మొండిగైతున్న టైఫాయిడ్ ..ఇండియా సహా పలు దేశాల్లో స్టాన్​ఫర్డ్ సైంటిస్టుల స్టడీ

మొండిగైతున్న టైఫాయిడ్ ..ఇండియా సహా పలు దేశాల్లో స్టాన్​ఫర్డ్ సైంటిస్టుల స్టడీ
  • యాంటీ బయాటిక్స్​కు లొంగకుండా రెసిస్టెన్స్​
  • ఒక్క అజిత్రోమైసిన్​కే కంట్రోల్ అవుతున్న బ్యాక్టీరియా
  • అది కూడా కొన్నాళ్లే అంటున్న సైంటిస్టులు

హైదరాబాద్, వెలుగు: టైఫాయిడ్ జ్వరం మందులకు లొంగడం లేదు. పవర్​ఫుల్ యాంటీ బయాటిక్​గా చెప్పుకునే సెఫలోస్పోరిన్స్ క్లాస్ మందులకూ టైఫాయిడ్ కంట్రోల్ కావడం లేదట. ఇలా పేరొందిన చాలా యాంటీ బయాటిక్​​లను తట్టుకుని టైఫాయిడ్​కు కారణమవుతున్న సాల్మోనెల్లా టైఫీ బ్యాక్టీరియా తన రూపాన్ని మార్చేసుకుంటున్నదట. స్టాన్​ఫర్డ్ యూనివర్సిటీ సైంటిస్టుల పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. ఇండియాతో పాటు బంగ్లాదేశ్, పాకిస్థాన్, నేపాల్​లో టైఫాయిడ్ బ్యాక్టీరియా శాంపిళ్లను సేకరించిన సైంటిస్టులు.. వాటిని విశ్లేషించి ఈ విషయాన్ని నిర్ధారించారు. 2016 నుంచి శాంపిళ్లను సేకరించారు. సాల్మోనెల్లా టైఫీ.. మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్​ను సంతరించుకోవడమే కాకుండా.. అది ఎక్స్​ట్రీమ్ లీ డ్రగ్ రెసిస్టెంట్ టైఫీగా మారుతున్నదని సైంటిస్టులు తేల్చారు.

మన దేశంలో 18 ప్రాంతాల నుంచి శాంపిళ్లు

నాలుగు దేశాల్లోని 34 ప్రాంతాల నుంచి సైంటిస్టులు సాల్మోనెల్లా టైఫీ శాంపిళ్లను సేకరించారు. మన దేశంలో దక్షిణాది రాష్ట్రాలు సహా 16 సిటీల్లోని 18 ప్రాంతాల నుంచి వేలాది శాంపిళ్లను తీసుకున్నారు. బెంగళూరు, చెన్నైల్లోని పలు రీసెర్చ్ ల్యాబోరేటరీలు సహా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేశారు. వాటి నుంచి బ్యాక్టీరియా శాంపిళ్లను వేరు చేసి వాటి జీనోమ్​లపై స్టడీ చేశారు. వివిధ యాంటీ బయాటిక్స్​ను వాటిపై ప్రయోగించగా.. అన్నింటిని అవి తట్టుకుని సజీవంగా నిలిచాయి. 

Also Read :- రూ.1,400 పడిన బంగారం ధర

థర్డ్ జనరేషన్​ సెఫలోస్పోరిన్స్​ యాంటీ బయాటిక్​ అయిన సెఫ్ట్రియాక్సోన్​ అనే డ్రగ్​నూ అది సమర్థంగా ఎదుర్కొన్నదని సైంటిస్టులు తేల్చారు. సాధారణంగా టైఫాయిడ్ తీవ్రత ఎక్కువగా ఉంటే డాక్టర్లు ఈ మందును వాడుతుంటారు. ఇప్పుడు ఆ మందు కూడా టైఫాయిడ్​ బ్యాక్టీరియా ముందు తేలిపోవడం చూసి సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక, వాటితో పాటు పెన్సిలిన్, యాంపిసిలిన్, క్లోరాంఫెనికాల్, ఫ్లొరోక్వినోలిన్ క్లాస్​లోని యాంటీబయాటిక్స్, సల్ఫొనమైడ్స్ వంటి యాంటీ బయాటిక్స్​కు బ్యాక్టీరియా లొంగడం లేదని తేల్చారు.

కొత్త రకం యాంటీ బయాటిక్స్ అవసరం

అన్ని యాంటీ బయాటిక్స్​నూ ఎదుర్కొని నిలబడుతున్న ఆ టైఫాయిడ్ బ్యాక్టీరియా.. ఒక్క యాంటీ బయాటిక్​కు మాత్రం తలొగ్గుతున్నదని సైంటిస్టులు తేల్చారు. మ్యాక్రోలైడ్ క్లాస్​లోని అజిత్రోమైసిన్​కు మాత్రమే టైఫాయిడ్ కంట్రోల్​లోకి వస్తున్నదని నిర్ధారించారు. అది కూడా ఎక్కువ కాలమేమీ ఉండదని, మరికొద్ది నెలల్లో దానికి కూడా ఆ బ్యాక్టీరియా రెసిస్టెన్స్​ను సంతరించుకుంటున్నదని స్పష్టం చేస్తున్నారు. 

మన దేశంలో టైఫాయిడ్ మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్​తో పాటు ఎక్స్​ట్రీమ్​లీ డ్రగ్ రెసిస్టెన్స్ స్ట్రెయిన్స్ ఉన్నాయంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.10 కోట్ల టైఫాయిడ్ కేసులు నమోదవుతున్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. అందులో లక్ష మంది చనిపోతున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం మన దేశంలో ఏటా సగటున 45 లక్షల టైఫాయిడ్ కేసులు నమోదవుతుండగా.. 9వేల మంది వరకు చనిపోతున్నారు.