కేజీ టు పీజీ ఉచిత విద్యను అందిస్తున్నాం

హైదరాబాద్: కేజీ టు పీజీ ఉచిత విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శంషాబాద్ మండలం పాలమాకుల గ్రామంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో రూ. కోటి 35 లక్షల నిధులతో నిర్మించిన  అదనపు గదులను, వసతి గృహాన్ని మంత్రి సబిత ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ విద్యా రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పెద్ద ఎత్తున గురుకులాలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రం ఏర్పడక ముందు రాష్ట్రవ్యాప్తంగా 400 కాలేజీలు ఉండేవని, కానీ కేసీఆర్ సీఎం అయ్యాక ఈ ఎనిమిదేండ్లలో 1150  గురుకులాలను కాలేజీలుగా మార్చామని పేర్కొన్నారు. అందులో  5 పీజీ, 80 డిగ్రీ, 2 లా కాలేజీలు ఉన్నాయన్న మంత్రి... మొత్తం 53 డిగ్రీ కాలేజీలు కేవలం అమ్మాయిల కోసమే ఏర్పాటు చేశామని వెల్లడించారు. 

దీంతో పాటు విదేశాలలో చదువుకోవడానికి ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద రూ. 20 లక్షలు ఇస్తున్నామని చెప్పారు. గురుకుల్లాలో చదువుకుంటున్న ప్రతి విద్యార్థిపై ఏడాదికి లక్షా 25 వేల రూపాయలు ఖర్చు పెడుతున్నామని తెలిపారు. గురుకులాల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నాణ్యమైన విద్యతోపాటు భోజన వసతులు కూడా ఏర్పాటు చేశామన్నారు. అయితే అప్పుడప్పుడు కొన్ని ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగడం దురదృష్టకరమని, గురుకులాలు, హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సబిత స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వాణీ దేవి, జడ్పీ చైర్మన్ తీగల అనిత హరినాధ్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.