- మధ్యప్రదేశ్ శివ్‌పురిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం
శివ్‌పురి (మధ్యప్రదేశ్): దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న క్రమంలో అక్కడక్కడ బయటపడుతున్న సంఘటనలు షాకింగ్‌కు గురిచేస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లోని శివ్‌పురిలో దారుణ ఘటన వెలుగు చూసింది. భోపాల్‌కు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న శివ్‌పురిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ కరోనా పేషెంట్ మృతిపై వివాదం నెలకొంది. ఆసుపత్రి సిబ్బంది ఆక్సిజన్ సరఫరా నిలిపేయడంతోనే పేషెంట్ మృతి చెందినట్లు అతని కుటుంబీకులు ఆరోపించారు. ఈ ఘటనపై ఆసుపత్రి సీసీటీవీ పుటేజ్‌లను సేకరించి అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మరణించిన కొవిడ్ పేషెంట్ కుమారుడు మాట్లాడుతూ.. ‘మంగళవారం రాత్రి 11.30 వరకు మా నాన్నతోనే ఉన్నాను. ఆ తర్వాత ఇంటికి వెళ్లాను.. అప్పటికీ మా నాన్న రెండు మూడ్రోజులుగా బాగానే ఉన్నారు. ఆహారం సక్రమంగా తీసుకోవడంతో పాటు కోలుకుంటున్నానని చెప్పారు. అయితే మంగళవారం రాత్రే ఆసుపత్రి సిబ్బంది ఆయనకు ఆక్సిజన్‌ను తీసేశారు. నాకు ఉదయమే కాల్ వచ్చింది. వెంటనే ఆసుపత్రికి వెళ్లాను. ఆయనకు ఆక్సిజన్ పెట్టాలని బతిమాలాను. వారు పట్టించుకోలేదు. అనంతరం ఆయనను ఐసీయూకు తీసుకువెళ్లాను. 15 నిమిషాల్లోనే మరణించారు..’అని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఒక్క నిమిషం నిడివి ఉన్న సీసీటీవీ క్లిప్‌లో సదరు వృద్ధుడు కనిపిస్తాడు. ఓ ఆరోగ్య కార్యకర్త అతడి మంచం పక్కనే నిలబడి సాయం కోసం సహోద్యోగుల్ని పిలుస్తాడు. క్లిప్ చివరన ఆక్సిజన్ మెషీన్ బటన్‌నొక్కడం కనిపిస్తుంది. అయితే ఈ కొవిడ్వార్డుల్లో పనిచేసే ఫ్రంట్‌లైన్ వర్కర్లు పీపీఈ కిట్లు వేసుకోకుండానే అక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ఇక ఈ ఘటనపై దర్యాప్తు జరిపి 48 గంటల్లోగా నివేదిక సమర్పించేందుకు డాక్టర్ అనంత్ కుమార్ రాఖోడ్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని హాస్పిటల్ మేనేజ్‌మెంట్ ఏర్పాటు చేసింది.