్పుడు బేరం ఆడుతున్నారు. ఒకే అంటేనే అప్పుడు కాన్పుకు ఓకే చెబుతున్నారు. సాధారణ కాన్పు అయితే రూ.3 వేలు, ఆపరేషన్ చేయాల్సి వస్తే రూ.5 వేలు అని ప్యాకేజీలు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. డాక్టర్‍కు రూ.1,500, నర్సులకు రూ.1,500 చొప్పున తీసుకుంటున్నారు.