సెప్టెంబర్​ 1నుంచి ఖమ్మంలో అగ్నివీర్​ ర్యాలీ

ఖమ్మం, వెలుగు: రాష్ట్రంలో రెండో అగ్నివీర్​ర్యాలీ (ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ)కి ఖమ్మం నగరం వేదికగా మారబోతోంది. వచ్చే నెల 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఖమ్మం జిల్లా కేంద్రంలోని సర్ధార్​పటేల్ స్టేడియంలో ఆర్మీ అభ్యర్థులకు ఫిజికల్​ టెస్టులు, వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. 
ఇప్పటికే ఆన్​లైన్​ఎగ్జామ్​లో పాసైన 7,397 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. రాష్ట్రం యూనిట్​గా ప్రతి యేటా ఒక జిల్లాలో రిక్రూట్ మెంట్ ర్యాలీ నిర్వహించే విధానంలో భాగంగా, ఈ సారి అవకాశం ఖమ్మం జిల్లాకు దక్కింది. గతేడాది సూర్యాపేటలో మొదటి అగ్నివీర్​ర్యాలీ జరిగింది. అవసరమైన డాక్యుమెంట్లు తీసుకురాని కారణంగా, అప్పుడు 3 వేల మంది ర్యాలీలో పాల్గొనే ఛాన్స్ కోల్పోయారు. దీంతో మళ్లీ అలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహించాలని రిక్రూట్ మెంట్ ఆఫీసర్లు సూచిస్తున్నారు. 
మొత్తం సర్టిఫికెట్లకు సంబంధించిన చెక్​లిస్ట్ తయారు చేసుకొని, ఒకటికి రెండుసార్లు చూసుకోవాలని చెబుతున్నారు. ఇప్పటికే అభ్యర్థులకు ఈ –మెయిల్​ద్వారా అడ్మిట్ కార్డు పంపించామని, అందులో పేర్కొన్న అన్ని డాక్యుమెంట్లు రెడీ చేసుకోవాలని, అందులో సూచించిన రోజు, సూచించిన సమయం కంటే ముందుగానే ర్యాలీ జరిగే ప్రదేశానికి చేరుకోవాలని స్పష్టం చేస్తున్నారు. ఏ కారణంతోనైనా ఆ రోజు పాల్గొనలేకపోతే, మళ్లీ అవకాశం ఉండదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెబుతున్నారు. 

ట్రాన్స్​పోర్ట్, వసతి సొంతంగా చూసుకోవాల్సిందే..!
ఖమ్మంలోని డీపీఆర్సీ భవనంలో ఆర్మీ రిక్రూట్​మెంట్​ర్యాలీకి అవసరమైన ఏర్పాట్లపై బుధవారం రిక్రూట్​ మెంట్ ఆఫీసర్​కల్నల్ కీట్స్ కె. దాస్, కలెక్టర్  వి.పి. గౌతమ్, పోలీస్ కమిషనర్​విష్ణు ఎస్. వారియర్ లతో సమావేశమై గ్రౌండ్, భద్రత, ఫైర్ ఫిట్టింగ్ , ట్రాన్స్​పోర్ట్​, డ్రింకింగ్​వాటర్, సీసీ కెమెరాలు, తదితర మౌలిక వసతుల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. సర్ధార్​పటేల్ స్టేడియంలో వచ్చే నెల 1నుంచి ర్యాలీ ప్రారంభం అని చెబుతున్నా, అభ్యర్థులు 31వ తేదీ అర్ధరాత్రి లోపే ఖమ్మం చేరుకోవాల్సి ఉంటుంది. 
1వ తేదీ తెల్లవారుజామున అంటే 2.30 గంటల నుంచే ర్యాలీ మొదలవుతుంది. అయితే, ర్యాలీ ప్రారంభమయ్యేది అర్ధరాత్రి కావడంతో స్టేడియానికి చేరుకునేందుకు ఆటోలు, ఇతర ట్రాన్స్​పోర్ట్ ఏర్పాట్ల గురించి ముందుగానే చూసుకోవాలని సూచిస్తున్నారు. అనారోగ్యంతో ఉన్నా కూడా కేటాయించిన తేదీ రోజు సమయానికి రాలేకపోతే ఉద్యోగ అవకాశం వదులుకున్నట్టేనని చెబుతున్నారు.  

ఈ డిటెయిల్స్ చూసుకోండి
అన్ని సర్టిఫికెట్లలో అభ్యర్థి పేరు, తల్లి పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, ఇతర వివరాలు ఒకే విధంగా ఉండాలని ఆఫీసర్లు చెబుతున్నారు. పదో తరగతి సర్టిఫికెట్​పై ఉన్న వివరాలనే ప్రామాణికంగా తీసుకుంటామని, మిగిలిన అన్ని సర్టిఫికెట్లలో కూడా అవే వివరాలు ఉండేలా చూసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. ఏదైనా మార్పులు చేర్పులున్నా ర్యాలీ ప్రారంభమయ్యేలోగా చేసుకోవాలని సూచిస్తున్నారు.
తప్పక తీసుకురావాల్సిన డాక్యుమెంట్లు 

  •  అడ్మిట్ కార్డు (ఒరిజినల్​కాపీతో పాటు జిరాక్స్​) 
  •  ఎడ్యుకేషనల్​సర్టిఫికెట్లు (ఒరిజినల్​మార్క్స్​షీట్, పాస్​సర్టిఫికెట్​తో పాటు రెండు సెట్ల జిరాక్స్) 
  •  20 పాస్​పోర్టు సైజ్​కలర్​ఫొటోలు 
  •  అఫిడవిట్ (రూ.10 నాన్​జ్యుడీషియల్​స్టాంప్​పేపర్​మీద నోటిఫికేషన్​లో చెప్పిన ఫార్మాట్ లో నోటరీ చేయించాలి) 
  •     నేటివిటీ/ రెసిడెన్స్​సర్టిఫికెట్, కమ్యూనిటీ/ క్యాస్ట్​ సర్టిఫికెట్​(ఫొటోతో పాటు తహసీల్దార్​జారీ చేసినవి. ఒరిజినల్స్​తో పాటు రెండు సెట్ల జిరాక్స్​లు) 
  •     రిలిజియన్​సర్టిఫికెట్ (కమ్యూనిటీ సర్టిఫికెట్​లో రిలిజియన్​ లేకపోతే ఇది ప్రత్యేకంగా తీసుకోవాలి, తహసీల్దార్​జారీ చేసినది, ఒరిజినల్​తో పాటు రెండు జిరాక్స్​లు)
  •     క్యారెక్టర్ సర్టిఫికెట్​(ఫొటోతో పాటు సర్పంచ్ లేదా తహసీల్దార్​నుంచి తీసుకోవాలి, స్కూల్, కాలేజీ నుంచి కూడా తీసుకోవచ్చు, ఒరిజినల్ తోపాటు రెండు జిరాక్స్​లు)
  •     అన్ మ్యారీడ్​ సర్టిఫికెట్​(ఫొటోతో పాటు సర్పంచ్​లేదా మున్సిపాలిటీ నుంచి గత ఆరు నెలలలోపు తీసుకున్నదై ఉండాలి. ఒరిజినల్​తోపాటు రెండు జిరాక్స్​లు) 
  •     పోలీసులు ఇచ్చే​క్యారెక్టర్​సర్టిఫికెట్​ ( గత ఆర్నెళ్లలోపు తీసుకున్నవి మాత్రమే) 
  •     ఆధార్​ కార్డు (ఒరిజినల్, రెండు జిరాక్స్​లు)
  •     పాన్​కార్డు(ఒరిజినల్​, రెండు జిరాక్స్​లు)
  •     ట్రైబల్​ టాటూ సర్టిఫికెట్​(గిరిజనులైతే కలెక్టర్ ద్వారా ధ్రువీకరించింది, ఒరిజినల్ తో పాటు రెండు జిరాక్స్​లు)

ఒక్క డాక్యుమెంట్ లేకపోయినా అనుమతించం
ఖమ్మంలో సెప్టెంబర్​1 నుంచి 7వ తేదీ వరకు అగ్నివీర్​ర్యాలీ నిర్వహిస్తున్నాం. అభ్యర్థుల అడ్మిట్ కార్డులోనే హాజరుకావాల్సిన తేదీ, సమయాన్ని ఇచ్చాం. మాండేటరీ డాక్యుమెంట్లలో ఒక్కటి లేకపోయినా స్టేడియంలోనికి అనుమతించం. అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీలో 1.6 కిలోమీటర్ల రన్నింగ్, పుల్ అప్స్, 8 ఫీట్ డిక్, జిగ్ జాగ్, ఎత్తు, బరువు, ఛాతి, డాక్యుమెంట్ల పరిశీలనతో పాటు వైద్య పరీక్షలు ఉంటాయి. 
‌‌ కల్నల్​ కీట్స్​ కె.దాస్,  ఆర్మీ రిక్రూట్ మెంట్ ఆఫీసర్​

పైరవీలకు తావులేదు
అగ్నివీర్ ర్యాలీకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అభ్యర్థులు అడ్మిట్ కార్డ్ లో సూచించిన అన్ని డాక్యుమెంట్లు తీసుకురావాలి. ఖమ్మం జిల్లాలో ఈ డాక్యుమెంట్ల కోసం ఇప్పుడు మీసేవాలో అప్లై చేసుకున్నా, వీలైనంత త్వరగా సర్టిఫికెట్లు పొందేలా అధికారులకు ఆదేశాలిచ్చాం. ఉద్యోగాల భర్తీలో ఎటువంటి పైరవీలకు తావులేదు. పూర్తి పారదర్శకంగా, మెరిట్, ఫిజికల్ స్టాండర్డ్ ప్రకారం రిక్రూట్​మెంట్​జరుగుతుంది. మధ్యవర్తుల చేతిలో మోసపోవద్దు. 
- వీపీ గౌతమ్​, కలెక్టర్, ఖమ్మం