టూరిజం హబ్​గా ఖమ్మం : తుమ్మల నాగేశ్వరరావు

 టూరిజం హబ్​గా ఖమ్మం : తుమ్మల నాగేశ్వరరావు
  • మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
  • పర్యాటక అభివృద్ధిపై సమీక్ష

ఖమ్మం, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లాను పర్యాటక గుమ్మంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం ఖిల్లాకు పూర్వ వైభవం తీసుకొచ్చేలా ఖిల్లా అభివృద్ధి చేస్తామని చెప్పారు. గురువారం సెక్రటేరియట్ లో పర్యాటక అభివృద్ధిపై, రూ.29 కోట్లతో ఖమ్మం ఖిల్లాపై నిర్మించ తలపెట్టిన రోప్ వే పనుల గురించి రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్​రెడ్డి, ఎండీ ప్రకాశ్ రెడ్డితో మంత్రి తుమ్మల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఖమ్మం ఖిల్లాపై రోప్ వే నిర్మాణ పనులను స్పీడప్​ చేయాలన్నారు.

రోప్ వే బ్రిడ్జి లోయర్ పాయింట్ దగ్గర పార్కింగ్ కోసం, యంత్రాల తరలింపు కోసం స్థలం విశాలంగా ఉండేలా చర్యలు చేపట్టాలని చెప్పారు. లోయర్ పాయింట్ నిర్మాణానికి లకారం చెరువు పరిసర ప్రాంతం అనువుగా ఉంటుందని, ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. టూరిజం హబ్ గా ఖమ్మం ఖిల్లాను మార్చాలని, నిధులను సమకూర్చే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. రోప్ వే తో పాటు అమ్యుస్ మెంట్ పార్కులు, హోటళ్ల నిర్మాణం, వాటర్ ఫాల్స్, హాళ్ల నిర్మాణం రెండో దశలో చేపట్టాలని సూచించారు.

దక్షిణ అయోధ్య భద్రాచలంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసేలా చర్యలు తీసుకోవాలన్నారు. భద్రాద్రిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కిన్నెరసాని ప్రాజెక్టు అభివృద్ధి, వసతుల కల్పనకు కృషి చేస్తామన్నారు. ఖమ్మం జిల్లాలో టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, వైజ్ఞానిక యాత్రలకు శ్రీకారం చుడుతామని వెల్లడించారు.

నేలకొండపల్లి బౌద్ధ స్తూపం, భక్త రామదాసు ధ్యాన మందిరం, కుసుమంచి శివాలయం టూరిజం సర్క్యూట్లు ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. టూరిజం కార్పొరేషన్ ఎండీ ప్రకాశ్​రెడ్డి మాట్లాడుతూ రోప్ వే పనులకు సంబంధించి ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెప్పారు. వాటి నిర్మాణ పనులు చేపట్టడానికి ఈ రంగంలో పేరున్న సంస్థలను సంప్రదించినట్లు తెలిపారు.