సింగరేణి హెడ్​ ఆఫీస్​ ఎదుట కార్మికుల ధర్నా: వాసిరెడ్డి సీతారామయ్య

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్​ కార్మికుల వేతన పెంపు ఒప్పందాన్ని అమలు చేయడంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సింగరేణి కాలరీస్​ వర్కర్స్​ యూనియన్​ కేంద్ర కమిటీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. ఒప్పందాలను అమలు చేయాలని డిమాండ్​ చేస్తూ కొత్తగూడెంలోని సింగరేణి హెడ్​ఆఫీస్​ ఎదుట సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గతేడాది 18రోజులు సమ్మె చేసిన సందర్భంగా సెంట్రల్​ డిప్యూటీ లేబర్​ కమిషనర్​ సమక్షంలో యూనియన్లతో చేసుకున్న ఒప్పందాలను అమలు చేయకుండా యాజమాన్యం కాలయాపన చేస్తొందని ఆరోపించారు.

 గవర్నమెంట్​లో అమలవుతున్న జీఓ 22 ను సింగరేణిలో అమలు చేస్తామని ఇచ్చిన హామీని యాజమాన్యం గంగలో కలిపిందన్నారు. నర్సరీ కార్మికులకు ఈపీఎఫ్​, ప్రావిడెంట్​ఫండ్​, బోనస్​ చెల్లిస్తామని చెల్లించడం లేదన్నారు. కనీస వేతనాలు కాంట్రాక్ట్​ కార్మికులకు అందని ద్రాక్షగానే మారాయన్నారు. అనంతరం జీఎం పర్సనల్​ హనుమంతరావుకు వినతిపత్రాన్ని ఇచ్చారు. ఈ ప్రోగ్రాంలో యూనియన్​ నేతలు ఎం. రమేష్​, గుత్తుల సత్యనారాయణ, కిష్టఫర్​, కృష్ణయ్య, రాము పాల్గొన్నారు.