ప్రపంచంలో ఎన్నో ప్రత్యేకతలు కలిగిన నది బ్రహ్మపుత్ర. పైన పటారాన్ని, లోన చెత్తాచెదారాన్ని నింపుకున్న ఈ నదిని బాగుచేయటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెడీ అవుతున్నాయి. రూ.400 కోట్లతో నదిలో సెడిమెంట్ని తవ్వి తీసి తరలించే పనులను మొదలుపెట్టబోతున్నాయి. అయితే ఈ దిశగా అసలు సమస్యను అర్థంచేసుకుంటే అక్షరాలా కోట్ల రూపాయలు ఆదా అవుతాయని నిపుణులు సూచిస్తున్నారు. ఆ సలహాలను సర్కార్లు పాటిస్తే నిధులు నీళ్ల పాలు కాకుండా చూడొచ్చని చెబుతున్నారు.
ప్రపంచంలో చెత్తాచెదారం భారీగా చేరిన నదుల లిస్టులో బ్రహ్మపుత్ర రెండో స్థానంలో ఉంది. ఒక స్క్వేర్ కిలోమీటర్ ఏరియాలో పేరుకుపోయిన సెడిమెంట్ ఆధారంగా ఈ ‘ర్యాంక్’ ఇచ్చారు. ఈ విషయంలో చైనాలోని యెల్లో రివర్ తర్వాతి ప్లేసు బ్రహ్మపుత్రదే. దీంతో ఈ నదిని బాగుచేయటానికి కేంద్రం, అస్సాం ప్రభుత్వం సిద్ధమయ్యాయి. మొదట రూ.400 కోట్లతో పనులు మొదలుపెట్టడానికి ప్లాన్ రెడీ చేశాయి. బ్రహ్మపుత్ర అడుగున మేట వేసిన మడ్డిని తవ్విపోయటం వల్ల ముఖ్యంగా రెండు ప్రయోజనాలు ఉన్నాయి.
ఒకటి.. నది అడుగున పెద్దఎత్తున తిష్ట వేసిన బురదను తొలగిస్తే ఆ ఖాళీ ప్రదేశంలో మరింత ఎక్కువ నీరు నిల్వ ఉంటుంది. తద్వారా ఈ నది కారణంగా వచ్చే వరదలు తగ్గుముఖం పడతాయి. రెండు.. బ్రహ్మపుత్రను పొరుగు దేశంలోకి పెద్ద పడవల రాకపోకలకు అనువుగా మార్చటం. ఈ నదికి ఇన్లాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా.. ‘నేషనల్ వాటర్‌వే–2’ హోదా ఇవ్వటం ఈ సందర్భంగా చెప్పుకోదగ్గ విషయం. ఇండియా, బంగ్లాదేశ్ మధ్య జలమార్గ రవాణాకు బ్రహ్మపుత్రను కీలకంగా మార్చటానికే ఈ నిర్ణయం తీసుకున్నారు.
సెడిమెంట్ అన్ని చోట్లా ఒకేలా ఉండదా?!
బ్రహ్మపుత్రలోని మురికిని తీసి పారేసే ప్రక్రియను ప్రారంభించే ముందు అసలు ఆ సెడిమెంట్ స్వభావాన్ని అర్థం చేసుకోవటం చాలా అవసరం. ఎందుకంటే నదిలో మట్టి పనులు చేసేటప్పుడు తవ్వే గుంటలు ఆ తర్వాత మళ్లీ పూర్తిగా లేదా కనీసం సగమైనా బురదతో నిండుతాయి. అందువల్ల తవ్వకం పనులు చేపట్టడం సరికాదు. దీంతో పాటు నది పొడవునా సెడిమెంట్ ఒకే విధంగా ఉండదు. బ్రహ్మపుత్ర పుట్టిన దేశం టిబెట్. అక్కడి సెలా జంగ్ ప్రాంతంలో ఒక స్క్వేర్ కిలోమీటర్‌కి సుమారు 150 టన్నుల చొప్పున చెత్తాచెదారం కుప్పపడి ఉంటుంది.
ఈ నదీ జలాలు హిమాలయ పర్వతాలను దాటి ఇండియాలోని అరుణాచల్‌ప్రదేశ్‌లో పాసి ఘాట్ ప్రాంతానికి చేరేటప్పటికి వేస్టేజీ పదింతలు (1495 టన్నులకు) పెరుగుతుంది. దీన్నిబట్టి బ్రహ్మపుత్రలో పారే నీరు మెత్తని రాళ్ల నుంచి, హిమాలయాల్లోని కొండచరియలు విరిగిపడ్డ ప్రాంతాల నుంచి మడ్డిని కలుపుకొని వస్తున్నట్లు భావించాలి. నదిలోని దాదాపు 70 శాతం వ్యర్థాలకు హిమాలయ పర్వతాల్లోని ఎత్తైన శ్రేణులే కారణమని నిపుణులు 19 ఏళ్ల క్రితమే తేల్చేశారు. ఎస్.కృష్ణస్వామి, కె.సింగ్ అనే ఎక్స్‌పర్ట్‌లు ‘కరెంట్ సైన్స్, జర్నల్‌లో దీని గురించి రాశారు.
బ్రహ్మపుత్ర మన దేశం నుంచి బంగ్లాదేశ్‌లోకి ఎంటరయ్యే ముందు అస్సాం మీదుగా ప్రవహిస్తుంది. ఈ నదీ జలాల ఉరుకులు పరుగులతో ఆ రాష్ట్రంలో లోయ ప్రాంతం ఏర్పడింది. అస్సాంలో కొన్ని చోట్ల ఈ నది వెడల్పు 10 కిలోమీటర్లు. జోర్హాత్ ఏరియాకి దగ్గరలో రెండు పాయలుగా విడిపోయి వంద కిలోమీటర్ల దిగువన కలుస్తుంది. తద్వారా మజూలి ద్వీపాన్ని ఏర్పరుస్తోంది. మజూలి ప్రపంచంలోనే అతి పెద్ద నదీ ద్వీపం. గౌహతి సమీపంలోని హజో గ్రామం దగ్గర షిల్లాంగ్ పీఠభూమిని కోస్తూ ప్రవహించడం వల్ల ఈ నది వెడల్పు చాలా సన్నగా మారుతుంది.
వివరాలు రహస్యం
మజూలి ఏరియాలో సెడిమెంట్ లోడ్.. పాసి ఘాట్ వద్ద కన్నా కొంచెం ఎక్కువే (1513 టన్నులు) ఉంటుంది. దిబంగ్, లోహిత్ అనే రెండు నదులు బ్రహ్మపుత్రలో కలవటమే ఈ చెత్తాచెదారం పర్సంటేజీ పెరగటానికి కారణం. బ్రహ్మపుత్ర ట్రాన్స్–బౌండరీ నది కావటంతో నీటి ప్రవాహం, సెడిమెంట్ లోడ్ వంటి డేటాను రెండు దేశాలు ఒకదానికొకటి పంచుకుంటాయి. ఈ వివరాలను జనానికి అందుబాటులో ఉంచరు. ఈ సమాచారాన్ని ఎవరికీ చెప్పబోమనే కండిషన్‌పై రీసెర్చర్లు ఎంతో కష్టపడి డేటాని పొందగలిగారు.
నదీ తవ్వకాలు సరికాదు
నేచురల్ వరదల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. నేల సారవంతమవుతుంది. సడన్‌గా, పెద్ద మొత్తంలో వచ్చే ఆర్టిఫిషియల్ వరదలతో భూమి సారవంతం కాకపోగా ఎక్కడ పడితే అక్కడ కోతకు గురవుతుంది. అందువల్ల భారీ నీటి ప్రవాహాల కట్టడికి నదుల గట్లను, వాటిపై డ్యామ్‌లను మరింత పక్కాగా కట్టాలి. దెబ్బతిన్న నిర్మాణాలను రిపేర్ చేయాలి. అంతేగానీ నదుల్లో తవ్వకాలు చేపట్టడం సరికాదు. సెడిమెంట్ అంశాలను అన్ని కోణాల్లో స్టడీ చేయాలి. అప్పుడే ఇలాంటి పెద్ద ప్రాజెక్టులు సక్సెస్ అవుతాయి.
సెడిమెంట్ లోడ్ రెండు రకాలు
బ్రహ్మపుత్ర సెడిమెంట్ లోడ్ రెండు రకాలు. ఒకటి.. సస్పెండెడ్ లోడ్. రెండు.. బెడ్ లోడ్. మెజర్మెంట్ తీసుకునే సమయంలో నీళ్లతోపాటు వచ్చే బురదను సస్పెండెడ్ లోడ్ అంటారు. నది అడుగు భాగంలో పోగయ్యే మడ్డిని బెడ్ లోడ్‌గా వ్యవహరిస్తారు. నదీ జలాల్లో కొట్టుకొచ్చిన బురద ఏటా యావరేజ్‌గా 402 మిలియన్ టన్నులు ఉంటుందని 1955–79 డేటా చెబుతోంది. గువాహటిలో పాండు మెజరింగ్ స్టేషన్ వద్ద ఈ వివరాలను నమోదు చేశారు. సెడిమెంట్ డేటాని లీక్ చేయకూడదనే రూలు అమల్లో ఉన్నా అది బయటకు పొక్కడం గమనార్హం.
వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రకారం 1978–91లో యాన్యువల్ యావరేజ్ సెడిమెంట్ ఈల్డ్ 527 మిలియన్ టన్నులు. బ్రహ్మపుత్ర బంగ్లాదేశ్ నుంచి ఇండియాలోకి ప్రవేశించే గోల్పరా సమీపంలోని పంచరత్నలో ఈ లెక్కలు సేకరించారు. నిజానికి ఈ యావరేజ్ డేటా చాలా చిన్నది. వానా కాలంలో (మే–అక్టోబర్‌లో) పాండు మెజరింగ్ స్టేషన్ వద్ద రోజుకు 2.12 మిలియన్ మెట్రిక్ టన్నుల సెడిమెంట్ రవాణా అవుతోంది. దీన్నిబట్టి ఏడాది మొత్తం మీద ట్రాన్స్పోర్ట్ అయ్యే చెత్తాచెదారంలో 95 శాతం ఈ ఆరు నెలల్లోనే ప్రవహిస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు. ఈ మొత్తం చెత్తను తరలించాలంటే లక్షా 41 వేల 300 ట్రక్కులు అవసరం. ఒక్కో ట్రక్కు 15 టన్నుల సెడిమెంట్ని రవాణా చేయగలిగితేనే ఇది పూర్తి కావటం సాధ్యం. సస్పెండెడ్ సెడిమెంట్ లోడ్‌ను అడపాదడపా కొలుస్తున్నా బెడ్ లోడ్ లెక్కలు తీసిన సందర్భాలు మాత్రం లేవనే చెప్పాలి. ఇండియన్ జర్నల్ ఆఫ్ ఎర్త్ సైన్సెస్‌లో రాసిన కాలమ్‌లో దులాల్ గోస్వామి అనే ఎక్స్పర్ట్ ఈ బెడ్ లోడ్ డేటా గురించి ప్రస్తావించారు. పాండు ప్రాంతం వద్ద బ్రహ్మపుత్ర నదిలోని మొత్తం సెడిమెంట్ లోడ్‌లో 5–15 శాతం బెడ్ లోడేనని ఆయన స్పష్టం చేశారు.
మెరుపు వరదలకు పెట్టింది పేరు
ఆసియాలోని ముఖ్య నదుల్లో బ్రహ్మపుత్ర ఒకటి. ఇండియాతోపాటు పొరుగు దేశం బంగ్లాదేశ్‌లోనూ చాలా నదులకు ఆడ పేరు (ఉదాహరణకు గంగ, యమున, తపతి) ఉంటాయి. కానీ, దీనికి బ్రహ్మపుత్ర అని మగ పేరు పెట్టారు. ఈ నది టిబెట్, ఇండియా, బంగ్లాదేశ్ గుండా ప్రవహిస్తుంది. ఒక్కో చోట ఒక్కో పేరుతో పిలుస్తారు. టిబెట్‌లో పుట్టిన బ్రహ్మపుత్రను సౌత్ టిబెట్‌లో ‘దిహాంగ్’ అని, మిగతా టిబెట్‌లో త్సాంగ్‌పో అని అంటారు. బంగ్లాదేశ్‌లో జమున, పద్మ పేర్లతో వ్యవహరిస్తారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో సియాంగ్ నదిగా చెప్పుకుంటారు. సహజంగా అలలు సముద్రంలోనే సాధ్యం. కానీ ప్రపంచంలో టైడల్ బోర్ (అలల పోటు)ను ప్రదర్శించే అరుదైన నదుల్లో ఇదొకటి. బ్రహ్మపుత్ర మెరుపు వరదలకు పెట్టింది పేరు. ప్రపంచంలో అన్ని నదుల కన్నా ఎత్తున ప్రవహిస్తుంది.
– ‘ది వైర్, సౌజన్యంతో..