- కోర్సులో చేరాక తండ్రి బిజినెస్ లాస్ తో సొంతూరికి స్టూడెంట్
- అడ్వాన్స్ తిరిగిచ్చేది లేదన్న ఇన్స్టిట్యూట్
- పూర్తిగా చెల్లించాల్సిందేనన్న డిస్ట్రిక్, స్టేట్ ఫోరం
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ కు చెందిన ఎఫ్ఐఐటీ, జేఈఈ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ కు స్టేట్ కన్జ్యూమర్ ఫోరం షాకిచ్చింది. స్టూడెంట్ కట్టిన రూ.1.09 లక్షల కోర్సు అడ్వాన్స్ ఫీజును తిరిగి చెల్లించాల్సిందిగా ఇన్ స్టిట్యూట్ ను ఆదేశించింది. మంచిర్యాల జిల్లాకు చెందిన విద్యార్థి నూక మోహన్ తన కుటుంబంలో కలిసి హైదరాబాద్ లో ఉండేవారు. ఆయన 2017, జనవరి 4న సైఫాబాద్ లోని ఎఫ్ఐఐటీ, జేఈఈ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ లో పినాకిల్ (మల్టీమీడియా) రెండేండ్ల కోర్సులో జాయిన్ అయ్యారు.
కోర్సు అడ్వాన్స్ ఫీజు కింద రూ.1.09 లక్షలు చెల్లించారు. మూడు నెలల తర్వాత ఆయన తండ్రికి బిజినెస్ లో నష్టం రావడంతో సొంత గ్రామానికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. అంతకు ముందు ఒక్కసారి కూడా కాలేజీకి వెళ్లలేదు. బుక్స్ కూడా తీసుకోలేదు. ఈ క్రమంలోనే తాను చెల్లించిన అడ్వాన్స్ ఫీజును తిరిగి ఇవ్వాల్సిందిగా మేనేజ్ మెంట్ ను కోరారు. కానీ, మేనేజ్ మెంట్ మాత్రం మోహన్ అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో ఆయన హైదరాబాద్ డిస్ట్రిక్ కన్జ్యూమర్ ఫోరం–3ని ఆశ్రయించారు.
కట్టిన ఫీజు డబ్బులను ఏడు శాతం వడ్డీతో చెల్లించాలని డిస్ట్రిక్ ఫోరం ఇన్ స్టిట్యూట్ ను ఆదేశించింది. ఈ క్రమంలోనే ఇన్ స్టిట్యూట్ స్టేట్ ఫోరంలో అప్పీల్ చేసుకుంది. స్టూడెంట్తల్లిదండ్రులు నియమ, నిబంధనలు చూశాకే అడ్మిషన్ తీసుకున్నారని వాదించింది. కోర్సు మధ్యలో వెళ్లిపోతే ఫీజు తిరిగివ్వడం కుదరదనే విషయం నియమ, నిబంధనల్లో క్లియర్ గా రాశారని తెలిపింది. కానీ, స్టేట్ కన్జ్యూమర్ ఫోరం మాత్రం డిస్ట్రిక్ ఫోరం ఇచ్చిన ఆదేశాలను సమర్థించింది. స్టూడెంట్ అడ్వాన్సుగా కట్టిన రూ.1.09 లక్షలను ఏడు శాతం వడ్డీతో చెల్లించాలని వెల్లడించింది. ఖర్చులకు మరో రూ.10 వేలు చెల్లించాలని ఆదేశించింది.