Team India Victory Parade: టీమిండియా విక్టరీ పరేడ్ లో తొక్కిసలాట.. పలువురికి గాయాలు

Team India Victory Parade: టీమిండియా విక్టరీ పరేడ్ లో తొక్కిసలాట.. పలువురికి గాయాలు

టీ20 ప్రపంచకప్ విజయాన్ని పురస్కరించుకొని బీసీసీఐ నిర్వహించిన టీమిండియా విజయోత్సవ ర్యాలీలో అపశృతి చోటుచేసుకుంది. ముంబైలో నారిమన్ పాయింట్ నుంచి వాంఖడే స్టేడియం వరకు చేపట్టిన ఈ విక్టరీ పరేడ్లో పలువురు క్రికెట్ అభిమానులు గాయపడగా, మరి కొందరు అస్వస్థకు గురయ్యారు. వీరు సమీప ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ముంబై పోలీస్ అధికారులు తెలిపారు.

13 ఏండ్ల తర్వాత ప్రపంచకప్‌ ట్రోఫీని ముద్దాడి స్వదేశానికి తిరిగొచ్చిన భారత జట్టుకు ‘ఢిల్లీ నుంచి ముంబై’ దాకా అడుగడుగునా ఘనస్వాగతం లభించింది. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం అనంతరం ముంబై చేరిన రోహిత్‌ సేన.. బీసీసీఐ ఏర్పాటు చేసిన విజయోత్సవ ర్యాలీలో పాల్గొంది. క్రికెటర్లు ఓపెన్ టాప్ బస్సుపై ఊరేగుతూ అభిమానులతో కలిసి విజయాన్ని జరుపుకున్నారు. దీన్ని తిలకించేందుకు లక్షలాది మంది అభిమానులు ముంబై సముద్రపు ఒడ్డుకు విచ్చేశారు. నారీమన్‌ పాయింట్‌ నుంచి వాంఖడే స్టేడియం వరకు ఎటుచూసినా జనం..! జనం..!! జనం..!!! రోజూ సాయంత్ర వేళల్లో ప్రశాంతంగా ఉండే ఆ ప్రాంతమంతా ఇసుకేస్తే రాలనంత జన ప్రభంజనాన్ని తలపించింది. 

విక్టరీ పరేడ్ ఆలస్యం

అనుకున్న షెడ్యూల్‌ (సాయంత్రం 5 గంటలకు) కంటే విజయయాత్ర రెండు గంటలు ఆలస్యంగా (రాత్రి 7.30 గంటలకు) మొదలైంది. అయినప్పటికీ అభిమానులు తాము ఆరాధించే ఆటగాళ్ల కోసం గంటల తరబడి వేచి చూశారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా నిరీక్షించారు. ఇక ఓపెన్‌ టాప్‌ బస్సులో విక్టరీ పరేడ్‌ మొదలయ్యాక ఆటగాళ్లకు అడుగడుగునా జననీరాజనమే. ఈ క్రమంలో అభిమానులు.. తమ అభిమాన క్రికెటర్లను దగ్గర నుంచి చూసేందుకు పోటీపడ్డారు. దాంతో, తొక్కిసలాట చోటు చేసుకుంది. ముంబై నారిమన్ పాయింట్ వద్ద కుప్పలు కుప్పలుగా చెప్పులు పడి ఉన్నాయి. 

"లక్షలాదిమంది పోగవ్వడంతో పోలీసుల నుంచి రక్షణ కరువైంది. ఏదీ క్రమబద్ధీకరించబడలేదు. జట్టు రాగానే ప్రజలు అరవడం మొదలుపెట్టారు, నా ముందు నిలబడి ఉన్నవారు పడిపోయారు...’’ అని విజయ పరేడ్ సందర్భంగా మెరైన్ డ్రైవ్‌లో ఉన్న క్రికెట్ అభిమాని మీడియాకు తెలిపారు.