రైల్వే స్టేషన్లలో మహిళా సంఘాల స్టాల్స్.. 50 స్టేష‌‌న్లలో ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం

రైల్వే స్టేషన్లలో మహిళా సంఘాల స్టాల్స్.. 50 స్టేష‌‌న్లలో ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
  • మొదటి విడ‌‌త‌‌లో 14 చోట్ల ఏర్పాటు.. ఒక్కో స్టేష‌‌న్​లో ఒక్కో వెరైటీ
  • సికింద్రాబాద్ స్టేష‌‌న్​లో పిండి వంట‌‌లు, వరంగ‌‌ల్ స్టేష‌‌న్​లో తృణ‌‌ధాన్యాలు
  • ఘ‌‌న్​పూర్ స్టేష‌‌న్ లో చేతి ఉత్పత్తులు.. శంక‌‌ర్ ప‌‌ల్లిలో జూట్, క్లాత్ బ్యాగులు

హైదరాబాద్, వెలుగు: మహిళా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. మహిళలను ఆర్థిక పరిపుష్టి చేస్తే ఆ కుటుంబం బలోపేతం అవుతుందని భావించి.. వారికోసం ప్రత్యేక పథకాలను రూపొందిస్తూ.. ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే స్వయం ఉపాధి కోసం జిల్లా కేంద్రాల్లోని మహిళా ప్రాంగణాల్లో శిక్షణను ఉచితంగా ఇస్తున్నది.

 ప్రస్తుతం రైల్వే స్టేషన్లలో మహిళా స్వయం సహాయక బృందాల స్టాళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఉన్న 50 రైల్వే స్టేషళ్లలో 50 స్టాళ్లు ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం రైల్వే శాఖను సెర్ప్ అధికారులు ఒప్పించారు. ప్రతి రైల్వే స్టేషన్​లో ఒక స్టాల్ ఏర్పాటు చేసి.. వాటి నిర్వహణ బాధ్యతను స్వయం సహాయక బృందాలకు ఇవ్వనున్నారు. వాటిలో తెలంగాణ రుచులు, ఉత్పత్తులు ఉంచనున్నారు. మొదటి విడ‌‌త‌‌లో 14 మ‌‌హిళా స్టాళ్లకు రైల్వే అనుమ‌‌తులు మంజూరు చేసింది. ఇప్పటికే 7 స్టాళ్లను ప్రారంభించినట్లు తెలిసింది. ఈ స్టాల్స్ ఏర్పాటుతో ఆదాయంతో పాటు వారి ఉత్పత్తులను దేశానికి ప‌‌రిచ‌‌యం చేయబోతున్నారు.

స్టాళ్లలో లభించేవి ఇవే..

ప్రస్తుతం 14 మహిళా స్టాళ్లలో ఒక్కో స్టేషన్​లో ఒక్కో వెరైటీ వస్తువులు అందుబాటులో ఉంచుతున్నారు. వరంగ‌‌ల్ స్టేష‌‌న్​లో తృణ‌‌ధాన్యాలు, జూట్ బ్యాగులు.. సికింద్రాబాద్ స్టేష‌‌న్​లో పిండి వంట‌‌లు, స్టేషన్ ఘ‌‌న్​పూర్ స్టేష‌‌న్​లో చేతి ఉత్పత్తులు, ఖ‌‌మ్మంలో స‌‌కినాలు, ల‌‌డ్డూలు, కారంపూస, రంగారెడ్డి జిల్లా శంక‌‌ర్ ప‌‌ల్లిలో జూట్ బ్యాగులు, క్లాత్ బ్యాగులు, వికారాబాద్​లో గాజులు, పూస‌‌లు, హారాలు, యాదాద్రి భువనగిరిలో తెలంగాణ పిండివంటకాలు, జనగామలో చేతివృత్తులు, స్థానికంగా లభించే ఉత్పత్తులు, నల్గొండ జిల్లా చర్లపల్లిలో పోచంపల్లి చీరలు, ఇకో ఫ్రెండ్లీ టీ కప్స్, కుండలు, బౌల్స్, వాటర్ బాటిళ్లు, ఆసిఫాబాద్ సిర్పూర్​లో సకినాలు, మురుకులు, కారంపూస, హోంమేడ్ వంటకాలు, భద్రాచలంలో పచ్చళ్లు, కరీంనగర్​లో తృణధాన్యాలు రైల్వే స్టాళ్లలో అందుబాటులో ఉంచుతున్నట్లు అధికారులు తెలిపారు. మ‌‌హిళలకు ఆర్థిక చేయూతనిచ్చేలా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదని వెల్లడించారు. 

మంత్రి సీత‌‌క్క చొరవ

కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి మహిళా సంక్షేమంపై ప్రత్యేక దృష్టిసారించింది. మహిళా సంక్షేమ శాఖ మంత్రిగా సీతక్క బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మహిళల కోసం ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. పథకాల అధ్యయనంతో పాటు ఏ మేరకు సత్ఫలితాలు ఇస్తాయని గ్రౌండ్ రిపోర్టు తెలుసుకున్న తర్వాతే వాటి అమలుకు చర్యలు తీసుకుంటున్నారు. 

సంక్షేమంతోపాటు మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో రైల్వే స్టేషన్లలో మహిళా స్టాళ్ల ఏర్పాటుకు చొరవ తీసుకున్నారు. రైల్వేశాఖ అధికారులను ఒప్పించి.. రాష్ట్రంలో ఉన్న 50 స్టేషన్లలో తొలి విడతగా 14 ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ స్టాళ్ల ఏర్పాటుతో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలువబోతుందని తెలిపారు.