మాకు అండగా నిలబడండి ట్రంప్‌‌ ఆంక్షల నేపథ్యంలో సభ్యదేశాలను కోరిన ఐసీసీ

మాకు అండగా నిలబడండి ట్రంప్‌‌ ఆంక్షల నేపథ్యంలో సభ్యదేశాలను కోరిన ఐసీసీ

ది హేగ్‌‌: అంతర్జాతీయ క్రిమినల్‌‌ కోర్టు (ఐసీసీ)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌‌ ట్రంప్‌‌ విధించిన ఆంక్షలను ఆ సంస్థ ఖండించింది. ట్రంప్ విధించిన ఆంక్షలకు వ్యతిరేకంగా నిలబడాలని తన సభ్యదేశాలను ఐసీసీ కోరింది. ఈ చర్య ఐసీసీ స్వతంత్ర, నిష్పాక్షిక న్యాయ వ్యవస్థకు హాని కలిగిస్తుందని పేర్కొంది. అమెరికా దాని మిత్రదేశమైన ఇజ్రాయెల్‌‌ను లక్ష్యంగా చేసుకొని ఐసీసీ చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడుతోందని ట్రంప్ ఆరోపిస్తున్నారు. 

దీంతో ఐసీసీపై ఆంక్షలు విధిస్తూ గురువారం ఎగ్జిక్యూటివ్‌‌ ఆర్డర్‌‌‌‌పై ట్రంప్​ సంతకం చేశారు. గాజాపై ఇజ్రాయెల్‌‌ చేస్తున్న నరమేధానికి ఆ దేశ అధ్యక్షుడు బెంజమిన్‌‌ నెతన్యాహుపై ఐసీసీ గతేడాది అరెస్ట్‌‌ వారెంట్‌‌ జారీ చేసింది. ఈ విషయాన్ని గుర్తుచేస్తూ ట్రంప్​ ఐసీసీపై ఆంక్షలు విధించారు. ఐసీసీ అధికారులు అమెరికాలో అడుగుపెట్టకుండా చేశారు. 

కాగా, ప్రపంచవ్యాప్తంగా వేధింపులకు, అణచివేతకు గురైన బాధితులకు ఐసీసీ అండగా ఉంటుందని, వారికి న్యాయం జరిగేంత వరకు పోరాడుతుందని ఓ ప్రకటనలో తెలిపింది. న్యాయం కోసం, ప్రాథమిక మానవ హక్కుల కోసం ప్రపంచ దేశాలతో పాటు 125 ఐసీసీ 
సభ్య దేశాలు అండగా నిలబడాలని కోరింది.