‘రైతు పండుగ’ సందడి .. పాలమూరులో నిర్వహించిన సదస్సులో ఆకట్టుకున్న స్టాల్స్

‘రైతు పండుగ’ సందడి .. పాలమూరులో నిర్వహించిన సదస్సులో ఆకట్టుకున్న స్టాల్స్
  • వివిధ పంటలపై రైతులకు శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు
  • వ్యవసాయ పనిముట్లపై అవగాహన కల్పించిన వివిధ కంపెనీలు

మహబూబ్​నగర్, వెలుగు : పాలమూరులో గురువారం ‘రైతు పండుగ’ సంబురంగా ప్రారంభమైంది. మహబూబ్​నగర్, వికారాబాద్, పరిగి, నాగర్​కర్నూల్, వనపర్తి, గద్వాల, నారాయణపేట ప్రాంతాల నుంచి 60 ఆర్టీసీ బస్సుల్లో నాలుగు వేల మంది రైతులు తరలివచ్చారు. ముందుగా వ్యవసాయ అనుబంధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటైన155 స్టాల్స్​లోని వ్యవసాయ పనిముట్లను పరిశీలించారు. వాటి పని తీరును కంపెనీ ప్రతినిధులను అడిగి తెలుసుకుని రైతులు సంబుర పడ్డారు.

అనంతరం కొత్త  పంటలు, వాటి సాగు పద్ధతులపై స్టాళ్ల సమీపంలోని కాటేజ్​లో శాస్ర్తవేత్తలు వివరించారు. ఉదయం నుంచే స్టాల్స్​కు రైతులు క్యూ కట్టడంతో  రద్దీ నెలకొంది. సదస్సులో మొబైల్​ఫోన్​ద్వారా బోరు మోటారు కంట్రోల్​చేసే విధానం. ఫిషరిస్​ చిన్న పాండ్ వంటివి రైతులను ఆకట్టుకున్నాయి. రెండోరోజు శుక్రవారం సమీప జిల్లాలైన రంగారెడ్డి, మెదక్​, నల్లగొండ తదితర జిల్లాల నుంచి మరో ఐదు వేల మంది రైతులు తరలిరానున్నట్టు అధికారులు తెలిపారు. 

Also Read : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆఫీసర్ల బడి బాట

ట్రాక్టర్ ఎక్విప్ మెంట్స్ భలే..

సదస్సులో వ్యవసాయ యంత్రాలను ప్రదర్శించారు. డ్రోన్​ ద్వారా విత్తనాలు చల్లే విధానంపై రైతులకు అవగాహన కల్పించారు. వివిధ కంపెనీలకు చెందిన 20 రకాల ట్రాక్టర్లను ప్రదర్శనలో ఉంచారు. 33 కంపెనీలకు చెందిన వ్యవసాయ పని ముట్లను ట్రయల్​చేసి చూపించారు. ట్రాక్టర్​ఎక్విప్​మెంట్​కు సంబంధించిన 24 రకాల యంత్రాలు, మినీ ఎక్విప్​మెంట్​కు సంబంధించి 20 రకాల పని ముట్లు, 11 రకాల హ్యాండ్​టూల్స్​, పలు రకాల స్పెర్​పార్ట్స్​పై సదస్సుకు వచ్చిన రైతులకు అవగాహన కల్పించారు.

ఆకట్టుకున్న వెదురు స్టాల్

హార్టికల్చర్​ డిపార్ట్​మెంట్​ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వెదురు స్టాల్​ ఆకట్టుకుంది. జాతీయ వెదురు మిషన్​ద్వారా దీనికి సబ్సిడీ అందించనున్నారు. ఇంట్లో అలంకరించుకునే వస్తువులను తయారు చేస్తారు. స్టాల్​లో వెదురుతో తయారైన కారు, బైకు, బోట్​, కీచైన్​ వంటి 20 వస్తువులను ప్రదర్శించారు. మేదరులకు ఇది ఉపయోగపడనుంది. 50 శాతం సబ్సిడీ ఇవ్వనున్నారు. అలాగే 50 శాతంతో వెదుకు మొక్కలను సబ్సిడీగా ఇస్తున్నారు. 

హైలెట్​గా పశువుల స్టాల్స్

మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం మద్దిగట్లలోని పాలమూరు జెనెటిక్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో వివిధ జాతులకు చెందిన పశువుల స్టాల్స్​ను ఏర్పాటు చేశారు. గిర్, సాహివాల్, కంక్రేజ్, డియోని, ఒంగోలు, పుంగనూరు, ముర్రా, జాఫ్రాబాద్ వంటి ప్రముఖ జాతులు, స్వదేశీ, క్రాస్‌ బ్రీడ్ పశువులు ఉన్నాయి. ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ (ఐవీఎఫ్​), ఎంబ్రియో ట్రాన్స్​ఫర్​సాంకేతికత ద్వారా అత్యుత్తమ జన్యు లక్షణాలతో కూడిన ఆవులు, గేదెలను తయారు చేసి స్టాల్స్​లో ప్రదర్శించింది.