- ఒరియంట్ ఇన్సూరెన్స్ కంపెనీకి రాష్ట్ర వినియోగదారుల ఫోరం ఆదేశం
- తప్పుడు రిపోర్టులతో మాజీ పైలట్‌కు క్లెయిమ్ ఎగ్గొట్టే యత్నం
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఇండియన్ ఎయిర్ వేస్ పైలట్ కు ఇన్సూరెన్స్ డబ్బులు ఎగ్గొట్టాలని చూసిన ఒరియంట్ ఇన్సూరెన్స్ కంపెనీకి రాష్ట్ర వినియోగదారుల ఫోరం ఝలక్ ఇచ్చింది. బాధితుడికి రూ.1.72 కోట్లను క్లెయిమ్ తేదీ నుంచి ఇప్పటి వరకు 9 శాతం వడ్డీతో చెల్లించాలని ఫోరం ఆదేశించింది. అంతేకాకుండా ఖర్చుల కోసం రూ.25 వేలు ఇవ్వాలని, ఈ డబ్బులన్నీ 30 రోజుల్లోగా చెల్లించాలని స్పష్టం చేసింది. గడువు దాటితే 12 శాతం వడ్డీతో చెల్లించాల్సి ఉంటుందని తీర్పు ఇచ్చింది.
సికింద్రాబాద్ మారేడ్ పల్లికి చెందిన కెప్టెన్ జంగం రఘునాథ్ గౌడ్ 28 ఏండ్ల పాటు ఇండియన్ ఎయిర్వేస్లో పైలట్ గా పనిచేశాడు. బ్రసెల్స్ నుంచి ముంబైకి ఫ్లైట్ నడిపేవాడు. 20 వేల గంటలు ఫ్లైట్ నడిపిన అనుభవం ఆయనకు ఉంది. గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీకి సంబంధించి ఒరియంట్ ఇన్సూరెన్స్ కంపెనీకి జెట్ ఎయిర్ వేస్ ప్రతినెలా ప్రీమియం కడుతోంది. పైలట్ అన్ఫిట్అయినప్పుడు రూ కోటి 15 లక్షలు క్లెయిమ్ చేసుకోవచ్చు. మొదటి పాలసీ 2009లో ప్రారంభించగా.. రఘునాథ్ గౌడ్ 2013 లో రూ. కోటి15 లక్షల విలువైన టాపప్ తీసుకున్నాడు.
2016లో ఆరోగ్య సమస్యలతో పైలట్ గా అన్ ఫిట్ అయ్యాక క్లెయిమ్ కోసం అప్లై చేశాడు. ఆయనకు వాస్తవానికి ఇన్సూరెన్స్ కంపెనీ రూ.2.30 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. వివిధ కారణాలు చూపుతూ రూ.57.50 లక్షలు మాత్రమే ఇచ్చారు. ఇదేంటని అడగ్గా... మొదటి పాలసీలో జెట్ ఎయిర్వేస్ పూర్తి ప్రీమియం కట్టలేదని, రెండో పాలసీలో పాలసీ హోల్డర్‌కు షుగర్ సోకడం వల్ల పాలసీ నిబంధనల ప్రకారం రిజెక్ట్ అయ్యిందని సిబ్బంది సమాధానం ఇచ్చారు. దీంతో రఘునాథ్ గౌడ్..స్టేట్ కన్జ్యూమర్ ఫోరమ్ ను ఆశ్రయించాడు.
పాలసీ క్లెయిమ్ రిజెక్ట్ చేయడానికి కారణాల గురించి అడగ్గా కంపెనీ ప్రతినిధులు పాత విషయమే చెప్పారు. డాక్టర్ తో తప్పుడు రిపోర్ట్ తయారు చేయించి ఫోరంకు సమర్పించారు. దీంతో రఘునాథ్‌గౌడ్ టాపప్ తీసుకునే టైంలో తన వద్ద ఉన్న నెగెటివ్ రిజల్ట్ రిపోర్టును, బ్యాంక్ అకౌంట్ నుంచి కట్అయిన ప్రీమియం డిటెయిల్స్‌ను సమర్పించాడు. డబ్బులు ఎగ్గొట్టాలనే ఉద్దేశంతోనే ఇన్సూరెన్స్ కంపెనీ తప్పుడు సాక్షాలు సృష్టించిందని ఫోరం గుర్తించింది.