![ఇండియాలో ఇండ్ల రేట్లు ఇప్పట్లో తగ్గవు](https://static.v6velugu.com/uploads/2025/02/startup-founder-explains-why-prices-stay-high-in-india_kHCphWTNAM.jpg)
- యూఎస్ కంటే మన జీడీపీ పెర్‌క్యాపిటా 40 రెట్లు తక్కువ..అయినా ఇండ్ల ధరల్లో పోటాపోటీ
- ధరలను కంట్రోల్ చేస్తున్న ప్రైవేట్ డెవలపర్లు..
- వీరు చౌకగా అమ్మే ఛాన్సే లేదు: విస్డమ్ హ్యాచ్ ఫౌండర్ అక్షత్ శ్రీవాస్తవ
న్యూఢిల్లీ : ఇండియాలో ఇండ్ల ధరలు ఇప్పటిలో తగ్గవని చెబుతూనే, ఎందుకు తగ్గవో విస్డమ్ హ్యాచ్ ఫౌండర్ అక్షత్ శ్రీవాస్తవ వివరించారు. చాలా ఇండ్లను ప్రైవేట్ డెవలపర్లు నిర్మిస్తున్నారని, ధరలు తగ్గకపోవడానికి ఇదొక కారణమని అన్నారు. ‘గతంలో అయితే ల్యాండ్ కొని, సొంతంగా ఇల్లు కట్టుకునేవారు. ఇప్పుడు రెడీ మేడ్ ఇల్లు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజల ఆలోచనా విధానాలు వేగంగా మారుతున్నాయి. సమస్యేంటంటే ప్రైవేట్ డెవలపర్లు ఇటువంటి ఇళ్లను చౌకగా అమ్మరు’ అని శ్రీవాస్తవ వివరించారు. గ్లోబల్ సంక్షోభాలు ఎదురైనప్పుడు కూడా ఇండ్ల ధరలు తగ్గకుండా ప్రైవేట్ డెవలపర్లు చూసుకోగలిగారని అన్నారు.
రేట్లు తగ్గుతాయని అనిపిస్తే వీళ్లు ఏళ్ల పాటు ఎదురు చూస్తారు. ప్రాజెక్ట్‌లను వాయిదా వేస్తారు. ఆలస్యంగా ఇండ్లను హ్యాండోవర్ చేస్తారు. అది కూడా కుదరకపోతే తమ ప్రాజెక్ట్‌లను పెద్ద ప్రైవేట్ ఈక్విటీ కంపెనీలకు షేర్లు+క్యాష్ డీల్స్‌లో అమ్మేస్తారు. అంతేకాని చౌకగా మాత్రం మీకు అమ్మరు’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు. ఇండియా జీడీపీ పెర్ క్యాపిటల్ 2,200 డాలర్ల దగ్గర ఉందని, యూఎస్‌తో పోలిస్తే 40 రెట్లు తక్కువని అన్నారు. కానీ, ఇండియాలో ఇండ్ల ధరలు యూఎస్‌లోని చాలా సిటీల్లో కంటే ఎక్కువగా ఉన్నాయని వివరించారు. ఇలాంటి పరిస్థితులు కొనసాగుతాయా? అనేది కాలమే తెల్చి చెప్పాలని పేర్కొన్నారు.
భారీగా పెరిగిన ఇండ్ల ధరలు..
ఇండియాలోని టాప్ సిటీలలో ఇండ్ల ధరలు చుక్కలనంటుతున్నాయి. ముంబైలో ఒక్కో చదరపు అడుగు ధర రూ.15 వేల నుంచి 25 వేల మధ్య ఉంది. అందుబాటులో ల్యాండ్ లేకపోవడం, ముంబై కోస్టల్ రోడ్డు వంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌లు, ధనవంతులు, బాలీవుడ్ స్టార్ల నుంచి డిమాండ్ ఉండడంతో ముంబైలో ధరలు భారీగా పెరుగుతున్నాయి. సిటీకి దగ్గరలోని పన్వెల్‌లో కూడా ఇండ్ల రేట్లు ఎక్కువగా ఉన్నాయి.
నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ రావడంతో పాటు లగ్జరీ ఇళ్లకు డిమాండ్ పెరగడంతో ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో రేట్లు కిందటి నెలలో 49 శాతం (ఏడాది ప్రాతిపదికన) పెరిగాయి. ఐటీ కంపెనీలు వస్తుండడంతో బెంగళూరు, హైదరాబాద్‌లలో కూడా ఇండ్ల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. చదరపు అడుగు ధర రూ.7 వేల నుంచి రూ.12 వేల మధ్య ఉంది. ద్వారకా ఎక్స్‌ప్రెస్ హైవే వలన ఎన్‌సీఆర్ శివార్లలోనూ ఇండ్ల ధరలు ఎక్కువగానే ఉన్నాయి. డెవలప్‌మెంట్ వలన ఇళ్ల రేట్లు పెరుగుతున్నా, ప్రైవేట్ డెవలపర్లు ధరలను కంట్రోల్ చేస్తుండడంతో రేట్లు తగ్గే అవకాశాలు తక్కువగా ఉన్నాయని శ్రీవాస్తవ చెబుతున్నారు.