- మళ్లా అప్పులే దిక్కు... మూడు నెలల్లో రూ.8,578 కోట్లు
- ఆర్బీఐకి రాష్ట్ర సర్కార్ ఇండెంట్
- పాత లోన్ల వడ్డీలు, కిస్తీలకు ప్రతి నెలా రూ.4 వేల కోట్ల
- చెల్లింపులు వచ్చే ఏడాది మార్చి వరకు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఆమ్దానీ మస్తు పెరుగుతున్నట్లు సర్కారు చెప్తున్నప్పటికీ.. స్కీమ్‌లు అమలు చేయాలన్నా, బిల్లులు చెల్లించాలన్నా, నెలనెలా జీతాలు ఇయ్యాలన్నా, చివరికి పాత అప్పులకు వడ్డీలు కట్టాలన్నా మళ్లా అప్పులే చేయాల్సి వస్తున్నది. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు మూడు నెలల్లో... రూ. 8,578 కోట్ల అప్పు కావాలని రిజర్వు బ్యాంక్‌ను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. నెలల వారీగా ఎంతెంత అప్పు కావాలనే ఇండెంట్ ను ఇటీవలే ఆర్బీఐకి సమర్పించింది. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు రెండు వారాలకోసారి రిజర్వు బ్యాంక్ నిర్వహించే బాండ్ల వేలం ద్వారా ఈ కొత్త అప్పు తెచ్చుకోనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ నుంచి రూ. 19,500 కోట్ల అప్పు తీసుకుంది. కొత్తగా తీసుకుంటున్న అప్పుతో.. ఇది రూ. 28 వేల కోట్లు దాటనుంది.
దివాలా తీసిన ఆర్థిక పరిస్థితి
ఎనిమిదేండ్లుగా ఇష్టమొచ్చినట్లు అప్పులు చేయటంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీసింది. బడ్జెట్లో పెట్టిన అప్పులతో పాటు, కార్పొరేషన్ల పేరిట ప్రభుత్వం లెక్కలేనట్లుగా తెచ్చిన అప్పులన్నీ ఖజానాపై కోలుకోలేనంత భారాన్ని మోపాయి. అందుకే, ఈ ఏడాది మొదట్లోనే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అప్పులను కట్టడి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్లో పెట్టిన రూ. 53 వేల కోట్ల అప్పులో రూ. 8,814 కోట్ల మేరకు కేంద్రం కోత వేసింది. పరిమితి మేరకే అప్పులు తీసుకుంటున్నట్టు రాష్ట్ర సర్కార్ చెప్తున్నప్పటికీ.. ఈ ఏడాది కూడా పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేయకపోవటం ఆందోళనకరంగా మారింది.
ఇప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులకు నెలనెలా ఒకటో తా రీఖున జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఎఫ్ఆర్బీఎం పరిమితి మేరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ. 45 వేల కోట్ల మేరకు అప్పు తీసుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. పాత అప్పులకు వడ్డీలు చెల్లించేందుకే కొత్త అప్పులన్నీ సరిపోతాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఇప్పటికే కాళేశ్వరం, మిషన్ భగీరథ కార్పొరేషన్ల పేరిట తెచ్చిన అప్పులు కట్టేందుకు ఇతర విభాగాల నుంచి నిధులు మళ్లించే పరిస్థితి తలెత్తింది.
ఆదాయం పెరిగినా.. అప్పులే
గతంతో పోలిస్తే ఆదాయం పెరిగినప్పటికీ.. అప్పులు తీసుకుంటే తప్ప నెలనెలా గడవని గండం ఇప్పటికీ వెంటాడుతున్నది. జీఎస్టీ ద్వారా వచ్చే పన్నులతో పాటు పెట్రోల్, డీజిల్, ఎక్సైజ్ వాటాతో గడిచిన ఆరు నెలల్లో రాష్ట్ర ఆదాయం భారీగా పెరిగింది. ఆరు నెలల్లో దాదాపు రూ. 62 వేల కోట్ల రాబడి సాధించినట్లు నెలనెలా రాష్ట్ర ఆర్థిక శాఖ కాగ్‌కు సమర్పించే నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇంత ఆదాయం ఉన్నప్పటికీ.. కొత్తగా అప్పులకు పోటీ పడుతుండటం ఆర్థిక నిర్వహణ తీరును వేలెత్తి చూపిస్తున్నది. రైతు బంధు మినహా ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీమ్‌లన్నింటినీ నిధుల కొరత వెంటాడుతున్నది.
వడ్డీలకు తడిసి మోపెడు
పాత అప్పుల కిస్తీలు, వాటి వడ్డీలకు నెలనెలా చెల్లింపులు పెరిగిపోతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో వడ్డీలకే దాదాపు రూ.19 వేల కోట్లు రాష్ట్ర సర్కార్కట్టాల్సి ఉన్నది. ఇందుకోసం ప్రతినెలా యావరేజ్‌గా రూ. 1,583 కోట్లు బడ్జెట్ నుంచి కడుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ నాటికి రూ. 9,500 కోట్లు కట్టారు. ఇవి కాకుండా పాత అప్పుల కిస్తీలు తడిసి మోపెడవుతున్నాయ. కిస్తీలకు మినిమమ్ నెలకు రూ. 2 వేల కోట్ల నుంచి 3 వేల కోట్లు కడుతున్నారు. దీంతో ప్రతినెలా దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు కిస్తీలు, వాటి వడ్డీలకే పోతున్నాయి. రాష్ట్ర సర్కార్ అప్పులు వచ్చే ఏడాది మార్చి నాటికి మొత్తం రూ. 5 లక్షల కోట్లకు చేరువకానుంది. బడ్జెట్లో చూపే అప్పులు రూ. 3.36 లక్షల కోట్లు అవుతుండగా, దానికి సంబంధం లేకుండా చేసిన అప్పులు ఇంకో రూ.1.46 లక్షల కోట్లుగా ఉంది.
ఆర్బీఐ నుంచి రాష్ట్ర సర్కార్ తీసుకోనున్న అప్పులు
అక్టోబర్‌లో 3,500 కోట్లు
నవంబర్‌లో 3,000 కోట్లు
డిసెంబర్లో 2,078 కోట్లు