జీహెచ్ఎంసీకి రూ.3,030 కోట్లు.. రిలీజ్​ చేసిన స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖ

హైదరాబాద్ సిటీ, వెలుగు: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నుంచి జీహెచ్ఎంసీకి ఆరేండ్లుగా రావాల్సిన స్టాంపు డ్యూటీ రూ.3,030 కోట్లను గతనెలలో రిలీజ్ చేసింది. మొత్తం రూ.3,169 కోట్లు రావాల్సి ఉంది. ఇందులో స్టాంప్ డ్యూటీకి సంబంధించి రూ.3,030 కోట్లు, మ్యుటేషన్​ఫీజుల కింద రూ.139 కోట్లు రావ్వాల్సి ఉండగా, ఇందులో స్టాంప్ డ్యూటీ మొత్తాన్ని బల్దియా పర్సనల్ డిపాజిట్స్(పీడీ) అకౌంట్ లో జమచేసింది. అయితే ఈ నిధులను రెవెన్యూ ఖర్చుల కోసం మాత్రమే వినియోగించే వీలుంటుంది.

డెవలప్ మెంట్ కోసం ఒకేసారి వాడుకునేందుకు వీలులేదు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ జీతాలు, మెయింటెనెన్స్, లోన్ల రీ పేమెంట్స్ కోసం వినియోగించనున్నారు. ప్రస్తుతం బల్దియాకి నెలకి రూ.500 కోట్ల వరకు అవసరముంది. తాజాగా స్టాంప్​డ్యూటీ నిధులతో జీహెచ్ఎంసీకి ఎంతో భారం తగ్గింది. ఇక ఒకటో తేదీన జీతాలు వేసే అవకాశముంది. మెయింటెనెన్స్ పనులకి సంబంధించిన బిల్లులను వెంటనే అందించేందుకు అవకాశముంది.