బషీర్‌బాగ్, వెలుగు: అడ్వకేట్ సంతోష్ కుమార్‌ను వేధించిన బోరబండ ఎస్ఐ జమీల్ పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అడ్వకేట్ జేఏసీ ప్రభుత్వాన్ని కోరింది. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో తెలంగాణ అడ్వొకేట్ జేఏసీ అధ్యక్షుడు ఏబీ వేద్ ప్రకాష్ యాదవ్ మాట్లాడుతూ.. న్యాయవాదులపై పోలీసుల దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయన్నారు. ఇటీవల న్యాయవాద దంపతులపైన జనగామ పోలీసుల దాడి చేశారని, కూకట్ పల్లి కోర్టులో న్యాయవాది అయిన సంతోష్‌పై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపించారు. అలాగే బోరబండలో మద్యం అమ్ముతున్న ఓ ఇంట్లో న్యాయవాది సంతోష్ రెంట్‌కు ఉంటున్నారని, అన్యాయంగా ఆయనను కేసులో ఇరికించారన్నారు.
పోలీసులు చట్టం తమ చేతుల్లో ఉందని న్యాయవాదులు ఏమీ చేయలేరని దౌర్జన్యానికి ఒడిగడుతున్నారన్నారు. సమస్యను సిటీ పోలీస్ కమిషనర్ కు విన్నవించగా ఆయన కూడా ఎల్ఎల్ఎం చేస్తున్నానని అవహేళనగా మాట్లాడారని వాపోయారు. న్యాయవాడులపై జరిగే దౌర్జన్యాలను అరికట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి కలుగజేసుకోవవాలన్నారు. తక్షణమే బోరబండ ఎస్సై జమీల్, ఇతర పోలీస్ సిబ్బందిని సస్పెండ్ చేయాలన్నారు. ఘటనలో బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే తెలుగు రాష్ట్రాల న్యాయవాద సంఘాలతో కలిసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పి. గోవర్ధన్ రెడ్డి, బత్తుల కృష్ణ, శ్రీకాంత్ యాదవ్, దుర్గాభవాని, విజయ కుమారి పాల్గొన్నారు.