హైదరాబాద్, వెలుగు: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మునుగోడు ప్రచార సభ రద్దయింది. ఉప ఎన్నిక ప్రచార సభను ఈ నెల 31 న నిర్వహించి దానికి నడ్డాను చీఫ్ గెస్టుగా పిలవాలని ఇంతకుముందు రాష్ట్ర పార్టీ నిర్ణయించింది. అయితే ప్రస్తుతం రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. రాష్ట్రంలో గతంలో జరిగిన బీజేపీ జాతీయ నేతల సభల సందర్భంలో జనాన్ని రాకుండా రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో అడ్డుకునే ప్రయత్నం చేసిందని, రాజగోపాల్ రెడ్డి నామినేషన్ వేసిన రోజునా ఎక్కడికక్కడ పోలీసులు జనాన్ని రాకుండా అడ్డుకున్న విషయాన్ని గుర్తించి నడ్డా సభను రద్దు చేసినట్లు పార్టీ రాష్ట్ర నాయకత్వం తెలిపింది.
ఇప్పుడు కూడా నడ్డా సభకు ఆటంకాలు సృష్టించే అవకాశం ఉందని, అందుకే ఆ సభకు బదులు అదే రోజున మునుగోడు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో, మున్సిపల్ కేంద్రాల్లో 9 చోట్ల సభలు నిర్వహించాలని రాష్ట్ర బీజేపీ నిర్ణయించింది. ఒక్కో సభకు ఒక్కో రాష్ట్ర, జాతీయ స్థాయి ముఖ్య నేతను గెస్టుగా పిలవాలని ప్లాన్ చేసింది. ఆ రోజు మధ్యాహ్నం బైక్ ర్యాలీ, సాయంత్రం సభ నిర్వహించాలని డిసైడ్ అయింది. చీఫ్ గెస్టులు ఎవరెవరు వస్తారనేది ఒకట్రెండు రోజుల్లో ప్రకటిస్తామని చెప్పింది.