హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ఈనెల 31న రిటైర్ కానున్నారు. దీంతో కొత్త డీజీపీ ఎవరనే చర్చ డిపార్ట్‌మెంట్‌లో జోరుగా సాగుతోంది. ప్రస్తుతం ఏసీబీ డీజీగా ఉన్న అంజనీ కుమార్ (1990), హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్(1991) డీజీపీ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరిలో ఎవరైనా ఒకరు డీజీపీగా నియమితులయ్యే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వారితో పాటు యూపీఎస్సీ నిబంధనల ప్రకారం సీనియారిటీ విధానంలో ఉమేశ్ షరాఫ్ (1989), రవి గుప్తా (1990), రాజీవ్ రతన్ (1991), ప్రస్తుత అడిషనల్ డీజీ జితేందర్ (1992) పేర్లతో యూపీఎస్సీకి లిస్ట్ పంపనున్నట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్యానెల్‌లో ముగ్గురి పేర్లను మాత్రమే సెలెక్షన్ కమిటీ సూచిస్తుంది. ముగ్గురిలో ఎవరిని డీజీపీగా నియమించాలో ప్రభుత్వం నిర్ణయిస్తుంది.
డీజీ, అడిషనల్ డీజీ ర్యాంక్స్ మధ్యే పోటీ
కమిటీ ఫైనల్ చేసిన వారిలో అర్హులైన ఒకరిని రాష్ట్ర ప్రభుత్వం డీజీపీగా నియమిస్తుంది. ప్రస్తుతం 1989 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఉమేశ్ షరాఫ్ సీనియర్ అధికారిగా ఉన్నారు. ఆయన వచ్చే ఏడాది జూన్‌లో పదవీ విరమణ చేయనున్నారు.1990 బ్యాచ్‌కు చెందిన గోవింద్‌సింగ్ సీఐడీ డీజీగా పనిచేసి గత నెల 30న పదవీ విరమణ చేశారు. ఇదే బ్యాచ్‌కు చెందిన రవి గుప్తా ప్రస్తుతం హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు.
అంజనీ కుమార్ ఏసీబీ డీజీగా డీజీపీ ర్యాంకులో ఉన్నారు. వారిలో అంజనీ కుమార్ రేసులో ముందున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే 1991 బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్, రాజీవ్ రతన్ ప్రస్తుతం అడిషనల్ డీజీ హోదాలో కొనసాగుతున్నారు. వారితో పాటు 1992 బ్యాచ్‌కు చెందిన జితేందర్ కూడా డీజీపీ రేస్‌లో ఉన్నారు. ఆయన ప్రస్తుతం లా అండ్ అర్డర్ డీజీగా పనిచేస్తున్నారు.
హైదరాబాద్ సీపీగా చేసిన వారు డీజీపీలుగా
ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ సీపీగా పనిచేసిన ఐపీఎస్ అధికారులు ఏసీబీ డీజీగా, ఆర్టీసీ ఎండీ, ఇంటెలిజెన్స్ చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత డీజీపీగా నియమితులయ్యారు. రాష్ట్రం ఏర్పడ్డాక మొదటి డీజీపీగా అనురాగ్ శర్మ, ఆయన తర్వాత మహేందర్ రెడ్డి డీజీపీగా వ్యవహరించారు. ఈ ఇద్దరూ హైదరాబాద్ సీపీగా పనిచేసిన వారే. ఈ క్రమంలోనే అంజనీ కుమార్ లా అండ్ ఆర్డర్ డీజీగా, హైదరాబాద్ సీపీగా పనిచేశారు. ప్రస్తుతం డీజీ హోదాలో ఏసీబీ చీఫ్‌గా ఆయన కొనసాగుతున్నారు. ఐతే అంజనీ కుమార్ ఇప్పటికే డీజీ స్థాయిలో ఉండగా, సీవీ ఆనంద్ అడిషనల్ డీజీ స్థాయిలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
వారితో పాటు రాజీవ్ రతన్ కూడా అడిషనల్ డీజీ హోదాలో కొనసాగుతున్నారు. అయితే యూపీఎస్సీకి పంపే లిస్ట్ నుంచి ముగ్గురి పేర్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి చేరతాయి. వారిలో ఒకరిని ప్రభుత్వం డీజీపీ పదవికి ఎంపిక చేస్తుంది. ఆ ముగ్గురిలో రాజీవ్ రతన్ మినహా అంజనీ కుమార్, ఆనంద్ మధ్యే ఎక్కువ పోటీ ఉన్నట్లు సమాచారం. అయితే రూల్స్ ఎలా ఉన్నా సీఎం కేసీఆర్ నిర్ణయమే ఫైనల్ అవుతుందని డిపార్ట్‌మెంట్‌లో చర్చ జరుగుతోంది. మరోవైపు సీఐడీ డీజీ గోవింద్ సింగ్ ఇటీవల రిటైర్ అయ్యారు. ఆయన స్థానంలో కూడా కొత్త డీజీని నియమించాల్సి ఉంది.