ఆళ్లపల్లి, వెలుగు : ఆటో డ్రైవర్లకు సమగ్ర చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండల కేంద్రంలో మంగళవారం డ్రైవర్లు ధర్నా చేశారు. తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి, వైస్ ఎంపీపీ రేసు ఎల్లయ్య మాట్లాడుతూ ఆళ్లపల్లి మండల పరిధిలోని టాటా మ్యాజిక్ ఆటో ఓనర్స్, డ్రైవర్లు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణంతో రోడ్డున పడ్డారని తెలిపారు.
టాటా మ్యాజిక్ ఆటో డ్రైవర్లకు సమగ్ర చట్టం చేయాలని, నెలకు రూ.15 వేల జీవనభృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు ఎస్కే. రహీం, కో-ఆప్షన్ సభ్యులు కొమరం హన్మంతరావు, సీపీఐ మండల సహాయ కార్యదర్శి కల్తీ నాగేశ్, డ్రైవర్లు కే.కృష్ణ, బీ.ఏకయ్య తదితరులు పాల్గొన్నారు.