- కుల సంఘాల సూచనలు ప్రభుత్వానికి నివేదిస్తం: బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్
- హైదరాబాద్ జిల్లాలో బహిరంగ విచారణ
- వివిధ కులసంఘాల నుంచి 90 అర్జీల స్వీకరణ
హైదరాబాద్ సిటీ, వెలుగు: అన్ని రంగాల్లో బీసీల అభ్యున్నతికి సమగ్ర నివేదిక తయారు చేస్తామని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ తెలిపారు. బీసీల సామాజిక, విద్యాపరమైన స్థితిగతులు, ఇతర అంశాలపై వివిధ కుల సంఘాలు ఇచ్చిన వినతులు, సలహాలు, సూచనలపై జిల్లాల వారీగా రిపోర్ట్లు సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేస్తామని వెల్లడించారు. బీసీల ఆర్థిక, సామాజిక స్థితిగతులపై అధ్యయనంలో భాగంగా శనివారం హైదరాబాద్ కలెక్టరేట్ లో బహిరంగ విచారణ నిర్వహించారు.
అనంతరం హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తో కలిసి మీడియాతో మాట్లాడారు. బహిరంగ విచారణలో హైదరాబాద్ జిల్లా నుంచి వివిధ కుల సంఘాలు, వ్యక్తుల ద్వారా 90 అప్లికేషన్లు అందాయని తెలిపారు. ఇప్పటికే ఉమ్మడి 9 జిల్లాల్లో విచారణ చేసి చివరిగా హైదరాబాద్ జిల్లాలో చేపట్టామని చెప్పారు. రాష్ట్రంలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే 87.1శాతం పూర్తయిందని, జీహెచ్ఎంసీ పరిధిలో 72 శాతానికిపైగా జరిగిందని తెలిపారు.
సోమవారం, మంగళవారాల్లో ఖైరతాబాద్ బీసీ కమిషన్ భవన్ లో, రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. కుల సంఘాల నాయకుల అర్జీలపై ప్రభుత్వ ఆదేశాల మేరకు సుదీర్ఘంగా విచారణ జరుగుతుందని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. బీసీల స్థితిగతులను ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందించడమే కార్యక్రమ లక్ష్యమన్నారు. సమావేశంలో కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాశ్, రంగు బాలలక్ష్మి, తిరుమలగిరి సురేందర్, ప్రత్యేక అధికారి సతీశ్ కుమార్, అదనపు కలెక్టర్ రెవెన్యూ ముఖుంద రెడ్డి, డీఆర్ ఓ వెంకటాచారి, ఆర్డీఓలు సాయిరాం, రామకృష్ణ, ఉప సంచాలకులు బీసీ సంక్షేమ శాఖ ఆశన్న తదితరులు పాల్గొన్నారు.
పలు కుల సంఘాల వినతులు..
బహిరంగ విచారణలో పలు కుల సంఘాల నేతలు కమిషన్కు వినతిపత్రాలు అందజేశారు. బుడబుక్కల పేరు సమాజంలో ఒక తిట్టుగా ఉండటం వల్ల ఆ పేరును ఆరే క్షత్రియ జోషీ లేదా శివ క్షత్రియగా మార్చాలని బుడబుక్కల సంఘం నాయకుడు లక్ష్మణరావు బీసీ కమిషన్ ను కోరారు. అలాగే, వంశరాజుల కులం పేరు పక్కన పిచ్చగుంట్ల అనే పదాన్ని తీసేయాలని వంశరాజుల కుల సంఘ నేతలు కోరారు. బీసీ జాబితా నుంచి తొలగించిన 26 కులాలను తిరిగి బీసీ జాబితాలో చేర్చుకోవాలని గవర, శెట్టిబలిజ కుల సంఘ నాయకులు బీసీ కమిషన్ ను కోరారు.
తమను బీసీ–డీ నుంచి బీసీ– ఏ కేటగిరిలోకి మార్చాలని సగర(ఉప్పర) కుల సంఘ నాయకులు వేడుకొన్నారు. సొంది కులాన్ని బీసీ ఏ జాబితాలోకి మార్చాలని ఆ సంఘం నేతలు కోరారు. బీసీలకు క్రీమీలేయర్ తీసెయ్యాలని పలువురు బీసీ కుల సంఘాల నాయకులు కమిషన్ కు విన్నవించుకున్నారు. ఎస్సీ, ఎస్టీ కేసుల నుంచి బీసీలను మినహాయించేలా చూడాలని బీసీ ఉద్యోగులు కమిషన్ను కోరారు.
కుమ్మరులు బీసీ బీ నుంచి బీసీ ఏ కు మార్చాలని, రజకులను బీసీ నుంచి ఎస్సీ జాబితాకు మార్చలని ఆయా కులసంఘాల నేతలు, సయ్యద్, ఖాన్, మీర్జాలను బీసీ–ఈ జబితాలో చేర్చాలని మైనారిటీ నేతలు బీసీ కమిషన్ ను కోరారు. తమను ఎంబీసీలలో చేర్చాలని పూసల సంఘం, ఎస్టీలలో కలపాలని వడ్డెర సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను పూర్తిగా తొలంగించాలని తెలంగాణ బీసీ ఉద్యోగుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు.