
- ఈ ఏడాది ఎఫ్ఆర్బీఎంపరిధిలో రూ.69,639 కోట్లు
- గత సర్కార్ అప్పులకు ఈసారివడ్డీలు రూ. 19,369 కోట్లు
- కిస్తీలకు మరో రూ.47 వేల కోట్లు చెల్లించాల్సిందే
హైదరాబాద్, వెలుగు :రాష్ట్ర అప్పులు 2026 మార్చి నాటికి రూ.7.46 లక్షల కోట్లకు చేరనున్నాయి. ఇందులో గత పదేండ్ల అప్పులతో పాటు ఏడాదిన్నరనుంచి ప్రభుత్వం చేసినవి కూడా ఉన్నాయి. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.69,639 కోట్ల మేర అప్పులు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మొత్తం కూడా ఎఫ్ఆర్బీఎం పరిధిలోనే తీసుకోనున్నది. దీంతో ఎఫ్ఆర్బీఎం పరిధిలో ఉన్న అప్పుల మొత్తం రూ.5.04 లక్షల కోట్లకు చేరుతుంది. జీఎస్డీపీలో ఈ మొత్తం 28.1 శాతం. గత 14 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ అప్పులను చేయలేదు. అయితే, గత బీఆర్ఎస్ ప్రభుత్వ గ్యారంటీ కింద వివిధ కార్పొరేషన్లు, ఇనిస్టిట్యూషన్ల (స్పెషల్ పర్పస్ వెహికల్స్) కింద తీసుకున్న అప్పులు రూ. 2 లక్షల 41 వేల 528 కోట్లుగా ఉన్నది. వీటన్నింటికి అంటే కిస్తీ, వడ్డీలకు కలిపి యావరేజ్‌గా నెలకు రూ.5,500 కోట్లు చెల్లింపులు చేయాల్సి ఉంటుంది.
2014–15 ఆర్థిక సంవత్సరంలో రూ.605 కోట్లతో మొదలైన ఈ కిస్తీలు, వడ్డీల చెల్లింపులు.. 2024–25 నాటికి రూ.60 వేల కోట్లు దాటాయి. ఇందులో బడ్జెట్‌నుంచి చెల్లించిన వాటితోపాటు ఔట్‌సైడ్ బడ్జెట్ నుంచి చేసిన చెల్లింపులు కూడా ఉన్నాయి. రాష్ట్ర ఆదాయంలో సింహభాగం అంటే 35 శాతం అప్పుల చెల్లింపులకే పోతున్నాయి. ఇక గత ప్రభుత్వం పదేండ్లలో చేసిన విపరీతమైన అప్పులతో కొత్త గా ఏర్పాటైన సర్కార్ కూడా అప్పులను చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బడ్జెట్ లో దాదాపు రూ.69 వేల కోట్ల మేర అప్పులు తీసుకోనున్నట్టు ప్రభుత్వం పేర్కొన్నది. ఇవన్నీ ఎఫ్ఆర్బీఎం పరిధిలో ఆర్ బీఐ నుంచి తీసుకుంటున్న రుణాలే. ఇదిలా ఉంటే గత సర్కార్ చేసిన అప్పుల్లో భాగంగా రానున్న ఆర్థిక సంవత్సరంలో భారీగానే చెల్లింపులు చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. వడ్డీలకు రూ.19,369 కోట్లు, కిస్తీలకు రూ.47 వేల కోట్ల మేర చెల్లించాల్సి ఉన్నది.
రాష్ట్రం మీద రుణభారం ఎఫ్ఆర్బీఎం పరిధిలో (కోట్ల రూ.లలో)
సంవత్సరం అప్పు
2014-15 83,845
2015-16 93,115
2016-17 1,29,531
2017-18 1,52,190
2018-19 1,75,281
2019-20 2,05,858
2020-21 2,44,019
2021-22 3,21,612
2022-23 3,56,486
2023-24 4,03,664
2024-25 4,51,203
2025-26 5,04,814
(అంచనా)