రీడిజైనింగ్ ఎందుకు.. అంచనాల పెంపు దేనికి?

  • రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల వివరాలు అడిగిన అకౌంటెంట్ జనరల్ 
  • పాలమూరు ప్రాజెక్టుపై ఆడిట్ రిపోర్టు తయారీ కోసం ఇరిగేషన్ సెక్రటరీకి లేఖ

హైదరాబాద్​, వెలుగు: ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు త్వరాత తెలంగాణలో చేపట్టిన అన్ని ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాల వివరాలను ఇవ్వాల్సిందిగా ఇరిగేషన్ శాఖను రాష్ట్ర అకౌంటెంట్ జనరల్​ (ఏజీ) ఆదేశించారు. వాటికి సంబంధించిన అనుమతులు, డీపీఆర్​లు సహా ప్రతిది సమర్పించాలని ఆదేశించారు. 

ప్రాజెక్టుల రీడిజైనింగ్ వివరాలు, అంచనాల పెంపు, ఆ పెంపునకు గల కారణాలను వెల్లడించాలని పేర్కొన్నారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్​పై డిటెయిల్డ్ కంప్లయన్స్ ఆడిట్ (డీసీఏ)ను తయారు చేస్తున్న అకౌంటెంట్ జనరల్ ఆఫీసు.. ఈ ఏడాది మే 31న ముసాయిదా రిపోర్టును ఇరిగేషన్ శాఖకు అందించింది.

 దానిపై అక్టోబర్ 15న అధికారులు రిప్లై ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఫుల్ రిపోర్టును తయారు చేసేందుకు అదనపు సమాచారం ఇవ్వాల్సిందిగా అకౌంటెంట్ జనరల్ (ఆడిట్) ఆదేశాలిచ్చారు. ఈ మేరకు ఇరిగేషన్ శాఖ సెక్రటరీకి లేఖ రాశారు. రిపోర్టును తర్వగా ఇవ్వాల్సి ఉన్నందున వీలైనంత వేగంగా అదనపు వివరాలను సమర్పించాలని అధికారులను లేఖలో ఆదేశించారు.

ఏజీ అడిగిన అదనపు వివరాలు ఏంటంటే..

1. రాష్ట్ర ఇరిగేషన్ ప్లాన్ (మాస్టర్ ప్లాన్)

2. 2014 జూన్​ తర్వాత చేపట్టిన మేజర్, మీడియం ప్రాజెక్టుల వివరాలు. వాటిని ప్రారంభించిన సంవత్సరం సహా వాటి పురోగతి.

3. అప్పటికే చేపట్టి సగంలో ఉన్న ప్రాజెక్టులను 2014 జూన్ తర్వాత రీడిజైనింగ్ చేసిన మేజర్, మీడియం ప్రాజెక్టులు, రీడిజైనింగ్ చేయడానికి గల కారణాలు

4. ఆయా ప్రాజెక్టుల కెపాసిటీ, అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్స్, ఆయకట్టు, మార్చి 2024 వరకు చేసిన ఖర్చు, ప్రాజెక్టు అధికారి/సీఈ, పూర్తి చేయాల్సిన గడువు, అసలు పూర్తయ్యే గడువు, ఇప్పటిదాకా జరిగిన పురోగతి తదితర వివరాలు.

5. ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్​లు.

6. డీపీఆర్​లను తయారు చేసిన సంస్థ వివరాలు. ఆ సంస్థకు నామినేషన్ బేసిస్​లో ఇచ్చారా.. టెండర్ల ద్వారా ఎంపిక చేశారా వంటి వివరాలు

7. ఆయా ప్రాజెక్టుల్లో ప్యాకేజీల వారీగా పనుల పురోగతి, వాటికి పెట్టిన ఖర్చు

8. పునరావాస ప్యాకేజీ స్టేటస్. ఎంత మందికి పునరావాసం కల్పించారు. ఎంతమందికి లబ్ధి చేకూర్చారు, వాళ్ల రీలొకేషన్ వంటి వివరాలు.

9. ప్రాజెక్టుల కోసం తీసుకున్న సీడబ్ల్యూసీ అనుమతులు, కేఆర్ఎంబీ/జీఆర్ఎంబీ అనుమతులు, వన్యప్రాణుల క్లియరెన్స్, పర్యావరణ, అటవీ స్టేజ్​1, 2 అనుమతులు, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు అనుమతులు, గిరిజన శాఖ అనుమతుల వివరాలు.

10. ప్రతి ప్రాజెక్టు ద్వారా ఒక్క టీఎంసీ జలాలతో ఎన్ని ఎకరాలకు నీళ్లివ్వతలపెట్టారో ఆ డేటా

11. ప్యాకేజీల వారీగా నీళ్లివ్వతలపెట్టిన ఆయకట్టు వివరాలు.. ఎంత ఆయకట్టుకు నీళ్లిచ్చారు?

12. ప్యాకేజీలవారీగా డిస్ట్రిబ్యూటరీల నిర్మాణ పురోగతి

13. వాస్తవ అంచనా వ్యయం.. రివైజ్డ్ అంచనా వ్యయాల వివరాలు. ఒకవేళ అంచనా వ్యయాలు పెరిగి ఉంటే పెంచినందుకు గల కారణాలు.

14. ఎన్జీటీ, కోర్టు ఆదేశాలతో ఇంకా మొదలుకాని ప్రాజెక్టులు, మధ్యలో ఆగిన ప్రాజెక్టుల వివరాలు.

సీడబ్ల్యూసీ అనుమతుల్లేకుండానే..

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి సీడబ్ల్యూసీ అనుమతులు లేకుండానే పనులు చేశారని ముసాయిదా రిపోర్టులో ఏజీ పేర్కొన్నట్టు తెలిసింది. కేవలం డ్రింకింగ్ వాటర్ కోసమే సీడబ్ల్యూసీ అనుమతులున్నాయని.. ఇరిగేషన్ కాంపొనెంట్లకు అనుమతులు తీసుకోలేదని వెల్లడించినట్టు సమాచారం. అసలు ఫస్ట్ శ్రీశైలం నుంచి నీటిని ఎత్తిపోసుకునేలా డిజైన్ చేసిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును.. జూరాలకు ఎందుకు మార్చాల్సి వచ్చిందని కూడా ముసాయిదా రిపోర్టులో ప్రశ్నించినట్టు తెలిసింది.

 కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ 2(కేడబ్ల్యూడీటీ2) నుంచి అనుమతులుగానీ.. నీటి కేటాయింపులుగానీ లేకుండానే ప్రాజెక్టును చేపట్టడంపైనా అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అసలు కాంట్రాక్ట్ మేనేజ్​మెంట్ విధానాలను తప్పుబట్టినట్టు సమాచారం. తొలుత పలు ప్యాకేజీల పనులను నవయుగకు ఇచ్చినా.. ఆ తర్వాత కాంట్రాక్ట్​ను మేఘాకు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని, అంచనాల పెంపులోనూ డొల్లతనం ఉందని ఏజీ ముసాయిదా రిపోర్టులో ప్రస్తావించినట్టు సమాచారం.C