న్యూఢిల్లీ: అమెరికా కంపెనీల్లో భారత సంతతి టెకీల హవా కొనసాగుతూనే ఉంది. ఇది వరకే పలు మల్టీ నేషనల్ కంపెనీలకు ఇండియన్లు సీఈఓలుగా పనిచేస్తుండగా, ఈ లిస్టులో లక్ష్మణ్ నరసింహన్ చేరారు. ప్రీమియం బేవరేజెస్ కంపెనీ స్టార్‌బక్స్ సీఈఓగా నియమితులయ్యారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, అడోబ్ సీఈవో శంతను నారాయణ్, ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్, ట్విట్టర్ హెడ్ పరాగ్ అగర్వాల్‌లు భారతీయ సంతతికి చెందిన వారనే విషయం తెలిసిందే. ఇంద్రా నూయి 2018లో రిటైర్ కావడానికి ముందు 12 సంవత్సరాల పాటు పెప్సికో సీఈఓగా పనిచేశారు. లక్ష్మణ్ ఇంతకుముందు రెకిట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పనిచేశారు. ఈయన పుణె యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదివారు. స్టార్‌బక్స్‌కు ప్రపంచవ్యాప్తంగా 34 వేల స్టోర్లు ఉన్నాయి. ఐదు దశాబ్దాల చరిత్ర కలిగిన స్పెషాలిటీ కాఫీ ప్రీమియర్ రోస్టర్ రీటైలర్ ఇది. లక్ష్మణ్ లండన్ నుండి సియాటెల్‌కు వచ్చిన తర్వాత, ఈ ఏడాది అక్టోబర్ 1న ఇన్‌కమింగ్ సీఈఓగా స్టార్‌బక్స్‌లో చేరనున్నారు. 2023 ఏప్రిల్‌లో బోర్డులో చేరడానికి ముందు తాత్కాలిక చీఫ్ హోవార్డ్ షుల్ట్జ్‌తో కలిసి పని చేస్తారు. పెప్సీకో గ్లోబల్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ సహా చాలా జాబ్స్ చేశారు. లాటిన్ అమెరికా, యూరప్ సబ్-సహారా ఆఫ్రికా కార్యకలాపాలకు సీఈఓగానూ ఉన్నారు. పెప్సికో లాటిన్ అమెరికా సీఈఓ , పెప్సికో అమెరికాస్ ఫుడ్స్ సీఎఫ్ఓ గానూ చేసిన అనుభవం ఉంది. పెప్సికోకు ముందు మెకిన్సే & కంపెనీలో సీనియర్ పార్ట్నర్. భారతీయ సంతతికి చెందిన ఎక్స్పర్టులు అమెరికాలోని ఎడ్యుకేషన్, ఐటీ, సైన్స్ అండ్ రీసెర్చ్, కార్పొరేట్ రంగంలో కీలక పదవులు పోషిస్తున్నారు. 1990లలో భారత సంతతికి చెందిన టెకీలు కార్పొరేట్ సంస్థల్లో అడుగుపెట్టడం ప్రారంభమైంది. 1990లలో రోమ్ & హాస్ ఛైర్మన్ సీఈఓగా రాజ్ గుప్తా, ది హార్ట్ ఫోర్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ గ్రూప్, ఇంక్ సీఈఓ ఛైర్మన్‌గా రామ్ అయ్యర్, యూఎస్ ఎయిర్‌వేస్ సీఈఓ గా రాకేష్ గంగ్వాల్ పనిచేశారు. 21వ శతాబ్దం ప్రారంభంలో ఇంద్రా నూయి పెప్సికో సీఈఓ అయ్యారు. అప్పటి నుంచి ఇండియన్ టెకీలు వెనక్కి తిరిగి చూడలేదు.
ప్రముఖ కంపెనీల్లో భారత సంతతి సీఈఓలు:
సత్య నాదెళ్ల, మైక్రోసాఫ్ట్
పరాగ్ అగర్వాల్, ట్విటర్
అరవింద్ కృష్ణ, ఐబీఎం
వివేక్ శంకరన్, ఆల్బర్ట్‌సన్స్
సంజయ్ మెహ్రోత్రా, మైక్రోన్ టెక్నాలజీ
శంతను నారాయణ్, అడోబ్ ఇంక్
సీఎస్ వెంకటకృష్ణన్, బార్క్లేస్
సుందర్ పిచాయ్, గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్
పునిత్ రెంజెన్, డెలాయిట్
రేవతి అద్వైతి, ఫ్లెక్స్
షార్ దూబే - ఇటీవలే ‘మ్యాచ్’లో సీఈఓగా వైదొలిగారు
సోనియా సింఘాల్–‘గ్యాప్’ సీఈఓ గా రిలీవ్ అయ్యారు