- మృతుడి భార్యకు పరిహారం చెల్లించాల్సిందే
- ఇన్సూరెన్స్ కంపెనీకి రాష్ట్ర వినియోగదారుల ఫోరం ఆదేశం
- జిల్లా కన్య్జూమర్ ఫోరం తీర్పు కరెక్టేనని వెల్లడి
హైదరాబాద్ సిటీ, వెలుగు: సరైన కారణాలు లేకున్నా ఇన్సూరెన్స్ క్లెయిమ్ డబ్బులు చెల్లించకుండా తప్పించుకోవాలని చూసిన భారతి ఆక్సా ఇన్సూరెన్స్ కంపెనీకి రాష్ట్ర కన్జ్యూమర్ ఫోరమ్ మొట్టికాయలు వేసింది. జిల్లా కన్జ్యూమర్ ఫోరమ్ ఆదేశాలను సమర్థిస్తూ నామినీకి రూ.లక్ష చెల్లించాల్సిందిగా తీర్పు ఇచ్చింది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పాశపు గంగాధర్.. ప్రైమరీ అగ్రికల్చర్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ లో ఖాతాదారుడు. కొంత ప్రీమియం చెల్లించి భారతీ ఆక్సా ఇన్సూరెన్స్ కంపెనీ తరపున వ్యక్తిగత ప్రమాద బీమా గ్రూప్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు.
గంగాధర్ 2012 ఏప్రిల్ 30న బైక్ పై వెళుతూ కిందపడి గాయపడ్డాడు. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ అదే ఏడాది మే 1న మరణించాడు. గంగాధర్ భార్య ఇందిర నామినీ కావడంతో ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ప్రైమరీ అగ్రికల్చర్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ లో దరఖాస్తు చేసుకుంది. సొసైటీ సంబంధిత బ్యాంకు అయిన ఆదిలాబాద్ జిల్లా కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ కు పంపగా అక్కడి నుంచి ఫైల్.. భారతి ఆక్సా ఇన్సూరెన్స్ కంపెనీకి చేరుకుంది. అయితే.. సదరు కంపెనీ స్పందించలేదు.
దీంతో ఇందిర.. ఆదిలాబాద్ డిస్ట్రక్ట్ కన్జ్యూమర్ ఫోరమ్ ను సంప్రదించగా... గంగాధర్ చనిపోయిన మూడు నెలల తర్వాత ఎఫ్ఆర్ఐ ఫైల్ చేయడం వలన క్లెయిమ్ ఇవ్వడం జరగదని ఇన్సూరెన్స్ కంపెనీ రిప్లై ఇచ్చింది. క్లెయిమ్ డబ్బులు చెల్లించడానికి, ఎఫ్ఆర్ఐ ఆలస్యమవడానికి సంబంధం లేదని, నామినీకి క్లెయిమ్ డబ్బులు చెల్లించాలని జిల్లా వినియోగదారుల ఫోరం ఆదేశాలు జారీ చేసింది. దీంతో సదరు కంపెనీ... స్టేట్ కన్జ్యూమర్ ఫోరమ్ లో అప్పీల్ చేసింది.
అక్కడ కూడా అదే ఫలితం వచ్చింది. కంపెనీ అప్పీల్ ను ఫోరం తిప్పికొట్టింది. ఆధారాలను పరిశీలించిన స్టేట్ కన్జ్యూమర్ ఫోరమ్.. జిల్లా వినియోగదారుల ఫోరం ఇచ్చిన తీర్పు సరైనదని స్పష్టం చేసింది. నామినీకి లక్ష రూపాయలతో పాటు 9 శాతం వార్షిక వడ్డీని జోడించి, ఖర్చులకు 1000 రూపాయలు ఇవ్వాలని ఆదేశించింది.