ఎమ్మెల్యేల క్యాంపులుగా స్టార్​ హోటళ్లు

పాలిటిక్స్​ బాగా వేడెక్కాయంటే… ఏదోక స్టార్​ హొటల్​లోనో, స్టార్​ రిసార్ట్​లోనో క్యాంప్​లు మొదలవుతాయి. సొంత రాష్ట్రంలో కాకుండా ఇరుగు పొరుగు రాష్ట్రాలకు గ్రూప్ ఎమ్మెల్యేలను తీసుకెళ్లి క్యాంప్​ నిర్వహిస్తారు. ‘ప్రజాస్వామ్యాన్ని బతికించుకుంటాం’ అని క్యాంప్​లకు ఒక లక్ష్యంకూడా నిర్ణయించుకుంటారు. అక్కడే అన్నీ తేల్చుకుని అధికారాన్ని ఎవరికి అప్పగించాలో ఫైనల్​గా చేసుకుని పంతం నెగ్గించుకుంటారు. ఎన్టీ రామారావు 1984లో నిర్వహించిన నంది హిల్స్​ క్యాంప్ మొదలుకొని… ఇప్పుడు కర్నాటకలో కాంగ్రెస్​ రెబెల్స్​ క్యాంప్​ వరకు​ అన్నీ పక్క రాష్ట్రాల్లోనే జరగడం మరో విశేషం.

ప్రస్తుతం రాజకీయాల్లో కట్టప్పలెవరో బాహుబలి ఎవరో తెలియడం లేదు. ఒక్క రాష్ట్రం అని కాదు. ఒక్క పార్టీ  అని కాదు. అన్నింటా దేశమంతా ఇట్లాగే ఉంది. ఏదో ప్రభుత్వంలో ఏదో రూపంలో పంచాయితీలు వస్తూనే ఉన్నాయి. తాజాగా కర్నాటక పంచాయితీయే దీనికి మంచి ఉదాహరణ.

మొన్న ముంబైలో స్టార్ హోటల్ ముందు కర్నాటక కాంగ్రెస్ నాయకుడు శివకుమార్ దీక్ష అప్పట్లో వైస్రాయ్ హోటల్ వద్ద ఎన్టీరామారావు హంగామాను గుర్తుకు తెచ్చింది. సిన్మాలను మించిన ట్విస్టులతో రాజకీయాలు మలుపుల మీద మలుపులు తిరుగుతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని బతికించేందుకు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పార్టీల నాయకులు స్టార్ హోటళ్లకు వెళ్తున్నారు. అక్కడే అన్నీ తేల్చుకుని అధికారాన్ని ఎవరికి అప్పగించాలో ఫైనల్​ చేసుకుని పంతం నెగ్గించుకుంటున్నరు. ముప్పైయేళ్ల కాలంలో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటకల రాజకీయ పంచాయితీలన్నీ స్టార్ హోటళ్లు, రిసార్ట్ ల చుట్టూనే సిన్మా రీళ్ల మాదిరిగా తిరిగాయి.

గమ్మత్తు ఏందంటే ఒక రాష్ట్రంలో రాజకీయ పంచాయితీ వొస్తే, పక్క  రాష్ట్రంలోని స్టార్ హోటళ్లు  నిండిపోతుంటాయి. తమిళనాడులో ఏదైనా అయితే కర్నాటకలో, కర్నాటకలో ఏదైనా రాజకీయ పంచాయితీ వస్తే  హైదరాబాద్​లో… ఇలా క్యాంప్​ పాలిటిక్స్​ నడుస్తుంటాయి. తెలుగు రాష్ట్రాల్లో ఏదన్నా అయితే కర్నాటక హోటళ్లు హౌస్ ఫుల్ అవుతుంటాయి. ఇది ముప్పై యేండ్ల నుండి జరుగుతున్న ముచ్చట్నే.

దక్షిణాది ప్రజల మధ్య చుట్టరికాలున్నట్లే నాయకులకు వ్యాపారాలున్నట్లున్నాయి. అందుకే ఈ రాష్ట్రంలో పంచాయితీ వస్తే పక్క రాష్ట్రం హోటల్ లేదంటే రిసార్టుకు వెళ్తున్నరు. తమకు సంబంధించిన వారు అన్ని ఏర్పాట్లు చూసుకుంటరు. ఏ ఇబ్బందీ ఉండదనే ధీమాతోనే ఇట్లా చేస్తున్నరనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. దానికి తోడు ఈ  నడుమ అన్ని పార్టీల్లోనూ ట్రబుల్ షూటర్లు తయారైతున్నరు. కొత్త సంపన్నులు పార్టీల్లోకి వొస్తున్నకొద్దీ పార్టీల్లోనూ, ప్రభుత్వాల్లోనూ కొత్త కొత్త పంచాయితీలు పుట్టుకొస్తున్నవి. కొందరి పదవులు పుటుక్కున ఊడిపోతున్నవి.  వెంటనే ట్రబుల్ షూటర్లు రంగంలోకి దుంకుతున్నరు. మొదలు మాటలతోనో, ఆ తర్వాత మూటలతోనో స్టార్ హోటళ్లలోనే సర్ది చెప్పి అంతా సెట్ చేస్తున్నరని ప్రజలు అనుకుంటున్న ముచ్చట.  ఒక్క మాటల చెప్పాల్నంటే రాజకీయ పంచాయతీలు స్టార్ హోటల్​కి పోతే తప్ప సెట్ అయ్యేటట్లు లేనట్లుంది.

ఇప్పుడు బంతి సుప్రీం కోర్టుకి, స్పీకర్​ ఆఫీసుకు మధ్య తిరుగుతాంది. వచ్చే మంగళవారం వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీం కోర్టు చెప్పేసింది.  ఎటూ సభలోనే ఎవరి బలం ఎంతో తేల్చుకోవాలని ఎస్​.ఆర్. బొమ్మయ్​ కేసులో ఇచ్చిన హిస్టారికల్​ జడ్జిమెంట్​ ఒకటి ఉంది. అందువల్లనే కావచ్చు… కుమారస్వామికూడా విశ్వాస పరీక్షకు రెడీ అయ్యారు. ఇదిలా సాగుతుంటే, కాంగ్రెస్​ పార్టీవాళ్లు తాజ్​ వివంత స్టార్​ హోటల్​లో 70 రూమ్​లు బుక్​ చేసుకున్నరు. తమ గ్రూప్​ ఎమ్మెల్యేల్ని యడ్యూరప్ప పార్టీ తన్నుకుపోకుండా తాజ్​ వివంతలో క్యాంప్​ పెట్టించింది. సుప్రీం కోర్టు మంగళవారం వరకు ఎటూ తేల్చొద్దని చెప్పింది కాబట్టి, కర్నాటకం మరో నాలుగు రోజులు నడవక తప్పదు. ఈలోగా ఎమ్మెల్యేలంతా ఖుషీ ఖుషీగా స్టార్​ హోటల్​ క్యాంప్​లో ఉంటరు.

         – గొర్ల బుచ్చన్న

1984

సిన్మా నటుడు ఎన్టీరామారావు పార్టీ పెట్టి అధికారాన్ని దక్కించుకున్నారు. కొంతకాలానికే  నాదెండ్ల భాస్కరరావు రూపంలో రామారావు పదవికి కష్టాలొచ్చినవి. అల్లుడు చంద్రబాబు, సీనియర్ నాయకుడు ఉపేంద్ర సాయంతో టిడిపి ఎమ్మెల్యేలు బెంగళూరు స్టార్ హోటల్​కి, అటు నుంచి నందిహిల్స్​ రిసార్ట్స్​కి తరలించారు. ఆ తర్వాత పంచాయితీ పరిష్కారం అయిన సంగతి అందరికీ తెలిసిందే.

 

1987

తమిళనాడులో ఎంజీఆర్​​ చనిపోయాక ఆయన భార్య జానకీ రామచంద్రన్, జయలలిత గ్రూప్​లు అధికారంకోసం కొట్టాడినయి. జానకీ తరఫున నిర్మాత ఆర్​ ఎం. వీరప్పన్​ రంగంలోకి దిగి క్యాంప్​ రాజకీయాలు నడిపించారు. జయలలిత కూడా తమ ఎమ్మెల్యేలను  ‘భారత్​ దర్శన్​’ పేరుతో ఉత్తరాది యాత్రకు తీసుకెళ్లారు. చివరికి కర్నాటకలోని నంది హిల్స్​లోనే క్యాంప్​ పాలిటిక్స్​ నడిచాయి. జానకీ రామచంద్రన్​కి కాంగ్రెస్​ మద్దతునిచ్చినట్లే ఇచ్చి, చివరలో చేతులెత్తేసింది.

 

1995

రామారావు అల్లుడు చంద్రబాబు నాయుడు వైస్రాయ్ హోటల్​లో మకాం పెట్టి పంచాయితీని తన వైపు తిప్పుకున్నరు. అధికారాన్ని దక్కించుకున్నరు. ఇప్పటిలా టీవీలు, రేడియోలు లేవు. కాబట్టి మరునాటి పత్రికల్లో సీన్లవారీగా క్యాంప్​ కథనాలు రిపోర్టు అయ్యాయి.  సిన్మాను మించిన సస్పెన్సులు ఎన్నో ఉన్నాయి. స్టార్ హోటల్​కి  చేరుకున్న తర్వాత పంచాయితీ కథ కంచికి చేరుకుని చంద్రబాబు  సిఎం కావడంతో ముగిసింది.

2010

కర్నాటక రాష్ట్రంలో షురువైన యడ్యూరప్ప పంచాయతీ మరుసటి ఎన్నికల్లో ఓడిపోయేదాంక సాగింది.  తొలుత కుమారస్వామితో పంచాయితీ, ఆ తర్వాత సొంత పార్టీ నాయకులు పెట్టిన ముంత పొగకు తట్టుకోలేక యడ్యూరప్ప విలవిల్లాడిపోయారు. అప్పట్లోనే గాలి జనార్ధన్ రెడ్డి తన పరివారాన్ని ఎంటేస్కోని హైదరాబాద్ నోవాటెల్ స్టార్ హోటల్​కి వచ్చారు. ఇక్కడే  కొద్ది రోజులు ఉండి సమస్యను సాల్వ్​ చేసుకున్నరు.

2017

తమిళనాడులో జయలలిత  మరణం తర్వాత పార్టీ కోసం. పదవి కోసం సొంత పార్టీ నేతలు కొట్టాడిన్రు.  అమ్మ వారసులం తామంటే తామని తన్నుకున్నరు. చివరకు చెన్నైకి సమీపంలోని  రిసార్ట్​కి వెళ్లి సక్క బెట్టుకున్నరు. ఇదంతా ప్రజాస్వామ్యాన్ని బతికించేందుకు, పార్టీని నిలబెట్టేందుకేనని అన్నాడిఎంకే నాయకులు అన్నరు.  పళని స్వామిని సిఎంను చేసి స్టార్ రిసార్ట్ సాక్షిగా పంచాయితీ పరిష్కారం చేసుకున్నరు.

2018

కర్నాటకలో ఎన్నికలు అయిన తర్వాత ఏ పార్టీకీ పూర్తి స్థాయి మెజార్టీ రాలేదు. ఈ సారి తానే సిఎం అవుతానని యడ్యూరప్ప ముందుకొచ్చిండు.  అవసరం అయితే పక్క పార్టీలకెల్లి కొంతమందిని గుంజుతానని ఫోన్లల్లోనే బేరసారాలాడిండు. దీన్ని గుర్తు వట్టిన కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు తమ ఎమ్మెల్యేలను హైదరాబాద్​లోని తాజ్ కృష్ణ స్టార్ హోటల్​కి తరలించాయి. ఇదంతా ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకేనని అప్పట్లో నాయకులు అన్నరు.

 

2019

కర్నాటకలో తాజాగా కుమారస్వామి పదవికి యడ్యూరప్ప రూపంలో ముప్పు ముంచుకొచ్చింది. కొంత మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముంబైలోని ఓ స్టార్ హోటల్​లో పడ్డరు. అసలే 37 సీట్లతో సీఎం సీటులో కూర్చున్న కుమారస్వామి కుర్చీ కిందకు నీళ్లొచ్చినయి. రెబల్​ ఎమ్మెల్యేలు మాత్రం సమస్యను ఇక్కడ ఉండే పరిష్కరించుకుంటమని అన్నరు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డి.కే. శివకుమార్ అదే హోటల్​లో రూం బుక్ చేసుకున్నరు. అయినాగానీ, ఆయనను ముంబై పోలీసులు లోపలికి పోనీయలేదు. బయట ఉండే దీక్షకు కూర్చున్నడు.  స్టార్ హోటళ్లనే పంచాయితీని పరిష్కరించుకుందామని అన్నడు. ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇప్పుడు కర్నాటక పంచాయితీ దానికి పక్కనే ఉన్న ఇంకో రాష్ట్రం గోవాలోని ఓ స్టార్ హోటల్​కి చేరింది.