- సీఎం రేవంత్‌రెడ్డికి మంత్రి తుమ్మల వినతి
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌ను అప్‌గ్రేడ్ చేసి యూనివర్సిటీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్‌గా ఏర్పాటు చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. కొత్తగూడెంలో సింగరేణి కాలరీస్ కంపెనీ ప్రధాన కార్యాలయంతో పాటు టీఎస్ జెన్కో, నవభారత్ వెంచర్స్, బయ్యారం మైన్స్, మైలారం కాపర్ మైన్స్, ఎన్ఎండీసీ లాంటివి ఉన్నాయని, ఇక్కడ ఉన్న కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌ను యూనివర్సిటీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ గా అప్‌గ్రేడ్ చేయాలని కోరారు.
భద్రాద్రికొత్తగూడెం జిల్లా కేంద్రంగా, గ్రీన్ ఫీల్డ్ హైవే నేషనల్ హైవేలతో రవాణా వ్యవస్థ అనువైన ప్రాంతంగా ఉందని తెలిపారు. జిల్లా కేంద్రంలో విమానాశ్రయం ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల విద్యార్థులకు కొత్తగూడెం యూనివర్సిటీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ప్రయోజనకరంగా ఉంటుందని వివరించారు.
యూనివర్సిటీలో యుజీ, మాస్టర్స్, పీహెచ్డీ ప్రోగ్రాంలో భూగర్భ శాస్త్రం, ఎన్విరాన్ మెంటల్ సైన్స్, జియో ఫిజిక్స్, జియో కెమిస్ట్రీ లాంటి ప్రోగ్రామ్స్అదనంగా చేర్చి శిక్షణ ఇప్పించాలన్నారు. ఇలా చేస్తే భారతదేశంలోనే మొట్టమొదటి యూనివర్సిటీ అవుతుందని తెలిపారు. దీనికి సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. త్వరలో చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.