భువనేశ్వర్: ఒడిశా పూరీ జగన్నాథ్ రత్న భాండాగారాన్ని తెరవడానికి అధికారులు సిద్ధమయ్యారు. 46 ఏండ్ల తర్వాత ఆదివారం దీనిని తెరవనున్నామని అధికారులు తెలిపారు. ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను లెక్కించనున్నామని చెప్పారు. ఈ సందర్భంగా భాండాగారానికి రిపేర్లు చేస్తామని పేర్కొన్నారు. చివరగా 1978లో దీనిని తెరిచారు. ‘‘ఆదివారం రత్న భాండాగారాన్ని తెరిచేందుకు మేం సిద్ధంగా ఉన్నాం.
శ్రీ జగన్నాథ ఆలయ చట్టం ప్రకారం ప్రభుత్వం జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్కు కట్టుబడి ఉన్నాం” అని పూరీ జిల్లా కలెక్టర్ సిద్దార్థ్ శంకర్ స్వైన్ వెల్లడించారు. రత్న భాండాగార్ను తెరవడంపై ఒడిశా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ బిశ్వనాథ్ రథ్ అధ్యక్షతన16 మంది సభ్యులతో ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ప్యానల్ జులై 14న దీనిని తెరవాలని సిఫార్సు చేసింది. ఇక్కడి భాండాగారానికి రక్షణగా పాము ఉందని కొంత మంది భావిస్తుంటారు. ఆ వదంతులను బలభద్రుని ప్రధాన సేవకుడైన హలధర్ దశమోహపాత్ర కొట్టిపారేశారు. ముందు జాగ్రత్తగా అధీకృత సిబ్బంది, పాములు పట్టే వ్యక్తి ఆలయంలోకి ప్రవేశిస్తారు. భాండాగారాన్ని తెరిచాక ఆభరణాలను తూకం వేయకూడదని వాటిని లెక్కించి రీసీల్ వేయాలని దశమోహపాత్ర సూచించారు.