మార్చి 6న తెలంగాణ కేబినెట్ భేటీ

మార్చి 6న తెలంగాణ కేబినెట్ భేటీ
  • బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులను ఆమోదించే చాన్స్ 
  • అఖిలపక్ష నేతలతో ప్రధాని మోదీని కలిసే అంశంపై చర్చ 
  • అసెంబ్లీ బడ్జెట్ సెషన్‌‌పైనా నిర్ణయం తీసుకునే అవకాశం

హైదరాబాద్, వెలుగు: మార్చి6న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. సెక్రటేరియేట్‌‌‌‌‌‌‌‌లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న సమావేశంలో కీలక అంశా లపై చర్చించడంతో పాటు బిల్లులకు ఆమోదం తెలపనున్నారు. రాష్ట్రంలో రెండో దఫా నిర్వహించిన కులగణన సర్వే, దానికి సంబంధించిన రిపోర్టుపై చర్చించే అవకాశం ఉంది. 

బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు రెండు బిల్లులకు ఆమోదం తెలుపనున్నట్టు తెలిసింది. వీటిలో ఒకటి స్థానిక సంస్థల్లో, మరొకటి విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించినది. అలాగే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన బిల్లుపై కూడా కేబినెట్‌‌‌‌‌‌‌‌లో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. 

మంత్రివర్గ సమావేశంలో ఇతర అంశాలపైనా చర్చించనున్నట్టు తెలుస్తున్నది. అప్పటికి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియనుండడంతో ఇందిరమ్మ ఇండ్లకు ఆర్థిక సాయం, రేషన్​కార్డుల పంపిణీ ఇతరత్రా వంటి వాటిపై చర్చించనున్నారు. 

రెండో వారంలో బడ్జెట్.. 

బీసీ రిజర్వేషన్ల బిల్లులను అసెంబ్లీలో ఆమోదించిన తర్వాత సీఎం రేవంత్​రెడ్డితో పాటు మొత్తం మంత్రివర్గం, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలను కూడా కలుపుకుని ప్రధాని మోదీని కలవాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిపైనా కేబినెట్‌‌‌‌‌‌‌‌లో చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ బడ్జెట్​సమావేశాలను మొదలుపెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది. 

పార్లమెంట్​సమావేశాలు ఈ నెల 10న మొదలవుతున్నందున.. అంతకంటే ముందే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించాలని యోచిస్తున్నది. లేదంటే పార్లమెంట్​సమావేశాల రోజే అసెంబ్లీ బడ్జెట్​సమావేశాలను మొదలుపెట్టే అవకాశాన్ని పరిశీలిస్తున్నది. ఆ తర్వాతి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టి, అనంతరం మరుసటి రోజు బీసీ రిజర్వేషన్ల బిల్లులకు ఆమోదం తెలిపి సభను ఒకట్రెండు రోజులు వాయిదా వేసి ఢిల్లీ వెళ్లాలని అనుకుంటున్నారు. 

రాజ్యాంగంలోని షెడ్యూల్​ 9లో తెలంగాణ బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని చేర్చాలని ప్రధానమంత్రిని కోరనున్నారు. ఇందులో లోక్‌‌‌‌‌‌‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్​గాంధీ కూడా భాగస్వామ్యం కానున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఈ నెల రెండో వారంలో బడ్జెట్‌‌‌‌‌‌‌‌ ప్రవేశపెట్టనున్నారు.