నస్పూర్, వెలుగు: పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితా రూపకల్పన ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి ఇతర ఎన్నికల అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, అర్డీఓలు, తహసీల్దార్లతో జాబితా రూపకల్పనపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ..
పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన కార్యచరణ విడుదల చేశామన్నారు. పట్టభద్రులు ఓటరు నమోదుకు నవంబర్ 6 ఆఖరి తేదీ అన్నారు. నవంబర్20వ తేదీ వరకు నమోదైన దరఖాస్తుల పరిశీలన, 23న ప్రచురణ, 23 నుంచి డిసెంబర్9వ వరకు ముసాయిదా జాబితాపై ఫిర్యాదులు, అభ్యంతరాలు స్వీకరణ, డిసెంబర్25న ఫిర్యాదులు, అభ్యంతరాల పరిశీలన ఉంటుందన్నారు.
30వ తేదీన తుది జాబితా ప్రచురించడం వెలువరిస్తామని పేర్కొన్నారు. మెదక్ , -నిజామాబాద్ ఆదిలాబాద్, -కరీంనగర్ నియోజకవర్గాలకు జరగనున్న పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హత గల ప్రతి ఒక్కరు తమ వివరాలు నమోదు చేసుకొని ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. వివరాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఆన్‌లైన్‌లో , తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.