ఇందిరా మహిళా డెయిరీ సక్సెస్​ సాధించాలి

ఇందిరా మహిళా డెయిరీ సక్సెస్​ సాధించాలి
  •  ప్రతి సభ్యురాలికి సబ్సిడీపై 2 పాడి పశువులు పంపిణీ చేస్తాం
  •  డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
  •  ఇందిరా మహిళా డెయిరీ లోగో ఆవిష్కరణ 

మధిర/ఎర్రుపాలెం, వెలుగు : దేశం మధిర వైపు చూసేలా ఇందిరా మహిళా డెయిరీ విజయం సాధించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం రూ.26 కోట్లతో  సిరిపురం నుంచి నెమలి వరకు చేపట్టిన రోడ్డు విస్తరణ, రిపేర్​ పనులతోపాటు బోనకల్, ఎర్రుపాలెం మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలు చేశారు. మధిర మండలంలో సీసీఐ కేంద్రాన్ని ప్రారంభించారు. సిరిపురం ప్రభుత్వ కళాశాలను సందర్శించారు. 

 ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని రెడ్డి గార్డెన్స్ లో ఇందిరా డెయిరీ లోగో ఆవిష్కరించి మహిళా సంఘాల సభ్యులతో మాట్లాడారు. మధిర అసెంబ్లీ సెగ్మెంట్ మహిళల చేత పాల వ్యాపారం చేయించేందుకు 2011లో రూపకల్పన చేసుకున్న ఇందిరా మహిళా డెయిరీ ఆకాంక్ష నేడు నెరవేరుతుందన్నారు. వ్యవసాయ ఆదాయానికి తోడు పాడి రైతుల ఆదాయం జత చేస్తే కుటుంబాలు మరింత నిలదొక్కుకుంటాయనే ఆలోచనతో ఇందిరా మహిళా డెయిరీని రూపకల్పన చేసినట్లు తెలిపారు. 

ఇందిరా మహిళా డెయిరీ కోసం 9.5 ఎకరాల స్థలం సేకరించి భూమి పూజ కూడా చేశామని చెప్పారు. 20 వేల మహిళలు డెయిరీలో సభ్యులుగా ఉన్నారని, వీరికి ఒక్కొక్కరికీ రెండు పాడి పశువుల చొప్పున అందిస్తామని, దీని ద్వారా రోజూ దాదాపు 2.40 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతాయని,  నెలకు రూ.25 కోట్లకు పైగా మహిళలు సంపాదించే అవకాశం ఉందని చెప్పారు. పాలు మాత్రమే కాకుండా మజ్జిగ, నెయ్యి, వెన్న, స్వీట్స్ అమ్మకాలు కలిపితే సంవత్సరానికి ఇందిరా మహిళా డెయిరీ టర్నోవర్ రూ.500 కోట్లు దాటుతుందన్నారు. ఇల్లు లేని నిరుపేదలకు గ్రామ సభలు నిర్వహించి ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇండ్లు మొదటి దశలో నిర్మించనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కలెక్టర్  ముజామ్మిల్ ఖాన్, అడిషనల్​ కలెక్టర్ డాక్టర్​ పి. శ్రీజ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర్ రావు, డీఆర్డీవో సన్యాసయ్య, జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి డాక్టర్​ వేణు మనోహర్, ఇందిరా మహిళా డెయిరీ చైర్మన్ అన్నపూర్ణ, మహిళా సంఘాల సభ్యులు, 
ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.