రైతులకు రెండ్రోజుల్లో పంట నష్టపరిహారం : తుమ్మల నాగేశ్వరరావు

రైతులకు రెండ్రోజుల్లో పంట నష్టపరిహారం : తుమ్మల నాగేశ్వరరావు
  • 8 జిల్లాల్లో సర్వే పూర్తి కాకపోవడంతో ఆలస్యం 
  • వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం, వెలుగు : రాష్ట్రంలో ఇటీవల వరదలు, భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతుల ఖాతాల్లో రెండు రోజుల్లో పంట నష్టపరిహారాన్ని జమ చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం కలెక్టరేట్ లో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఖమ్మం, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఆసిఫాబాద్, వికారాబాద్, వనపర్తి, సూర్యాపేట జిల్లాల్లో ఇంకా సర్వే పూర్తి కాలేదని చెప్పారు. ఇప్పటి వరకు సర్వే పూర్తయిన జిల్లాల్లో రైతులకు ముందుగా పరిహారాన్ని అందిస్తామన్నారు. 

రుణమాఫీకి సంబంధించి రేషన్​ కార్డు లేని వారికి కుటుంబ నిర్దారణ, పంట నష్టం సర్వే ఒకేసారి చేయాల్సి రావడం వల్ల వ్యవసాయ శాఖ సిబ్బంది బిజీగా ఉన్నారని తెలిపారు. రూ.2 లక్షలకు పైగా రుణాలు ఉన్న రైతుల రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి వెసులుబాటును బట్టి షెడ్యూల్ ను రిలీజ్​ చేస్తామన్నారు. రూ.2 లక్షల లోపు రుణ మాఫీ వంద శాతం పూర్తయిన తర్వాత ఆ షెడ్యూల్ ను రిలీజ్ చేస్తామన్నారు. ఇప్పటి వరకు రూ.18వేల కోట్లు రుణమాఫీ కింద జమ చేశామని, ఇంకా రూ.13 వేల కోట్లు​చేయాల్సి ఉందన్నారు. 

వరదలతో రూ.10వేల కోట్ల నష్టం జరిగిందన్న అంచనాలతో కేంద్రానికి రిపోర్టు ఇచ్చామని, ఇంత వరకు ఒక్క రూపాయి కూడా కేంద్రం నుంచి రాలేదని తెలిపారు. ఇటీవల తాను ఢిల్లీ వెళ్లిన సమయంలో కేంద్ర మంత్రి శివరాజ్​ సింగ్  చౌహాన్ ను కలిసి దీనిపై రిక్వెస్ట్  చేశానన్నారు. గతంలో అటవీశాఖ భూములను ఎక్కువగా చూపించడం వల్ల కొండలు ఎక్కువగా ఉన్నాయనే కారణంతో కొత్తగూడెం ఎయిర్​ పోర్ట్​ రిజెక్ట్​ అయిందని

దానిపై ఇటీవల కేంద్రమంత్రి రామ్మోహన్​ నాయుడును కలిశానని చెప్పారు. ఆయిల్ పామ్​ దిగుమతిపై కేంద్రం ఇంపోర్ట్  డ్యూటీని విధించడం వల్ల రాష్ట్రంలో ఆయిల్ పామ్  రైతులకు లబ్ధి జరుగుతుందన్నారు. టన్నుకు రూ.1,500 పైగా ధర పెరిగే అవకాశముందన్నారు. 

రైతులకు గిట్టుబాటయ్యేలా చూడాలి..

రైతులకు లాభం కలగాలనే ఉద్దేశంతో మద్దతు ధరతో పెసర్లు కొనుగోలు చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు చెప్పారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్  యార్డులోని పెసర్ల కొనుగోలు కేంద్రాలను మంత్రి పరిశీలించారు. క్వింటా పెసర్లకు ప్రభుత్వం రూ.8,682 మద్దతు ధర చెల్లిస్తుందని, రైతులకు గిట్టుబాటయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రైతుల వద్ద ఉన్న చివరి గింజ వరకు పెసర్లను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని మంత్రి ఆదేశించారు.