మట్టి కుండల్లో నీళ్లు తాగితే.. ఆరోగ్యానికి మంచిది. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ.. తాగేది ఎంతమంది? ఒకప్పటితో పోలిస్తే.. మట్టి కుండలు వాడకం చాలావరకు తగ్గిపోయింది. అయినా.. ఎక్కడో ఒక చోట వాటిని తయారు చేసేవాళ్లు, వాడేవాళ్లు ఉన్నారు. కానీ.. తయారు చేసేవాళ్లకు ఎక్కువ ధరకు ఎక్కడ అమ్ముడుపోతాయో తెలియదు. కొనేవాళ్లకు ఎక్కడ బెస్ట్ ప్రొడక్ట్స్ దొరుకుతాయో తెలియదు. అలాంటి వాళ్ల కోసమే ఒక స్టార్టప్ పెట్టాడు దత్తాత్రేయ వ్యాస్. మట్టి కుండలను అమ్ముతూ తాను లాభాలు పొందడంతోపాటు మరో వందమందికి ఉపాధి కల్పించాడు. నాలుగేళ్ల క్రితం పెట్టిన ఈ స్టార్టప్ ఇప్పుడు సంవత్సరానికి 5 కోట్ల బిజినెస్ చేస్తోంది.
ఒకప్పుడు ప్రతి ఊరిలో కుమ్మరి వాములు ఉండేవి. పది, పదిహేను రోజులకోసారి వాటిలో మట్టి పాత్రలు కాలేవి. వాటికి అంతలా డిమాండ్ ఉండేది. కానీ.. ఇప్పుడు అసలు వాములే కనిపించడం లేదు. మట్టి పాత్రల స్థానంలో అల్యూమినియం, ఐరన్, స్టీల్.. అంటూ రకరకాల వంట పాత్రలు వచ్చేశాయి. కానీ, కరోనా తర్వాత ఆరోగ్యం మీద అవగాహన పెరిగి మళ్లీ మట్టి పాత్రలకు డిమాండ్ పెరిగింది. దీన్ని అవకాశంగా తీసుకుని కుండల తయారీదారులకు, కస్టమర్లకు మధ్య ఉన్న దూరాన్ని తగ్గించేందుకు ‘స్వదేశీ బ్లెస్సింగ్స్’ పేరుతో ఒక స్టార్టప్ వచ్చింది. దీన్ని రాజస్థాన్‌కు చెందిన దత్తాత్రేయ వ్యాస్ పెట్టాడు. దీని ద్వారా హస్తకళాకారులకు పని, కస్టమర్లకు అందుబాటు ధరలో కుండలు, మట్టి పాత్రలు అందిస్తున్నారు.
ఆరోగ్యాన్ని పంచాలనే..
‘‘నా చిన్నప్పుడు వేసవి రాగానే.. మా ఇంట్లోవాళ్లు నాలుగైదు కుండలు తీసుకొచ్చేవాళ్లు. వాటిలో చల్లబడిన నీళ్లనే అందరం తాగేవాళ్లం. కుండల్లో పోసిన నీళ్లకు మంచి రుచి, వాసన ఉంటాయి. అవి నాకు చాలా ఇష్టం. కానీ.. నేను పెద్దయ్యాక ఆ రుచి, వాసన కరువయ్యాయి. పెరిగిన టెక్నాలజీకి తగ్గట్టు చాలామంది ఇంట్లో వాడే వస్తువులను అప్‌గ్రేడ్ చేస్తూ వెళ్తున్నారు. అందులో భాగంగానే.. కుండల వాడకం తగ్గింది. అందరి ఇండ్లలోకి ఫ్రిజ్‌లు వచ్చేశాయి. కుండలు చేసే కళాకారులు జీవనోపాధిని కోల్పోయారు. ఇప్పుడు వాళ్ల కళ అంతరించిపోయే దశకు వచ్చేసింది. అందుకే కుమ్మరులను బతికిస్తూనే.. అందరికీ ఆరోగ్యాన్ని పంచాలనే ఉద్దేశంతో ‘స్వదేశీ బ్లెస్సింగ్స్’ని మొదలుపెట్టా’ అని దత్తాత్రేయ వ్యాస్ చెప్పాడు.
ఆలోచన వచ్చింది ఇలా..
వ్యాస్ బిజినెస్ చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. అసలు అతనికి బిజినెస్ మీద ఏ మాత్రం అవగాహన, ఇంట్రెస్ట్ లేవు. వాళ్ల కుటుంబం, బంధువుల్లో కూడా బిజినెస్ చేసేవాళ్లు లేరు. ఒక కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. చేతినిండా జీతం.. హ్యాపీగా సాగిపోయే జీవితం. కానీ.. కరోనా టైంలో వచ్చిన మార్పులు వ్యాస్ ఆలోచనలను మార్చేశాయి. దేశమంతా కరోనాతో ఇబ్బంది పడుతున్న రోజుల్లో అతని స్టార్టప్ ప్రయాణం మొదలైంది. లాక్డౌన్లో వర్క్ ఫ్రం హోం చేసేవాడు. పొద్దంతా పనిచేసి.. సాయంత్రం ఫ్యామిలీతో పెరట్లో సరదాగా గడిపేవాడు.
లేదంటే.. చుట్టుపక్కల గ్రామాల్లో తిరిగేవాడు. అలా ఒక సాయంత్రం పక్క ఊళ్లో కొంతమంది కుమ్మరులు తాము తయారుచేసిన కుండలు, వంట పాత్రలను అక్కడికి వచ్చిన టూరిస్ట్‌లకు అమ్మడం గమనించాడు. కాస్త ఇంట్రస్టింగ్‌గా అనిపించి వాళ్ల గురించి తెలుసుకున్నాడు. అప్పుడు అతనికి వాళ్లంతా టూరిజంపై ఆధారపడి బతుకుతున్నారని తెలిసింది. ఆ ఊరికి వచ్చే టూరిస్ట్లే వాళ్ల కస్టమర్లు. లేదంటే.. వాళ్లు తయారుచేసిన వస్తువులను చాలా తక్కువ ధరకు దళారులకు అమ్ముకునేవాళ్లు. అయితే.. కరోనా వల్ల టూరిజం లేకపోవడంతో ఆ కొంచెం బిజినెస్ కూడా తగ్గిపోయింది. అప్పుడే వ్యాస్‌కు వాళ్ల కోసం ఏదైనా చేయాలి అనిపించింది.
కుటుంబంతో కలిసి
అక్కడివాళ్లకు స్థిరమైన ఆదాయాన్ని అందించడానికి ఏం చేయొచ్చు? అనేదాని మీద తన ఫ్యామిలీతో కలిసి చర్చించాడు. వాళ్ల అమ్మ, కోడలు, తమ్ముడు.. ఇలా అందరూ ఆ కుమ్మరుల దగ్గరకు వెళ్లి మాట్లాడారు. వాళ్ల స్కిల్స్ ఏంటి? ఏమేం తయారుచేయగలరు? వాటికి మార్కెట్ ఎలా ఉంది?.. ఇలా అన్ని విషయాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత అదే సంవత్సరం 2020లో రిజిస్టర్డ్ బిజినెస్‌గా ‘స్వదేశీ బ్లెస్సింగ్స్’కి పునాది వేశాడు వ్యాస్.
స్టార్టప్ మొదలుపెట్టాడు కానీ.. అతనిలో ‘‘దీన్ని ఎలా కొనసాగించాలి? నేను తీసుకుంది సరైన నిర్ణయమేనా? కాదా?..” ఇలా ఎన్నో ఆలోచనలు వచ్చాయి. అందుకే ఉద్యోగం వదిలేయకుండానే బిజినెస్ కూడా నడిపాడు. 2023 వరకు అలా రెండు పడవల మీద ప్రయాణం చేశాడు. తర్వాత పూర్తిగా బిజినెస్ మీదే ఫోకస్ పెట్టాలనే ఉద్దేశంతో జాబ్‌కి రిజైన్ చేశాడు. మొదటి నుంచి ఫ్యామిలీ అతనికి సపోర్ట్‌గా నిలబడింది. ఇప్పటికీ బిజినెస్ వ్యవహారాలను అందరూ కలిసే చూసుకుంటున్నారు.
ఎన్నో అడ్డంకులు
బిజినెస్ మొదలుపెట్టిన మొదట్లో ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. తన ప్రయాణంలో ఎదుర్కొన్న అడ్డంకుల గురించి ఇలా చెప్పుకొచ్చాడు. “పరిమిత వనరులు.. పైగా నాకు ఈ రంగంపై అవగాహన లేదు. అందుకే చాలా ఇబ్బందిగా అనిపించింది. ప్రొడక్ట్స్ లిస్ట్ రెడీ చేయడం నుంచి మార్కెటింగ్ వరకు ప్రతీది తెలుసుకోవాల్సి వచ్చింది. అందుకోసం యూట్యూబ్ మీదే ఎక్కువగా ఆధారపడ్డా.
ఇంటర్నేషనల్ షిప్పింగ్స్ మొదలుపెట్టాక మా ప్రొడక్ట్స్‌ని మరింత సేఫ్‌గా ప్యాక్ చేయాల్సి వచ్చింది. దాని వల్ల మ్యాన్ పవర్ పెంచాం. మట్టి పాత్రలు కాబట్టి సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతే క్షణాల్లో పగిలిపోతాయి. అందుకే యూజర్లకు వాటిని ఎలా వాడుకోవాలో చెప్పేందుకు ‘ఇన్స్ట్రక్షన్స్ మాన్యువల్’ని కూడా డెవలప్ చేశాం” అన్నాడు వ్యాస్.
120 కుటుంబాలు
స్వదేశీ బ్లెస్సింగ్స్ ఇప్పుడు రాజస్థాన్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉండే హస్తకళాకారులకు కూడా ఉపాధి కల్పిస్తోంది. మొత్తం 120 మందికిపైగా కళాకారులు ఈ కంపెనీకి ప్రొడక్ట్స్‌ని అందిస్తున్నారు. వాళ్లే కంపెనీకి ఆధారం. హస్తకళలో అవార్డులు అందుకున్న ఆర్టిస్ట్‌లు కూడా ఈ కంపెనీ కోసం పనిచేస్తున్నారు. కొంతమంది రాష్ట్రపతి, యునెస్కో నుంచి కూడా అవార్డులు, ప్రశంసలు అందుకున్నారు.
ప్రస్తుతం కంపెనీ నుంచి మట్టితో చేసిన మగ్‌లు, గిన్నెలు, వైన్ గ్లాసులు, కుక్కర్లు, వంట కుండలు, సాస్‌పాన్‌లు, తవా (ఫ్రైయింగ్ పాన్) , కడాయి (వోక్), మడ్ హండీ (కుకింగ్ బేసిన్), టీ లైట్ హోల్డర్‌లు, విగ్రహాలు.. ఇలా ఎన్నో అమ్ముతున్నారు. డిమాండ్‌ని బట్టి హస్తకళాకారులకు ఆర్డర్లు ఇస్తుంటారు. వాళ్లంతా తమ ఇళ్లలోనే ప్రొడక్ట్స్‌ని తయారుచేస్తారు. కంపెనీవాళ్లు వాటిని కలెక్ట్ చేసుకుని క్వాలిటీ చెక్ చేస్తారు. ఆ తర్వాత ప్యాక్ చేసి కస్టమర్లకు డెలివరీ చేస్తారు. ఈ స్టార్టప్‌తో కనెక్ట్ కావడం వల్ల కుమ్మరుల ఆదాయం కూడా బాగా పెరిగింది. దాంతోపాటు ఏడాది పొడవునా పని దొరుకుతోంది. దీనివల్ల యువకులు కూడా కుల వృత్తిలోకి రావడానికి ఇష్టపడుతున్నారు.
డిమాండ్ బాగానే..
కరోనా తర్వాత చాలామందికి హెల్దీ లైఫ్ స్టయిల్ అలవాటు అయ్యింది. అందుకే ఈ ప్రొడక్ట్స్‌కి డిమాండ్ పెరుగుతూ వచ్చింది. కానీ.. ఇప్పటికీ ఎక్స్‌పోర్ట్స్ మార్కెట్లోనే ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. ఈ కంపెనీ ప్రస్తుతం 20 దేశాలకు ఎగుమతి చేస్తోంది. మొదట్లో ఆన్లైన్లో మాత్రమే అమ్మకాలు చేసేవాళ్లు. ఇండియాలోని ప్రతి ప్రాంతానికి చేరాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఆఫ్‌లైన్‌లో కూడా అమ్ముతున్నారు. మన దగ్గర ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు లాంటి పెద్ద సిటీల్లో, ఆన్లైన్లో అమ్ముతున్నారు. ప్రస్తుతం కంపెనీ యాన్యువల్ టర్నోవర్ 5 కోట్ల రూపాయలు. ఇది షార్క్ ట్యాంక్ సీజన్ 2లో పెట్టుబడిదారులను కూడా ఆకట్టుకుంది.
మరిన్ని చేర్చాలని
ఇప్పటివరకు మట్టి పాత్రల మీదే దృష్టి పెట్టిన స్వదేశీ బ్లెస్సింగ్స్ ఇప్పుడు చెక్క, పాలరాతి హస్తకళలను కూడా తన ప్రొడక్ట్స్ లిస్ట్‌లో చేర్చింది. ప్రస్తుతం కంపెనీ 65 రకాల వంట పాత్రలను అమ్ముతోంది. ప్రతి ప్రొడక్ట్‌ని సంప్రదాయ పద్ధతుల్లో తయారు చేస్తారు. కానీ.. ప్రతీది మోడ్రన్ స్టైల్లో ఉంటుంది. అదే వీళ్ల ప్రత్యేకత.
పని కోసం తిరగడం లేదు
సుమారు నాలుగు సంవత్సరాలుగా ‘స్వదేశీ బ్లెస్సింగ్స్’తో కలిసి పనిచేస్తున్న మోతీలాల్.. తన ఎక్స్‌పీరియెన్స్‌ని ఇలా చెప్పుకొచ్చాడు. “మేము ఈ కంపెనీతో కనెక్ట్ అయినప్పటి నుంచి పని కోసం తిరగాల్సిన అవసరం లేకుండా పోయింది. గతంలో అమ్మకాలు సరిగ్గా ఉండేవి కాదు. ప్రతి సంవత్సరం కొన్ని నెలలు మాత్రమే గిరాకీ ఉండేది. దాంతో మిగతా టైంలో ఖాళీగా ఉండేవాళ్లం. కానీ.. ‘స్వదేశీ బ్లెస్సింగ్స్’తో కలిశాక ఏడాది పొడవునా పని దొరుకుతోంది.
పైగా కంపెనీ మాకు సకాలంలో అడ్వాన్స్‌లు ఇస్తోంది. ఆర్డర్ పూర్తయిన తర్వాత పూర్తి పేమెంట్ చేస్తున్నారు. నెలన్నర నుంచి రెండు నెలల్లో ఒక బ్యాచ్ ఆర్డర్లు పూర్తి చేస్తున్నాం. మా నెలవారీ ఆదాయం మునుపటితో పోలిస్తే మూడు రెట్లు పెరిగింది.
డబ్బు కోసమే కాదు
ఇది లాభాలను మాత్రమే దృష్టిలో ఉంచుకుని పెట్టిన స్టార్టప్ కాదు. మన వారసత్వాన్ని కాపాడుకోవడం, చేతివృత్తుల వాళ్లకు సాధికారత కల్పించడం, భవిష్యత్ తరాలకు మన కళలు అందించడానికి పెట్టిన కంపెనీ. సంప్రదాయ చేతిపనులను రక్షించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. పైగా మాతో కలిసి ఎక్కువగా ఆడవాళ్లే పనిచేస్తున్నారు.
ప్రొడక్ట్ ప్రాసెసింగ్ నుంచి ప్రతి పనిలో వాళ్లదే కీలక పాత్ర. మట్టి తీసుకురావడం, కలపడం నుంచి వస్తువులకు మంచి షేప్ వచ్చేలా మలచడం వరకు ప్రతి విషయంలో కఠినమైన నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నాం. పైగా మా ప్రొడక్ట్స్ అన్నీ లెడ్ ఫ్రీగా ఉంటాయి. కాబట్టి ఏ వయసుల వాళ్లైనా వాటిని వాడుకోవచ్చు. కళలను బతికించడమే కాదు.. మాకు కస్టమర్ల ఆరోగ్యం కూడా ముఖ్యమే. – దత్తాత్రేయ వ్యాస్