ముదిగొండ, వెలుగు: ‘ఇప్పటిదాకా కలిసి ప్రయాణం చేశాం.. ఇప్పటిదాకా కరెంట్ కనిపించి ఇప్పుడు నీ రాజకీయాల కోసం చీకటి అయిపోయిందా’ అని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు. మండలంలోని మదారపురంలో రైతు వేదికను మంత్రి పువ్వాడ అజయ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరెంట్ విషయంలో మాట్లాడడానికి నోరెట్ల వస్తదని అన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తామని అసెంబ్లీలో చెప్పామని, కొవిడ్ కారణంగా ఇబ్బందులు రావడంతో అమలు చేయలేకపోయామని చెప్పారు. 36 వేల వరకు రుణమాఫీ చేశామని, మిగిలిన రుణాన్ని మిత్తితో సహా మాఫీ చేస్తామని తెలిపారు. కేసీఆర్ మాటిస్తే ఆ పని చేసే తీరుతారన్నారు. మంత్రి పువ్వాడ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వైవిధ్యమైన పంటలు పండించేందుకు కృషి చేస్తుందని తెలిపారు. కేసీఆర్ వ్యవసాయాన్ని పండగలా మార్చారని అన్నారు. జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, కలెక్టర్ వీపీ గౌతమ్, డీఏవో విజయనిర్మల, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ కొరాకుల నాగభూషణం పాల్గొన్నారు. అనంతరం తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ వీఆర్ఏలు మంత్రికి వినతిపత్రం అందజేశారు.
రాష్ట్ర స్కీమ్స్ దేశానికి దిక్సూచి కావాలి
ఖమ్మం టౌన్: రాష్ట్రంలో అమలయ్యే పథకాలు దేశానికి దిక్సూచి కావాలని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రి అజయ్‌తో కలిసి హాజరయ్యారు. చైర్పర్సన్ దొరేపల్లి శ్వేత, వైస్ చైర్మన్షేక్ అఫ్జల్, సభ్యులతో మార్కెట్ శాఖ డీఎంవో నాగరాజు, గ్రేడ్ వన్ సెక్రటరీ రుద్రాక్ష మల్లేశం ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతు సంక్షేమం కోసం చేపడుతున్న స్కీమ్స్ దేశానికి రోల్‌మాడల్‌గా మారాలని అన్నారు. కేంద్ర బడ్జెట్లో వ్యవసాయానికి అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత బడ్జెట్ లో రూ.2.25 లక్షల కోట్లు కేటాయిస్తే, ఈ బడ్జెట్ లో దానిని రూ.1.75 లక్షల కోట్లకు కుదించారని తెలిపారు. కోటి మంది రైతులను మూడేళ్లలో సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లిస్తామని, పది వేల బయో ఇన్ పుట్ రీసోర్స్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, మైక్రో ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్ మాన్యుఫాక్చరింగ్ నెట్ వర్క్ ఏర్పాటు చేస్తామని గొప్పగా ప్రకటించారని విమర్శించారు. ఈ బడ్జెట్ తో రైతులకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. సిటీ మేయర్ పి.నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహరా, ఎమ్మెల్సీలు తాతా మధు, బండా ప్రకాశ్ ముదిరాజ్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, సుడా చైర్మన్ బి విజయ్ కుమార్ పాల్గొన్నారు.
నాణ్యమైన విద్యను అందించాలి
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 7,289 కోట్లతో మన ఊరు–-మన బడి, మన బస్తీ–-మన బడి కార్యక్రమాన్ని చేపట్టిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. రూ.12.49 లక్షలతో నగరంలోని మామిళ్లగూడెం ప్రైమరీ స్కూల్, రూ.1.14 కోట్లతో శాంతి నగర్ హైస్కూల్లో చేపట్టిన డెవలప్మెంట్ వర్క్ పూర్తి కావడంతో ఆ స్కూళ్లను మంత్రి పునః ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కార్పొరేట్ స్కూళ్ల మాదిరిగా ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి చేసి అన్ని సౌలతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో మొదటి విడతగా 426 స్కూల్స్‌లలో సౌలతులు కల్పించినట్లు చెప్పారు. కలెక్టర్ వీపీ గౌతమ్, అడిషనల్ కలెక్టర్ స్నేహలత మొగిలి, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, డీఈవో సోమశేఖర్ శర్మ, పబ్లిక్ హెల్త్ ఈఈ రంజిత్, మున్సిపల్ ఈఈ కృష్ణలాల్ పాల్గొన్నారు.