పూరి:ఒడిశాలోని పూరీలో జరుగుతున్న జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట జరిగింది. రథం లాగుతుండగా తోపులాట జరగడంతో ఓ భక్తుడు ప్రాణాలు కోల్పో యాడు. పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించారు.
మధ్యాహ్నం మూడు గంలకు పూరీ రాజు గజపతి దివ్య సింగ్ దేవ్ రథాలపై చెరాపహారా పూర్తి చేశారు. సాయంత్రం 4 గంటలకు రథాలకు సారథులు, అశ్వాలను తాళ్లు కట్టి అమర్చారు. ఆదివారం సాయంత్రం 5.20 గంలకు రథయాత్ర ప్రారంభమయింది. కొద్దిసేపటికే భక్తుల మధ్య తోపులాట జరిగింది. భారీ ఊరేగింపు జరుగుతున్న పూరీలోని గ్రాండ్ రోడ్ బడా దండాలో ఈ ఘటన జరిగింది.
రథం లాగుతున్న సమయంలో జరిగిన ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సంప్రదాయ బద్ధంగా ఊరేగింపును నడిపించే బలభద్ర స్వామి రథాన్ని లాగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
ప్రతి యేటా జరిగే ఒడిశాలోని పూరి జగన్నాథ్ రథయాత్ర అద్భుతమైన రథాలను చూసేందుకు వాటిని లాగడంలో పాల్గొనేందుకు వేలాది మంది భక్తులు వస్తుంటారు. పూరిలోని జగన్నాథ దేవాలయం నుంచి 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచా ఆలయం వైపు వేలాది మంది ప్రజలు పెద్ద రథాలను ముందుగా లాగారు.
పూరీ శంకరాచార్య స్వామి నిశ్చల నాద సరస్వతి తన శిష్యులతో కలిసి భగవాన్ జగన్నాథుడు, బలభద్రుడు, దేవీ సుభద్రల రథాలను సందర్శించిన తర్వాత ఆదివారం సాయంత్రం 5.20 గంటలకు రథం లాగడం ప్రారంభమైన కొద్ది సేపటికే ఈ ప్రమాదం జరిగింది.