మహా కుంభమేళాలో తొక్కిసలాట 30 మంది మృతి

మహా కుంభమేళాలో  తొక్కిసలాట 30 మంది మృతి
  • మౌని అమావాస్య కావడంతో పోటెత్తిన భక్తులు
  • పుణ్య స్నానం కోసం త్రివేణి సంగమానికి బారులు
  • రద్దీ పెరగడంతో బారికేడ్లు దాటేందుకు ప్రయత్నం
  • బారికేడ్లు విరిగిపోవడంతో తొక్కిసలాట.. 60 మందికి గాయాలు
  • అఖాడా మార్గ్​లోని సెక్టార్ 2లో ఘటన
  • తొక్కిసలాట ప్రాంతంలో గుట్టల కొద్దీ బ్యాగులు, చెప్పులు, దుప్పట్లు
  • 50 కిలోమీటర్ల మేర ట్రాఫిక్​ జామ్​
  • ఘటనపై సీఎం యోగితో మాట్లాడిన ప్రధాని మోదీ
  • ఒక్క రోజే 10 కోట్లకుపైగా భక్తుల పుణ్య స్నానాలు

మహాకుంభ్​నగర్ (యూపీ): ప్రయాగ్​రాజ్ మహాకుంభ మేళాలో బుధవారం తెల్లవారుజామున తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 30 మంది భక్తులు చనిపోయారు. 60 మంది గాయపడ్డారు. రష్ కంట్రోల్ చేసేందుకు ఏర్పాటు చేసిన బారికేడ్లు దాటేందుకు ప్రయత్నించడంతోనే తొక్కిసలాట జరిగిందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. గాయపడిన వారిని మేళా నిర్వాహకులు అంబులెన్స్​లో హాస్పిటల్​కు తరలించారు. అఖాడా మార్గ్​లో త్రివేణి సంగమానికి కిలో మీటర్ దూరంలో ఉన్న సెక్టార్ 2లో ఈ తొక్కిసలాట జరిగింది. 

ఈ ఘటన తర్వాత ఆ ప్రాంతమంతా గుట్టలకొద్దీ బ్యాగులు.. చెప్పులు.. బట్టలు.. దుప్పట్లు దర్శనమిచ్చాయి. మృతుల్లో 25 మందిని గుర్తించినట్లు డీఐజీ వైభవ్‌‌ కృష్ణా అధికారికంగా వెల్లడించారు. మరో ఐదుగురి గురించి ఆరా తీస్తున్నట్లు తెలిపారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. కాగా, బుధవారం మౌని అమావాస్య కావడంతో పుణ్య స్నానమాచరించేందుకు కోట్లాది మంది భక్తులు త్రివేణి సంగమానికి పోటెత్తారు. మెయిన్ ఘాట్​లో అఖాడాల పుణ్య స్నానాల కోసమే ఏర్పాట్లు చేయగా.. కోట్లాది మంది భక్తులు అటువైపు వెళ్లినట్లు తెలుస్తున్నది.

మధ్యాహ్నం పుణ్యస్నానాలు చేసిన సాధువులు

తొక్కిసలాట తర్వాత కొంత సేపు పుణ్య స్నానాలను అధికారులు ఆపేశారు. అనంతరం మైక్​లో కీలక ఆదేశాలు జారీ చేశారు. పుణ్య స్నానాలు ఆచరించేందుకు వచ్చిన భక్తులంతా.. తమకు దగ్గర్లో ఉన్న ఘాట్లలోనే స్నానాలు చేయాలని సూచించారు. త్రివేణి సంగమానికి వచ్చే ప్రయత్నం చేయొద్దని తెలిపారు. ఘటన తర్వాత.. అధికారులు హెలికాప్టర్లను రంగంలోకి దించారు. మేళా జరుగుతున్న ప్రాంతంలో హెలికాప్టర్లతో చక్కర్లు కొడుతున్నారు. పరిస్థితిని అంచనా వేస్తూ ఎప్పటికప్పుడు గ్రౌండ్ స్టాఫ్ కు తెలియజేస్తున్నారు. అయితే, తెల్లవారుజామునే అఖాడాలకు చెందిన సాధువులు స్నానం చేయాలని భావించారు. కానీ.. ఈ ఘటన తర్వాత సీఎం యోగి ఆదిత్యనాథ్ సూచన మేరకు వారు తమ పుణ్య స్నానాన్ని మధ్యాహ్నానికి వాయిదా వేశారు. సుమారు 2.30 గంటలకు వేలాది మంది సాధువులు మెయిన్ ఘాట్​లోని త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేశారు.

50 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్

మౌని అమావాస్య కావడంతో పుణ్య స్నానాలకు వచ్చే భక్తులతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. సుమారు 50 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌‌ జామ్‌‌ కాగా.. త్రివేణి సంగమానికి 30 కిలో మీటర్ల వరకే అధికారులు వాహనాలను అనుమతిస్తున్నారు. అక్కడి నుంచి భక్తులంతా త్రివేణి సంగమానికి చేరుకుంటున్నారు. మధ్యప్రదేశ్​– యూపీ బార్డర్​లో వేలాది వాహనాలు చిక్కుకుపోయాయి. భక్తులకు మధ్యప్రదేశ్ అధికారులు నీళ్లు, భోజనం అందిస్తున్నారు. రేవా సిటీ నుంచి 130 కిలో మీటర్ల దూరంలో ప్రయాగ్​రాజ్ ఉంది. ట్రాఫిక్ జామ్ అయిన చోట టెంపరరీ హాస్పిటల్స్ ఏర్పాటు చేసినట్లు మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ తెలిపారు. కాగా, రద్దీ దృష్ట్యా ప్రయాగ్​రాజ్ కు వచ్చే పలు రైళ్లను అధికారులు రద్దు చేసినట్లు తెలిసింది.

గతంలో తొక్కిసలాట ఘటనలు

తొలిసారి 1954లో అలహాబాద్ (ప్రయాగ్​రాజ్)లో కుంభ మేళా నిర్వహించారు. ఫిబ్రవరి 3న మౌని అమావాస్య సందర్భంగా నదిలో జరిగిన తొక్కిసలాటలో 800 మంది చనిపోయారు.
1986: హరిద్వార్​లో జరిగిన కుంభమేళాలో తొక్కిసలాట కారణంగా 200 మంది చనిపో యారు. ఏప్రిల్ 14న నాటి యూపీ సీఎం వీర్‌‌బహదూర్‌‌ సింగ్‌‌, పలు రాష్ట్రాల సీఎంలు, ఎంపీలు స్నానాలకు వచ్చినప్పుడే ఈ ఘటన జరిగింది. 
2003: మహారాష్ట్ర నాసిక్​లోని గోదావరిలో పుణ్య స్నానం చేసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ ఘటనలో 39 మంది చనిపోయారు. 100కు పైగా భక్తులు గాయపడ్డారు.
2013: ఫిబ్రవరి 10న కుంభమేళా సందర్భంగా అలహాబాద్ రైల్వే స్టేషన్​లో ఫుట్ బ్రిడ్జి కూలిపోయింది. ఈ ఘటనలో 42 మంది చనిపోయారు. 45 మంది గాయపడ్డారు.

అసలేం జరిగింది?

మౌని అమావాస్య రోజు గంగానదిలో ప్రత్యేకించి త్రివేణి సంగమంలోని జలాలు అమృతంతో సమానంగా ఉంటాయనేది భక్తుల విశ్వాసం. ఈ సమయంలో పుణ్యస్నానమాచరిస్తే ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుందనే నమ్మకంతో బుధవారం మహా కుంభమేళాకు కోట్లాది భక్తులు పోటెత్తారు. వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు నెత్తిన బ్యాగులు.. చేతుల్లో నీళ్ల బాటిళ్లతో త్రివేణి సంగమం మెయిన్ ఘాట్‌‌ వద్ద పుణ్యస్నానాలు చేసేందుకు కదిలారు. బుధవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో రద్దీ ఒక్కసారిగా పెరిగిపోవడంతో కొందరు భక్తులు కర్రలతో ఏర్పాటు చేసిన బారికేడ్లు దాటేందుకు ప్రయత్నించారు. 

అవి కాస్తా విరిగిపోయాయి. భక్తులంతా ఒకరినొకరు తోసుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో తోపులాట జరిగింది. వెంట తెచ్చుకున్న బ్యాగులు, దుప్పట్లు, లగేజీతో పరిగెత్తలేక కొందరు కింద పడిపోయారు. అధికారులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. గాయపడిన వారిని అంబులెన్సుల్లో హాస్పిటల్​కు తరలించారు. రద్దీ కారణంగా ఒక దశలో అంబులెన్స్‌‌కు కూడా దారి లేని పరిస్థితి ఏర్పడింది.

మోదీ నాలుగు సార్లు ఫోన్ చేశారు: సీఎం యోగి

మోదీ తనతో నాలుగు సార్లు ఫోన్​లో మాట్లాడినట్లు సీఎం యోగి తెలిపారు. ‘‘తొక్కిసలాట జరగడం బాధాకరం. మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నాం. ఈ ఘటన తర్వాత సంగమంలో పరిస్థితి అదుపులోనే ఉన్నది. సుమారు 10 కోట్ల మందిపైనే మౌని అమావాస్య సందర్భంగా పుణ్య స్నానాలు ఆచరించారు. ఎవరూ వదంతులు నమ్మొద్దు. తమకు దగ్గర్లో ఉన్న ఘాట్​లోనే స్నానం చేయాలి’’అని సీఎం యోగీ ఆదిత్యనాథ్​  తెలిపారు. 

మృతులకు ప్రముఖుల సంతాపం

తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు. గాయపడిన వాళ్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ..‘‘నేను సీఎం యోగితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నా. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్న’’ అని మోదీ అన్నారు. కేంద్ర మంత్రి అమిత్‌‌ షా, గవర్నర్‌‌ ఆనందిబెన్ పటేల్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఈ ఘటన గురించి ఆరా తీశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగిందని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, ఎంపీ రాహుల్ గాంధీ, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ మండిపడ్డారు.

 తొక్కుకుంటూ వెళ్లారు

తొక్కిసలాటతో చాలామంది తమ తప్పిపోయారు. 2 బస్సుల్లో 60 మంది కలిసి వస్తే.. 9 మంది మాత్రమే ఉన్నామని, మిగిలినవాళ్ల ఆచూకీ దొరకడం లేదని కర్నాటక భక్తురాలు తెలిపారు. అన్ని సైడ్ల నుంచి నెట్టడంతో ఎటూ జరగలేక కిందపడిపోయామని, తన తల్లికి గాయాలయ్యాయని మధ్యప్రదేశ్​ భక్తుడు ఒకరు  చెప్పారు.

 తొక్కిసలాట జరగడంతో తన బిడ్డ కింద పడిపోయాడని, అందరూ తొక్కుకుంటూ వెళ్లారని ఓ మహిళ వివరించింది. ఐరన్ చెత్త కుండీల కారణంగానే తాము కిందపడ్డామని, దీంతో తొక్కిసలాట జరిగిందని మరికొందరు తెలిపారు.