సీఎం అయ్యే అర్హత బీసీలకు లేదా?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి కూడా ఇప్పటి వరకు ఒక్క బీసీ నాయకుడు ముఖ్యమంత్రి కాలేదు. 1956లో ఆంధ్రప్రదేశ్​ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు అగ్రవర్ణాల నాయకులే సీఎం పీఠం ఎక్కుతున్నారు తప్ప.. బీసీలకు అవకాశం దక్కడం లేదు. రాష్ట్ర జనాభాలో సగానికిపైగా ఉన్నా కూడా బీసీలు రాజ్యాధికారానికి దూరం కావాల్సి వస్తోంది. దీనికి మూడు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. ఒకటి అర్థబలం లేకపోడం అయితే మరొకటి ఇప్పటికీ బీసీలపై కొనసాగుతున్న చిన్నచూపు. బీసీల్లో ఐకమత్యం లేకపోవడంతో పెద్ద కులాల నాయకులే పాలకులుగా ఉంటూ వస్తున్నారు.

భాషా ప్రాతిపదికన దేశంలో తొలిసారి ఏర్పడిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్​ ఏర్పాటైంది. ఆనాడు రకరకాల చేతివృత్తులను కలుపుకున్న తర్వాత రాష్ట్రంలో బీసీల సంఖ్య 51 శాతంగా ఉంది. పెద్ద కులాల వారి సంఖ్య 32 శాతం కాగా, ఎస్సీ, ఎస్టీలు 9 శాతం, ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీలు 8 శాతంగా ఉన్నారు. అంటే కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్​లో బీసీలు సగానికంటే ఎక్కువ మంది ఉన్నట్టే కదా! కానీ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి నియమితులయ్యారు. 1956 నుంచి ఆంధ్రప్రదేశ్​ రెండుగా విభజించే వరకు సుమారు 16 మంది ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పరిపాలించారు. అయితే ఈ 16 మంది ముఖ్యమంత్రుల్లో ఒక్కరు కూడా బీసీ నాయకుడు లేరు. ఒక్కరు తప్ప అందరూ ఆధిపత్య కులాలకు చెందినవారే. ఆ ఒకే ఒక్కడు దళిత, మచ్చలేని నాయకుడు దామోదరం సంజీవయ్య. ఆయన కూడా రెండేండ్లు మాత్రమే పదవిలో కొనసాగారు. 

ఒక్క బీసీ ముఖ్యమంత్రి కూడా లేరు

15 మంది అగ్ర కులాలకు చెందిన ముఖ్యమంత్రుల్లో 10 మంది రెడ్లు కాగా, ఇద్దరు కమ్మ, ఒకరు బ్రాహ్మణ, ఒకరు వెలమ, ఒకరు వైశ్య. జనాభాలో చాలా తక్కువ శాతం ఉన్నా వీరందరూ ముఖ్యమంత్రులు కాగలిగారు కానీ, సగానికిపైగా ఉన్న బీసీల నుంచి ఒక్కరు కూడా సీఎం పదవిని చేపట్టకపోవడం ఆశ్చర్యకరమైన విషయం. బీసీల పట్ల పార్టీల వైఖరిని వెల్లడించడానికి ఇంతకంటే వేరే ఉదాహరణలు ఉంటాయా? ఆంధ్రప్రదేశ్​ ఏర్పడిన తర్వాత రాష్ట్రం రెండుగా విడిపోయే వరకు అంటే 58 ఏండ్ల కాలాన్ని పరిశీలిస్తే.. రెండు మూడుసార్లు బీసీ నాయకులు ముఖ్యమంత్రులు అవుతారనే ఆశలు రేకెత్తాయి. కానీ, అగ్రకుల నాయకుల ఆధిపత్యంతో బీసీ నాయకులెవరూ సీఎం కాలేకపోయారు. ఉదాహరణకు 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల సమయంలో డి.శ్రీనివాస్ పీసీసీ అధ్యక్షునిగా ఉన్నారు. ఆయన సీఎం అవుతారేమో అని అనుకున్నారు. కానీ, డి.శ్రీనివాస్​ను పక్కన పెట్టి, వైఎస్​ రాజశేఖర్​రెడ్డి సీఎం అయ్యారు. ఇలా సీఎం పదవి దక్కని బీసీ నాయకులు చాలా మంది ఉన్నారు. 

మూడు ప్రధాన కారణాలు

ఆధిపత్య కులాల నాయకులకు పోటీగా బీసీలు రాజకీయంగా ఎదగకపోవడానికి ముఖ్యమైన మూడు కారణాలు ఉన్నాయి. మొదటిది అర్థబలం. చేతివృత్తులు చేసుకునే బీసీలు రోజుకు 18 గంటలు వారివారి కులవృత్తుల్లో నిమగ్నమై ఉండవలసిందే. లేదంటే వాళ్ల సంసారం ముందుకు సాగదు. అందుకే బీసీలు నూటికి 90 శాతం మంది యావరేజ్​ స్థాయిలోనే ఉండిపోయారు. ఈ రోజుల్లో రాజకీయాల్లో రాణించాలంటే కోట్లు ఖర్చు పెట్టగలిగే స్థితిలో ఉండాలి. ఒకరు ఎమ్మెల్యేగా గెలవాలంటే ఐదారు కోట్ల రూపాయలను ఎన్నికల్లో ఖర్చు పెట్టగలగాలి. అంతేకాకుండా మరో ఐదారు కోట్లు అధిష్టానానికి పార్టీ ఫండ్​ కింద సమర్పించుకోవాలి. అందుకే ప్రస్తుతం ముఖ్యమంత్రులు మొదలుకుని ఎమ్మెల్యేల వరకూ దాదాపు అందరూ కోటిశ్వరులే ఉన్నారు. రెండవది బీసీలంటే ఉన్న చిన్నచూపు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో బీసీల గురించి పెద్ద కులాల వారిలో ఉన్న చిన్నచూపు పోలేదు. బీసీలంటే ఇప్పటికీ చేతివృత్తులు చేసే వారిగానే చూస్తున్నారు. వీరికి ఎందుకు రాజకీయాలనేది అగ్రవర్ణాల నాయకుల ఉద్దేశం. మూడవది బీసీల్లో ఐక్యత లేకపోవడం. బీసీలను ఐక్యంగా ఉండనివ్వరు అగ్రకులాల నాయకులు. ఎప్పటికప్పుడు బీసీల మధ్య చిచ్చుపెడుతూనే ఉంటారు. అందుకే వంద ఇండ్లు ఉన్న గ్రామంలో 50 ఇండ్లల్లో ఉన్నా.. బీసీలు సర్పంచ్​ కాలేకపోతున్నారు. కానీ, రెండుమూడు ఇండ్లలో ఉండే వారు సర్పంచ్​లై పెత్తనం చెలాయిస్తున్నారు.

టీఆర్ఎస్​లో నో చాన్స్

ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో బీసీల రాజకీయ స్థితిగతుల గురించి తెలుసుకుంటే, తెలంగాణలో దేశంలో మరే రాష్ట్రంలోనూ లేనంత అధిక స్థాయిలో బీసీలు ఉన్నారు. మొత్తం రాష్ట్ర జనాభాలో బీసీల సంఖ్య 56 శాతంపైనే. అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఇప్పటి నుంచే 2023లో జరిగే ఎన్నికలపై దృష్టి పెడుతున్నారు. మూడు ప్రధాన పార్టీలు తమదే అధికారం అని ఓపెన్​గానే చెప్పుకుంటున్నాయి. మొదటగా అధికార టీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నా, ఓ ఆరు నెలల ముందు ఆకర్షణీయమైన పథకాలు ప్రవేశపెట్టవచ్చు. అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులను, ముఖ్యంగా పోలీసు వ్యవస్థను తమకు అనుకూలంగా తిప్పుకోవచ్చు. అన్నింటికీ మించి డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెట్టవచ్చు. మొన్న ఒక్క హుజూరాబాద్​ ఉప ఎన్నిక విషయంలోనే కోట్లకు కోట్లు ఖర్చుపెట్టిన అధికార పార్టీ.. మొత్తం అసెంబ్లీ ఎన్నికల కోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనుకాడదు. 2023లో తిరిగి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందనుకుందాం.. అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు అవుతారు. బీసీ సీఎం కాగలరా? కలలో కూడా కాలేరు. తిరిగి కేసీఆర్ సీఎం కావచ్చు లేదంటే కేటీఆర్ కావచ్చు. అంతేకానీ బీసీలకు మాత్రం చాన్స్​ ఉండదు. 

కాంగ్రెస్​ అవకాశం ఇవ్వలేదు

1956 ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కువ కాలం అధికారంలో ఉన్నది కాంగ్రెస్​ పార్టీనే. అవకాశం వచ్చినా కూడా బీసీని ముఖ్యమంత్రిని కానివ్వలేదు. అవకాశం వచ్చినా కూడా బీసీని ముఖ్యమంత్రిని కానివ్వలేదు. కాంగ్రెస్​ కనుక తెలంగాణలో అధికారంలోకి వస్తే, రెడ్డి కులానికి చెందిన వారే ముఖ్యమంత్రి అవుతారు తప్ప బీసీలు కాలేకపోవచ్చు. కాంగ్రెస్​లో సి.జగన్నాథరావు, డాక్టర్​లక్ష్మీనర్సయ్య, వి.హన్మంతరావు, మధుయాష్కీ, పొన్నాల లక్ష్మయ్య లాంటి సీనియర్​ బీసీ నాయకులు ఉన్నా.. వాళ్లెవరూ ముఖ్యమంత్రులు కాలేకపోయారు. 2023లో కాంగ్రెస్​ గెలిచినా ఇదే రిపీట్​ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక బీజేపీ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బీసీ. ఈటల రాజేందర్, కె.లక్ష్మణ్​, ఎంపీ అరవింద్ వీరంతా బీసీలే. కిషన్​ రెడ్డి ఒక్కరే కేంద్ర మంత్రిగా ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్​లోనూ సేమ్​ సీన్

ఇక ఆంధ్రప్రదేశ్​ విషయానికి వస్తే.. మరో 30, 40 ఏండ్ల తర్వాత కూడా బీసీ సీఎం అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. కారణం మొదటి నుంచి ఏపీలో బీసీలు, చేతివృత్తుల వారు రాజకీయంగా ప్రాధాన్యం లేదు. అగ్రవర్ణ కులాలైన రెడ్లు, కమ్మలు, కాపులు, రాజులు మాత్రమే రాష్ట్ర రాజకీయాల్లో ముందుంటారు. వీళ్ల వెనుకనే బీసీలు ఉంటారు. అందుకే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం అగ్రవర్ణాల వారికి మాత్రమే ఉంటోంది. జనాభా విషయంలో కూడా తెలంగాణతో పోలిస్తే ఏపీలో బీసీల సంఖ్య తక్కువ. ఆర్థికంగా కూడా బీసీలు బలహీనులే. కానీ, ఈ రోజు రాజకీయాల్లో రాణించాలంటే ముఖ్యమైన ఆయుధం డబ్బే! అది లేకపోవడంతో బీసీలు రాజకీయంగా ఎదగలేకపోతున్నారు. ఇప్పటికైనా బీసీలంతా రాజ్యాధికారం దక్కించుకునేందుకు ఐక్యంగా ముందుకు సాగాలి. రాజ్యాధికారంలో తమ వాటాను దక్కించుకునేందుకు కలిసికట్టుగా పోరాడాలి.

– మునిగంటి శతృఘ్నచారి,

కార్యదర్శి, రాష్ట్ర బీసీ సంఘం, తెలంగాణ