హైదరాబాద్, వెలుగు:
మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేది ఈవీఎంలతోనా? బ్యాలెట్ పేపర్లతోనా అనేది ఇంకా తేలలేదు. ఇప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికలన్నీ బ్యాలెట్ పేపర్‌తోనే నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ బ్యాలెట్ పేపర్లే వాడారు. రాష్ట్రవ్యాప్తంగా పది కార్పొరేషన్లు, 121 మున్సిపాల్టీల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. 3,128 వార్డుల్లో పోలింగ్ జరగనుంది. వీటి పరిధిలో 80.50 లక్షల మంది ఓటర్లు ఉన్నట్టు అంచనా. రాష్ట్రవ్యాప్తంగా ఒకే విడతలో పోలింగ్ నిర్వహించేందుకు స్టేట్ ఎలక్షన్ కమిషన్(ఎస్‌ఈసీ) సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో పోలింగ్ ఎలా నిర్వహించాలనే విషయమై చర్చ సాగుతోంది.
బ్యాలెట్ తెలుపు రంగులోనే..
మున్సిపల్ ఎన్నికల్లో వార్డు కౌన్సిలర్, డివిజన్ కార్పొరేటర్‌ను మాత్రమే ప్రజలు నేరుగా ఎన్నుకుంటారు. చైర్మన్, మేయర్ పదవులకు ఇన్‌డైరెక్ట్ ఎలక్షన్ ఉంటుంది. ఎస్‌ఈసీ నిర్వహించే పంచాయతీ, జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో ఓటర్లు ఏకకాలంలో రెండేసి ఓట్లు వేస్తారు. మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం ఒకే ఓటు వేసే అవకాశముంటుంది. మున్సిపల్ ఎన్నికల్లో ఈవీఎంలపై పెట్టినా, బ్యాలెట్ వాడినా బ్యాలెట్ పేపర్ తెలుపు రంగులో ఉండాలనే విషయమై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల కలెక్టర్లతో ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో గుర్తులు ఫైనల్ కాగానే బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్‌కు సిద్ధంగా ఉండాలంటూ ఆదేశాలు ఇచ్చారు.
పోలింగ్‌స్టేషన్లపై మళ్లీ సర్వే
కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో వార్డులవారీగా పోలింగ్ స్టేషన్ల గుర్తింపు ప్రక్రియను మళ్లీ మొదలు పెట్టాలని ఇటీవల ఎలక్షన్ అథారిటీలుగా ఉన్న కమిషనర్లకు ఎస్‌ఈసీ ఆదేశాలు ఇచ్చింది. మీర్‌పేట కార్పొరేషన్‌ను మినహాయించి 121 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో 8,056 పోలింగ్ స్టేషన్లు అవసరమని ఇప్పటికే లెక్కకట్టారు. వాటి పరిధిలో 3,103 వార్డులుండగా, ఎన్నికలు నిర్వహించబోయే మీర్‌పేట కార్పొరేషన్‌లో 25 డివిజన్లు ఉన్నాయి. ఇప్పటికే గుర్తించిన మున్సిపాలిటీల్లో పాత పోలింగ్ స్టేషన్లకు అదనంగా ఎక్కడైనా పోలింగ్ స్టేషన్ అవసరమా అని మరోసారి సర్వే చేస్తారు.
ఈవీఎంల వైపే మొగ్గు
ఈవీఎంల ద్వారా ఓటింగ్ నిర్వహించే పక్షంలో ప్రతి 1,200 మంది ఓటర్లకు ఒక పోలింగ్ స్టేషన్, బ్యాలెట్ బాక్సులు ఉపయోగిస్తే 800 మంది ఓటర్లకు ఒక పోలింగ్ స్టేషన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఈసీ కమిషనర్లకు సూచించింది. కొన్ని వార్డుల్లో ఓటర్ల సంఖ్య 800కు మించి ఉంది. వారి కోసం ప్రత్యేకంగా పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేసే అవకాశం లేకపోవడంతో వెయ్యి, అంతకు మించి ఓటర్ల సంఖ్య ఉంటే ఒకే పోలింగ్ స్టేషన్‌తో సరిపెట్టనున్నారు. మరికొన్ని మున్సిపాలిటీల్లో ఒక్కో వార్డులో ఓటర్ల సంఖ్య 500లోపే ఉంది. కార్పొరేషన్లలోనే ఎక్కువ సంఖ్యలో పోలింగ్ స్టేషన్లు అవసరమని అధికారులు లెక్కగట్టారు. వాటికి అనుగుణంగా బ్యాలెట్ బాక్సులు, ఈవీఎంలు రాష్ట్రంలోనే అందుబాటులో ఉన్నాయి. ఈ వారంలోనే ఎన్నికలు ఎలా నిర్వహించేది ఈసీ తేల్చనున్నట్టు సమాచారం. ఈవీఎంలతో పోలింగ్ నిర్వహణ ఈజీగా ఉంటుందని, ఓట్ల లెక్కింపు సులువుగా పూర్తవుతుందని వాటి వైపు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ఈవీఎంలపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, ఒక అవకాశంగానే పరిశీలిస్తున్నామని ఓ అధికారి తెలిపారు.