స్టార్టప్​ : ఫ్యాషన్​ బట్టలకు..ప్రకృతి ఇచ్చిన రంగులు ​

స్టార్టప్​ : ఫ్యాషన్​ బట్టలకు..ప్రకృతి ఇచ్చిన రంగులు ​

ఫాస్ట్ ఫ్యాషన్​ వల్ల కాలుష్యం ఎంతలా పెరిగిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి దాన్ని తగ్గించడం ఎలా? ఈ ప్రశ్నకు సమాధానంగా సౌమ్య హైబిస్కస్​ అనేబ్రాండ్​ని తీసుకొచ్చింది. ఈ స్టార్టప్​లో తయారుచేసే బట్టలకు నేచురల్​​ కలర్స్​ని మాత్రమే వాడతారు. అంటే ప్రకృతి ప్రసాదించిన ఆకులు, పూల నుంచి రంగులు తయారుచేసి, బట్టలకు అద్దుతున్నారు. ఆర్గానిక్ పంటల నుంచి వచ్చిన ముడి పదార్థాలతో నేసిన బట్టలనే ఉపయోగిస్తున్నారు.ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే.. వేస్ట్‌‌‌‌‌‌‌‌ క్లాత్​ని పడేయకుండా దాంతో కూడా యాక్సెసరీస్​,బ్యాగ్​లు తయారుచేస్తున్నారు.   

సౌమ్య పరమేశ్వరన్​ బెంగళూరులో పెట్టి పెరిగింది. అక్కడే 2003లో ఎన్​ఐఎఫ్​టీ(నేషనల్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ ఫ్యాషన్​ టెక్నాలజీ)లో ఫ్యాషన్​ డిజైనింగ్​  పూర్తి చేసింది. అందులో భాగంగానే 2002లో ఇంటర్న్‌‌‌‌‌‌‌‌షిప్ చేసింది. అందుకోసం ‘టెక్స్​టైల్స్​ అండ్​ నేచురల్​ ఫ్యాబ్రిక్స్​’ అనే కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌ని ఎంచుకుంది. ఆ ఇంటర్న్‌‌‌‌‌‌‌‌షిప్ కోసమే తమిళనాడులోని పాండిచ్చేరికి దగ్గరలో ఉన్న ఆరోవిల్లె నగరానికి  వెళ్లింది. అప్పట్లోనే ఆరోవిల్లెలో చాలామంది సస్టైనబుల్​ కాన్సెప్ట్‌‌‌‌‌తో  పనిచేసేవాళ్లు. ముఖ్యంగా ఆల్టర్నేటివ్​ ఎనర్జీ, ఆర్గానిక్​ ఫార్మింగ్​ లాంటివి చేసి సక్సెస్​ అయ్యారు.

సౌమ్య కూడా వాళ్లతో కలిసి పనిచేయాలి అనుకుంది. ఆ క్రమంలోనే ఆరోవిల్లె సిటీతో ప్రేమలో పడిపోయింది. ఆ ఊరు ఆమెకు బాగా నచ్చడంతో అక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకుంది. అక్కడే ఉంటున్న డచ్ దేశస్తుడు హాన్స్‌‌‌‌‌‌‌‌ని ప్రేమించి పెండ్లి చేసుకుంది. దాదాపు మూడేళ్లపాటు అక్కడే ఉంది. కానీ.. ఆమెలోని ఫ్యాషన్​ డిజైనర్‌‌‌‌‌‌‌‌ తన స్కిల్స్​ని ప్రపంచానికి చూపించాలని పట్టుబట్టడంతో భర్తతో కలిసి ఆమ్​స్టర్​​డామ్​కి మకాం మార్చింది. అక్కడ ప్రపంచవ్యాప్తంగా పేరున్న ఫ్యాషన్ బ్రాండ్ టామీ హిల్‌‌‌‌‌‌‌‌ఫిగర్‌‌‌‌‌‌‌‌లో ఉద్యోగంలో చేరింది.

ఆ ఆలోచన లేదు

‘‘టామీ హిల్‌‌‌‌‌‌‌‌ఫిగర్‌‌‌‌‌‌‌‌లో 13 సంవత్సరాలపాటు వివిధ విభాగాల్లో పనిచేశా. ఎప్పుడూ డిజైన్, ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌ డెవలప్​మెంట్​పైనే దృష్టి పెట్టా. అక్కడ చాలా నేర్చుకున్నా. 2013లో  రిమోట్‌‌‌‌‌‌‌‌గా పనిచేసే అవకాశం వచ్చింది. దాంతో మళ్లీ ఆరోవిల్లెకు వచ్చేశా. అప్పుడే నేను సౌత్​ ఇండియా, శ్రీలంకలోని బట్టలు తయారుచేసే చాలా ఫ్యాక్టరీలకు వెళ్లా. దాంతో ఉత్పత్తి, నీటి కాలుష్యానికి కారణమయ్యే ఫ్యాషన్ ప్రక్రియల మీద లోతైన అవగాహన కలిగింది. అప్పుడే నాలో ‘సస్టైనబుల్​ ఫ్యాషన్​’ ఆలోచన మొదలైంది. కానీ.. అందుకోసం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. 2016లో టామీ హిల్‌‌‌‌‌‌‌‌ఫిగర్‌‌‌‌‌‌‌‌లో ఉద్యోగం మానేశా. సొంతంగా ఏదైనా బిజినెస్​ చేయాలని నిర్ణయించుకున్నా. కానీ.. నాకు తెలిసింది ఫ్యాషన్ పరిశ్రమ మాత్రమే. 

అందుకే అందులోనే కొత్తగా ఏం చేయొచ్చు? అని ఆలోచించా. అప్పటివరకు నాకు ప్లాంట్​ బేస్డ్‌‌‌‌‌‌‌‌ కలర్స్​ తీసుకురావాలనే ఆలోచన లేదు. నేను కనెక్ట్ అయ్యే ఒక క్రాఫ్ట్‌‌‌‌‌‌‌‌ను కనుగొని, దాని చుట్టూ ఒక బ్రాండ్‌‌‌‌‌‌‌‌ను నిర్మించాలి అనుకున్నా. అయితే.. బిజినెస్​ పెట్టే ముందు 2017లో కొంతకాలం పాటు ఇండియాలో ట్రావెల్ చేయాలని నిర్ణయించుకుని.. నా ప్రయాణం మొదలుపెట్టా. తమిళనాడులోని ఈరోడ్​కు దగ్గర్లోని ఘాట్ల గుండా వెళ్తున్నప్పుడు ఒక నదిని దాటాల్సి వచ్చింది. అందులో మురుగునీరు పారుతోంది. అక్కడివాళ్లు అది  ‘కావేరి నది’ అని చెప్పడంతో ఆశ్చర్యపోయా. 

నదిలో ఇలాంటి మురుగునీరు పారడమేంటి? ఇది బాగుపడాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఇలా ఎన్నో ఆలోచనలు వచ్చాయి. అప్పుడే నేను ప్రకృతికి మంచి చేసే పని ఏదైనా చేయాలి అనుకున్నా. బట్టల కోసం నేచురల్​ కలర్స్​ని వాడితే.. కొంతవరకు వాటర్​ పొల్యూషన్​ని తగ్గించొచ్చు అనిపించింది. వెంటనే అందుకోసం రీసెర్చ్​ చేయడం మొదలుపెట్టా” అంటూ ఈ స్టార్టప్​ పెట్టడానికి కారణాలను చెప్పుకొచ్చింది సౌమ్య.  

చాలా టైం పట్టింది

స్టార్టప్​ ఐడియా వచ్చినప్పటికీ ఏర్పాటుచేయడానికి దాదాపు మూడేండ్లు పట్టింది. స్టార్టప్​ రీసెర్చ్​లో భాగంగా ముందుగా.. సస్టైనబుల్ ఫ్యాషన్ రంగంలో పనిచేస్తున్నవాళ్లను కలిసింది. అరోవిల్లెలో ఒక వ్యక్తి నేచురల్​ డైయింగ్​ చేస్తున్నాడని తెలిసి అతనితో మాట్లాడడానికి వెళ్లింది. అతని స్టూడియోలో కూర్చుని మొక్కలు, పూలను చూసినప్పుడు ఆమెకు చాలా కొత్త విషయాలు తెలిశాయి. ఆ తర్వాత తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళలలో ప్లాంట్​ బేస్డ్‌‌‌‌‌‌‌‌ కలర్స్​ తయారుచేసేవాళ్లను కలిసింది. అలా దాదాపు రెండు సంవత్సరాల పాటు రీసెర్చ్​ చేసింది. చివరకు 2020 నవంబర్​లో దీపావళి రోజున ‘హైబిస్కస్ హీరోస్’ పేరుతో బ్రాండ్​ని ఏర్పాటు చేసింది.  

సంవత్సరం పట్టింది

స్టార్టప్​ పెట్టగానే ప్రొడక్షన్​ మొదలు కాలేదు. కొన్ని మొక్కల కలర్​ రెసిపీలు సరిగ్గా రావడానికి దాదాపు సంవత్సరం పట్టింది. కలర్​ ప్యాలెట్​ రెడీ అయ్యాక కరోనా వచ్చి ఇబ్బంది పెట్టింది. వాటన్నింటినీ దాటుకుని కంపెనీని నిలబెట్టింది సౌమ్య. హైబిస్కస్​ కంపెనీలో మెషిన్ల కంటే మనుషుల చేతితో చేసే పనే ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం 80 శాతం ఆడవాళ్ల బట్టలు, 20 శాతం మగవాళ్ల బట్టలు ఉత్పత్తి చేస్తున్నారు. వాటితోపాటు హెడ్‌‌‌‌‌‌‌‌బ్యాండ్‌‌‌‌‌‌‌‌లు, నెక్లెస్‌‌‌‌‌‌‌‌లు, లినెన్, ముల్ ముల్ స్కార్ఫ్‌‌‌‌‌‌‌‌లు లాంటివి కూడా తీసుకొచ్చారు. 

కంపెనీకి సొంత డైయింగ్, ప్రింటింగ్ యూనిట్లు ఉన్నాయి. ఈ ఫ్యాక్టరీ ఆరోవిల్లె ఇండస్ట్రియల్​ జోన్‌‌‌‌‌‌‌‌లో ఉంది. రంగులు తయారుచేయడానికి కావాల్సిన మొక్కలు, పూలను తమిళనాడులోనే కొంటున్నారు. ప్రొడక్ట్స్​ని ఆన్​లైన్​లో అమ్మడంతోపాటు పాండిచ్చేరిలోని కొన్ని బొటిక్‌‌‌‌‌‌‌‌ల ద్వారా కూడా రిటైల్ మార్కెట్​ చేస్తున్నారు. వాళ్ల ప్రొడక్ట్స్​కి కొచ్చిన్, గోవా, కలకత్తాల్లో ఎక్కువ మార్కెట్ ఉంది.   

ఫేడెడ్​ లుక్​ 

‘‘నేచురల్​ కలర్స్​ వెలిసిపోయినట్టు కనిపిస్తాయనే అపోహ చాలామందిలో ఉంది. కానీ.. అది వాస్తవం కాదు. వాటిలో కూడా బ్రైట్​గా కనిపించే రంగులు ఉన్నాయి. పాత కాలంలో ప్రతిదానికి నేచురల్​ కలర్స్​తోనే పెయింట్ చేసేవాళ్లు. సహజ రంగులన్నీ లైట్​ కలర్స్​ అనే అపోహ నుంచి మనం బయటపడాలి. మా దగ్గర చాలా పెద్ద కలర్స్​ కలెక్షన్​ ఉంది. కాకపోతే.. కెమికల్స్​ కలర్స్​తో పోల్చితే నేచురల్​ కలర్స్​ తక్కువే ఉంటాయి. మా బట్టల ధర  రూ. 950 నుండి మొదలై రూ. 5,000 వరకు ఉంటుంది. యాక్సెసరీస్​ రూ. 150 నుండి మొదలవుతాయి” అంటోంది సౌమ్య.  

ఆర్గానిక్​ కాటన్​ 

యూనిట్​లో ఎక్కువగా ప్లాంట్​ బేస్డ్‌‌‌‌‌‌‌‌ ఫ్యాబ్రిక్​ని వాడుతున్నారు. ముఖ్యంగా ఆర్గానిక్ కాటన్​, బెంగాల్ చేనేత వస్త్రాలను ఉపయోగిస్తున్నారు. వాటికి నేచురల్​ కలర్స్​ని అద్ది, ఫ్యాషన్​ పీస్​లుగా మారుస్తారు.  మొత్తం ప్రక్రియలో ఎక్కడా ప్రకృతికి హాని చేసే పనులు చేయడంలేదు. బట్టలు కుట్టిన తర్వాత వచ్చే స్క్రాప్​ని కూడా అప్‌‌‌‌‌‌‌‌సైకిల్ చేసి యాక్సెసరీస్​, బ్యాగ్స్​ని తయారు చేస్తున్నారు. ఇలాంటి పనులన్నీ కంపెనీలోని ఆడవాళ్లే చేస్తున్నారు. రంగుల కోసం వెడెలియా మొక్క (ఆకుపచ్చ), అన్నాటో విత్తనాలు (పసుపు), కరుంగలి మొక్క (బూడిద), పలాష్ పువ్వులు (గులాబీ), క్లిటోరియా పువ్వులు (నీలం ), మ్యాడర్ వేర్లు (ప్లమ్​)  వాడుతున్నారు.