తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్టకు దసరా పండుగనాడు బోల్డెంత ఇంపార్టెన్స్ ఉంటుంది. పూర్వం పొలాల్లో ఎక్కువగా కనిపించే ఈ పాలపిట్టలు పొలాల్లో ఉండే పురుగు, పుట్రా తినేసేవి. దాంతో పంట నష్టం తగ్గి, రైతుకి లాభాలు వచ్చేవి. అందుకే పాలపిట్టలు సంపదను రెట్టింపు చేస్తాయని భావించేవాళ్లు. పల్లెల్లో లేదా పొలాల్లో ఇవి కనిపిస్తే సంబురంగా ఉండేది. ఆ సంబురాలు ఇప్పుడు, ఎప్పుడూ మన సొంతం కావాలంటే పాలపిట్టల సంతతి గురించి జాగ్రత్తపడాల్సిన అవసరం ఉంది అంటున్నారు బర్డ్వాచర్ సొసైటీ సభ్యులు శ్రీరామ్ రెడ్డి, కృష్ణ కిషోర్.
దసరా పండుగ రోజున పాలపిట్టని చూస్తే అంతా మంచే జరుగుతుందనే నమ్మకం ఉంది. పూర్వం రోజుల్లో అయితే పచ్చని పొలాల మీద ఎగురుతూ కనిపించేవి పాలపిట్టలు. కానీ, ఇప్పుడలా కనపడట్లేదు. కానీ, పండుగ ఆచారంలో భాగంగా వాటిని చూసే పద్ధతి మాత్రం పోలేదు. అందుకని ఆ ఒక్కరోజు వాటిని చూడటం కోసం నెల రోజుల ముందు నుంచే వాటిని పట్టుకుని తెస్తున్నారు. పండుగ రోజున వాటిని ఆలయాల్లో భక్తుల సందర్శన కోసం ఉంచుతున్నారు.
ఆ మూడు కారణాలు
తిండి దొరక్క : పాలపిట్టల సంఖ్య తగ్గిపోవడానికి మూడు కారణాలు ఉన్నాయి. వాటిలో మొదటిది.. పొలాల్లో పురుగు మందులు ఎక్కువగా వాడడం. పెస్టిసైడ్స్ వాడకం పెరిగినప్పటి నుంచి పాలపిట్టల సంఖ్య రోజురోజుకి తగ్గుతూ వస్తోంది. గత రెండేండ్లలో పెస్టిసైడ్స్ వాడకం బాగా పెరిగింది. అలా పురుగుల్ని మనమే చంపేస్తున్నాం. ఇక వాటికి ఆహారం ఎక్కడి నుంచి దొరుకుతుంది? అందుకే పంట పొలాల్లో అవి కనిపించడం లేదు.
నివాసం లేక : మామూలుగా పాలపిట్టలు చెట్టు తొర్రల్లో గూడు కట్టుకుని, అందులో గుడ్లు పెడతాయి. అయితే రకరకాల అవసరాల కోసం ఎండిపోయిన లేదా పాత చెట్లను నరికేస్తున్నారు. దాంతో అవి వాటి నివాసాలు కోల్పోతున్నాయి. అప్పటికే గుడ్లు పెట్టి ఉంటే.. అవి కూడా కిందపడి పాడవుతున్నాయి. దాంతో పాలపిట్టల సంతతి పెరగకుండా పోతోంది.
స్వేచ్ఛ కోల్పోయి : నిజానికి దసరా పండుగ రోజున బయటకెళ్లి పాలపిట్టని చూడమని చెప్తారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ప్రత్యేకంగా వాటిని పట్టుకొచ్చి, ఒకచోట బంధించి చూపిస్తున్నారు. ఇలా చేయడం పక్షుల ప్రేమికులకు బాధ కలిగించే విషయం. అడవిలో స్వేచ్ఛగా తిరిగే పక్షులు ఏవైనా సరే... వాటిని బంధిస్తే, అవి తిండి మానేస్తాయి. అలానే ఉంచితే కొంత కాలానికి అవి చనిపోయే ప్రమాదం ఉంది. అందుకని పండుగ రోజుల్లో వాటిని చూసేందుకు తేవడం కాకుండా... బయటికి అడుగపెడితే అవి కనిపించే వాతావరణాన్ని వాటికి ఇవ్వాలి” అంటున్నారు బర్డ్ వాచర్ సొసైటీ సభ్యులు శ్రీరాం రెడ్డి.
బర్డ్వాచర్ గ్రూప్లో నేను మెంబర్ని. దసరా టైంలో పాలపిట్టల్ని పట్టుకొస్తుం టారు. అందుకని ఈ కాన్సెప్ట్ మీద ఇప్పుడు చెప్తే జనాల్లో అవగాహన కలిగించినట్లు ఉంటుంది అనే ఉద్దేశంతో బొమ్మలతో పోస్టర్ చేశాం.
కృష్ణ కిషోర్ ఇయ్యుణ్ణి బర్డ్ వాచర్, బర్డ్ పెయింటింగ్ ఆర్టిస్ట్
అవగాహన కోసం..
ఎనిమిదేండ్ల నుంచి బర్డ్ వాచర్ సొసైటీలో మెంబర్ని. స్టేట్ ఆఫ్ ఇండియన్ బర్డ్స్ 2023 రిపోర్ట్ తయారుచేసిన వాళ్లలో నేను కూడా ఒకడ్ని. తెలంగాణ, కర్నాటక రెండు రాష్ట్రాల రాష్ట్ర పక్షి పాలపిట్ట. అంతేకాదు.. జానపద కథల్లో పాలపిట్ట గొప్పతనం గురించి ఉంది. సంప్రదాయ పరంగా కూడా దానికి చాలా ప్రాముఖ్యత ఉంది. కానీ, గత పన్నెండేండ్లుగా చూస్తే (ఇండియన్ రోలర్ బర్డ్స్) పాలపిట్టల సంఖ్య 30 శాతం కంటే ఎక్కువగా తగ్గింది. ఇదిలాగే ఉంటే... కంటికి కనిపించకుండా పోతుంది అనిపిస్తుంది. దీనిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈసారి దసరాకి ఈ థీమ్ తీసుకున్నా. మొదట ఇంగ్లిష్ పోస్టర్ చేశాం. కానీ, తెలుగు వాళ్లందరిలో అవగాహన కల్సించాలనే ఉద్దేశంతో తెలుగు పోస్టర్ కూడా చేశాం. తెలంగాణ కోసం పాలపిట్ట మీద మరో ప్రాజెక్ట్ కూడా చేయబోతున్నాం.
శ్రీరామ్ రెడ్డి, హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ అడ్మిన్, నేషనల్ బయో డైవర్సిటీ అథారిటీ కన్సల్టెంట్