
దుబాయ్: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ తర్వాత తన అభిమానుల మనసును మళ్లీ గెలుచుకున్నానని టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అన్నాడు. ఆ టోర్నీలో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ వల్లే ఇది సాధ్యమైందన్నాడు. గుజరాత్ టైటాన్స్ నుంచి ఊహించని రీతిలో ముంబై ఇండియన్స్‌కు మారిన పాండ్యా.. రోహిత్ శర్మ స్థానంలో ఏకంగా కెప్టెన్సీ చేపట్టాడు. దీంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే వరల్డ్ కప్‌లో అద్భుతంగా ఆడిన పాండ్యా 144 రన్స్‌తో పాటు 11 వికెట్లు తీసి ఇండియ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.
‘ఫ్యాన్స్ అభిమానం వల్ల నా జీవితం మళ్లీ ఓ గాడిలోకి వచ్చింది. ఇక నుంచి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. నేను వాళ్ల అభిమానాన్ని తిరిగి గెలుచుకున్నాను. కొత్త ఏడాదిలో కొత్త టోర్నీలు, కొత్త సవాల్ మన కోసం వేచి ఉన్నాయి. మరోసారి చాంపియన్లుగా ఎదగాలనే మా తపన ప్రారంభమైంది. కొత్త ఆరంభం కోసం, మరో రోజును, మరో ప్రత్యర్థిని జయించడం కోసం ఈ రోజు మళ్లీ అడుగు వేస్తున్నాం. చాంపియన్స్ ట్రోఫీలో రెండో అధ్యాయం వేచి చూస్తోంది. పరిచయం అవసరం లేని పోటీకి సిద్ధంగా ఉండండి’ అని పాండ్యా వ్యాఖ్యానించాడు.