- వచ్చే నెల 12 వరకు ఉద్యమ కార్యాచరణ ప్రకటన
హైదరాబాద్, వెలుగు: ఎన్నో ఏండ్లుగా పెండింగ్లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న సిబ్బంది పోరుబాట పట్టారు. సెర్ఫ్ మాదిరిగా తమను పే స్కేల్ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. నవంబర్ నుంచి జీతాలు ఇవ్వలేదని, వెంటనే విడుదల చేయాలని కోరుతున్నారు. వచ్చే నెల 12 వరకు నిరసన కార్యక్రమాలు చేపడ్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు బుధవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా 12,500 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరిలో చాలా మంది రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్నారు. 19 ఏండ్లుగా పని చేస్తున్నా.. తమకు గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా జీతాలు రాక.. పని ఒత్తిడితో చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ సిబ్బందిని పే స్కేల్ పరిధిలోకి తీసుకొస్తామన్న హామీని సీఎం రేవంత్ నిలబెట్టుకోవాలని కోరుతున్నారు. పే స్కేల్ అమలు చేస్తే ఏడాదికి రూ.32 కోట్ల భారం మాత్రమే పడుతుందని వివరించారు.
పథకాల అమలుపై ఎఫెక్ట్
ఉపాధి సిబ్బంది బుధవారం సంబంధిత అధికారులకు సమ్మె నోటీసులిచ్చారు. వచ్చే నెల 12 వరకు చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. ఆలోపు తమ సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఉపాధి సిబ్బంది ఆందోళనతో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఉపాధి పనుల వంటి వాటిపై ఎఫెక్ట్ పడనున్నది. నాలుగు రోజుల పాటు జరిగిన గ్రామ సభల్లో 2.30 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. వీటిని ఉపాధి సిబ్బంది కంప్యూటర్ ఆపరేటర్లు ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రజా పాలనలో భాగంగా ఉపాధి హామీ పనుల జాతర కొనసాగుతున్నది. ఎంపిక చేసిన పనులను మార్చి 31లోపు పూర్తి చేయాల్సి ఉంది. ఈ పథకంలో కూలీల హాజరు వివరాలు ఆన్ లైన్ నమోదు చేయాలి. పంచాయతీరాజ్ శాఖలోని పలు విభాగాల్లో చేపట్టే పనులపై ఎఫెక్ట్ పడనున్నది.
సెర్ప్ మాదిరి పే స్కేల్ పరిధిలో తేవాలి
3 నెలలుగా జీతాల్లేవు. సెలవు దినాల్లోనూ ఇచ్చిన టార్గెట్లు పూరి చేసినం. 20 రోజుల నుంచి నిద్రపోకుండా ఆత్మీయ భరోసా కోసం పని చేశాం. ఆర్థిక ఇబ్బందులతో పలువురు సూసైడ్ చేసుకుంటున్నరు. సెర్ప్ తరహాలో ఉపాధి హామీ సిబ్బందిని పే స్కేల్ పరిధిలోకి తీసుకురావాలి.
ఎస్ఆర్ డీఎస్ రాష్ట్ర జేఏసీ చైర్మన్ లింగయ్య ఎలబద్రి