- వచ్చే నెలలో హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు
- ఇద్దరు రెజ్లర్ల చేరికతో రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఊపు
- పార్టీలో చేరిన గంటల వ్యవధిలోనే వినేశ్‌కు టికెట్ కేటాయింపు
న్యూఢిల్లీ: హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ పోటీ ఖాయమైంది. కాంగ్రెస్ పార్టీ తరఫున జులానా నియోజకవర్గం నుంచి ఆమె బరిలోకి దిగనున్నారు. శుక్రవారం ఉదయం బజరంగ్ పూనియాతో కలిసి వినేశ్ కాంగ్రెస్‌లో చేరారు. ఢిల్లీలోని ఏఐసీసీ హెడ్ ఆఫీసులో పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సమక్షంలో వారు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
ఆ తర్వాత గంటల వ్యవధిలోనే వినేశ్ ఫొగాట్‌కు పార్టీ టికెట్ కేటాయించడం గమనార్హం.బుధవారం ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కలిసిన తర్వాత వీరిద్దరూ హస్తం పార్టీలో చేరడం ఖాయమని ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని నిజంచేస్తూ ఇద్దరు రెజ్లర్లు కాంగ్రెస్ గూటికి చేరారు. వచ్చే నెలలోనే హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వీరి చేరికతో ఆ పార్టీలో మరింత జోష్ మొదలైంది.
పార్టీలో చేరడానికి ముందుగా వినేశ్ ఫొగాట్ రైల్వేలో తన ఓఎస్డీ ఉద్యోగానికి రాజీనామా చేశారు. అనంతరం ఇద్దరూ వెళ్లి కాంగ్రెస్ చీఫ్మల్లికార్జున ఖర్గేను ఆయన నివాసంలో కలిశారు. ఆ తర్వాత ఏఐసీసీ హెడ్ ఆఫీసులో పార్టీలో చేరిన తర్వాత కేసీ వేణుగోపాల్, పార్టీ హర్యానా ఇంచార్జ్ దీపక్ బబారియా, హర్యానా కాంగ్రెస్ చీఫ్ ఉదయ్ భాన్‌తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.
రాహుల్ గాంధీని కలిసిన తర్వాత వినేశ్‌కు రైల్వే నుంచి షోకాజ్ నోటీసు వచ్చిందని, ఉద్యోగులు రాజకీయ నేతలను కలవడంలో తప్పేముందని కేసీ వేణుగోపాల్ ప్రశ్నించారు. వినేశ్‌ను వెంటనే ఉద్యోగం నుంచి రిలీవ్ చేయాలని డిమాండ్ చేశారు. ‘‘ప్రపంచ వేదికపై ఇండియా గర్వపడేలా చేసిన వినేశ్ ఫొగాట్, బజరంగ్ పునియా కలిశారు. వారిద్దరూ మాకు గర్వకారణం. చక్ దే ఇండియా, చక్ దే హర్యానా!” అని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ట్వీట్ చేశారు.
హర్యానాలో కాంగ్రెస్ కు జోష్
పోయిన ఏడాది మహిళా రెజ్లర్లపై అప్పటి బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ ఢిల్లీలో పెద్ద ఎత్తున జరిగిన నిరసనల్లో వినేశ్, పునియా కీలక పాత్ర పోషించారు. అలాగే, అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా హర్యానా రైతులు చేపట్టిన నిరసనల్లోనూ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో రైతుల నుంచి వీరిద్దరికీ పెద్ద ఎత్తున మద్దతు ఉండటంతో ఇది పార్టీకి కూడా బాగా కలిసి వస్తుందని భావిస్తున్నారు.
నిరసనలకు మూల్యం చెల్లించుకున్నాం: పునియా
మహిళా రెజ్లర్లకు మద్దతు తెలపాలని బీజేపీ ఎంపీలకు లేఖలు రాసినా పట్టించుకోలేదని బజరంగ్ పునియా చెప్పారు. వినేశ్ ఫొగాట్ ఒలింపిక్స్ లో డిస్ క్వాలిఫై అయినప్పుడు ఒక పార్టీ ఐటీ సెల్ తప్ప మిగతా వారంతా బాధపడ్డారని అన్నారు. ఈ దేశ ఆడబిడ్డలపై లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టినందుకు తాము మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందన్నారు.
న్యాయం కోరితే రోడ్లపై ఈడ్చుకెళ్లారు: వినేశ్ ఫొగాట్
రెజ్లింగ్ కెరీర్లో తనకు అన్నివేళలా మద్దతు ఇచ్చిన దేశ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నానని వినేశ్ ఫొగాట్ మీడియా సమావేశంలో చెప్పారు. కాంగ్రెస్‌లో చేరికతో తాను కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టానని తెలిపారు. ‘‘మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపు లకు పాల్పడిన వారిని శిక్షించాలంటూ మేం నిరసనలు చేపడితే.. మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా రోడ్లపై ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. అప్పుడు బీజేపీ తప్ప అన్ని పార్టీలూ మాకు మద్దతు ఇచ్చాయి. మా బాధను, కన్నీళ్లను అర్థం చేసుకున్నాయి.
మహిళలకు న్యాయం కోసం మద్దతిచ్చిన కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల గర్వపడుతున్నాను” అని వినేశ్ చెప్పారు. రెజ్లింగ్ లో వేధింపులకు గురైన మహిళలకు న్యాయం కోసం పోరాడతామని, బెదిరింపుల కు భయపడి వెనకడుగు వేయబోమన్నారు. ఈ కేసును కోర్టు విచారిస్తోందని, న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందన్నారు. ఇకపై దేశ ప్రజల కోసం కష్టపడతామని చెప్పారు. నిస్సహాయ మహిళలకు అండగా ఉంటామన్నా రు. ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ కోల్పోవడం వెనక రాజకీయ కుట్ర జరిగిందా? అన్న ప్రశ్నకు ఆమె బదులిస్తూ.. మరోసారి పూర్తి వివరాలు వెల్లడిస్తానని తెలిపారు.
కాంగ్రెస్‌లో చేరిన ఆప్ ఎమ్మెల్యే ఆర్పీ గౌతమ్
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎమ్మెల్యే, ఢిల్లీ మాజీ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్ శుక్రవారం ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు. సీఎం అర్వింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ లో దళితుల, ఓబీసీ, మైనార్టీ నేతల పట్ల వివక్ష చూపుతున్నారని ఆయన ఆరోపించారు. ఆయన తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా నిలబడటంలో ఆప్ చాలా బలహీనంగా, నిస్సహాయంగా ఉందని పేర్కొంటూ కేజ్రీవాల్‌కు లేఖ రాశారు. దళిత, బహుజనులు, సెక్యులరిజం, తదితర అంశాలపై ఆప్ తీరు సరిగ్గా లేదని, ఆ పార్టీలో సామాజిక న్యాయం, సమానత్వం అసాధ్యంగా మారిందని ఆరోపించారు.