న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‎లో తొక్కి సలాట

న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‎లో తొక్కి సలాట

న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో శనివారం (ఫిబ్రవరి 15) రాత్రి తొక్కిసలాట జరిగింది. ప్లాట్‌ఫారమ్ నంబర్ 14, 15లలో రైళ్ల కోసం ప్రయాణికులు ఒక్కసారిగా ఎగబడటంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో కొందరు ప్రయాణికులు గాయపడగా.. మరి కొందరు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హుటాహటిన ఆసుపత్రికి తరలించారు. తొక్కిసలాటలో కొందరు ప్రయాణికులు మృతి చెందినట్లు తెలుస్తోంది. మహాకుంభమేళా వెళ్లేందుకు పెద్ద ఎత్తున ప్రయాణికులు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌కు రావడంతోనే తొక్కిసలాట జరిగినట్లు సమాచారం.

 

టికెట్లు లేని ప్రయాణికులు ఒక్కసారిగా రావడమే ఇందుకు కారణమని అధికారులు అనుమానిస్తున్నారు. పరిస్థితిని నియంత్రించడానికి భారత రైల్వే అధికారులు, ఢిల్లీ పోలీసులు ప్రస్తుతం ఘటన స్థలంలోనే ఉన్నారు. టిక్కెట్లు లేకుండా ప్రయాణికులు ఎలా వచ్చారో తెలుసుకోవడానికి దర్యాప్తు జరుగుతోన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తొక్కిసలాట నేపథ్యంలో రైల్వే స్టేషన్ ను మూసివేసిన అధికారులు.. క్షతగ్రాతులను ఆసుపత్రులకు తరలిస్తున్నారు.