
- చిన్నారులను అశ్లీలంగా చిత్రీకరిస్తే పట్టేస్తున్నారు
- అసభ్యకరమైన కామెంట్స్, కంటెంట్ల గుర్తింపు
- గత రెండు నెల్లలోనే 71 ఎఫ్‌ఐఆర్‌లు, 47 మంది అరెస్ట్
- వెబ్ పెట్రోలింగ్‌తో దేశవ్యాప్తంగా 7,247 అనుమానితుల ట్రేస్
హైదరాబాద్,వెలుగు: ఆన్‌లైన్‌లో చిన్నారులతో అసభ్యకరంగా ప్రవరిస్తున్న వారిపై రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) నిఘా పెట్టింది. చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ద్వారా కేసులు నమోదు చేస్తున్నది. ఈ ఏడాది గత రెండు నెలల్లో ఇలాంటి వేధింపులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 71 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది. మొత్తం 47 మందిని అరెస్టు చేసింది. ఈ విషయాన్ని టీజీసీఎస్‌బీ డైరెక్టర్ శిఖా గోయల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతేడాది డార్క్ వెబ్, ఇతర వెబ్‌సైట్లలో వెబ్ పెట్రోలింగ్ ద్వారా 7,247 మంది అనుమానితుల జాడ గుర్తించామని, మొత్తం 30 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని ఆమె తెలిపారు.
ఆన్‌లైన్‌లో చిన్నారుల చిత్రాలను అశ్లీలంగా పోస్ట్ చేయడం, డిజిటల్ కంటెంట్ మొదలైన నేరాలపైనా దృష్టి పెడుతున్నామని వెల్లడించారు. పిల్లలపై వేధింపులు లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలను ప్రోత్సహించే ఏదైనా కంటెంట్ లేదా ఖాతాలను గుర్తిస్తే వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో లేదా ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని సూచించారు. 1930 కు కాల్ చేసి కూడా ఫిర్యాదు చేయవచ్చని పేర్కొ న్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల ఆన్‌లైన్ కార్యకలాపాలను పర్యవేక్షించాలని, ఇంటర్ నెట్ భద్రతపై వారికి అవగాహన కల్పించాలని సూచించారు.