- గుట్టలను మింగుతున్న క్రషర్లు, క్వారీలు
- రియల్ వెంచర్లుగా మారుతున్న బంజరు భూములు
- వాటితోపాటే అంతరిస్తున్న రాష్ట్ర పువ్వు
- శాతవాహన వర్సిటీ బోటనీ స్టూడెంట్ల రీసెర్చ్‌లో వెల్లడి
కరీంనగర్, వెలుగు:ఎన్కట గుట్టలు, చెరువు గట్లు, బీడు భూముల్లో ఎటుచూసినా గుత్తులుగుత్తులుగా పసుపు పచ్చని పూలతో తంగేడు చెట్లు కనిపించేవి. కానీ ఇప్పుడు గ్రానైట్ క్వారీల కోసం యథేచ్ఛగా గుట్టలను తవ్వేయడం, పట్టణీకరణ కారణంగా బీడుభూములు ప్లాట్లుగా మారుతుండడంతో తంగేడు చెట్లు రాష్ట్రంలో కనుమరుగు అవుతున్నాయి. శాతవాహన యూనివర్సిటీ బోటనీ విభాగం ఆధ్వర్యంలో ప్రొఫెసర్లు, స్టూడెంట్లు ఇటీవల చేసిన రీసెర్చ్‌లో ఈ విషయం వెల్లడైంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే కొన్నేండ్లలో రాష్ట్ర పువ్వు తంగేడును పుస్తకాలు, ఫొటోల్లోనే చూసుకుని మురవాల్సి వస్తుందని ప్రొఫెసర్లు హెచ్చరిస్తున్నారు.
వేగంగా అంతరిస్తున్నయ్
శాతవాహన వర్సిటీ బోటనీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్లు, స్టూడెంట్లు రాష్ట్రంలో తంగేడు వనాలపై 2013 నుంచి రీసెర్చ్ చేస్తున్నారు. తంగేడు చెట్ల ప్రత్యేకతలు, దానిలోని ఔషధ గుణాలపై స్టడీ చేసే క్రమంలో తంగేడు వనాల సంఖ్య వేగంగా తగ్గిపోతున్నట్లు గుర్తించారు. గడిచిన తొమ్మిదేండ్లలో నాలుగో వంతుకుపైగా వనాలు అంతరించినట్లు చెబుతున్నారు. వీళ్ల స్టడీలో ఇంకో ఆసక్తికర అంశం బయటపడింది. బతుకమ్మలో ఒక వరుసైనా తంగేడు పువ్వు పేర్చాలనే సంప్రదాయం ఉందని, కానీ ఇటీవల చాలామంది రోడ్ల పక్కన పెరిగే హైబ్రీడ్ తంగేడు పూలను బతుకమ్మలో వాడుతున్నట్లు గుర్తించినట్లు పరిశోధనా పత్రాల్లో వెల్లడైంది. సర్కారు తంగేడు వనాలను కాపాడకపోతే ఈ హైబ్రీడ్ తంగేడు చెట్లనే నిజమైనవని అనుకునే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. హరితహారం, పల్లె ప్రకృతి వనాల్లో తంగేడు వనాలు పెంచితే కొంతైనా వీటిని కాపాడుకోగలమని సూచిస్తున్నారు.
గుట్టలు తవ్వేస్తున్నరు
తంగేడు వనాలు గుట్టలు, వాటిని ఆనుకుని ఉండే చెల్క భూముల్లో పెరుగుతాయి. కానీ రాష్ట్రంలో గ్రానైట్, క్రషర్ క్వారీల కోసం గుట్టలు ధ్వంసం చేస్తున్నారు. తంగేడు వనాలు ఎక్కువగా ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, మెదక్, రంగారెడ్డిలాంటి జిల్లాల్లో ఉండేవి. ఒక్క కరీంనగర్ జిల్లాలోనే ప్రస్తుతం 308 గుట్టలకు గ్రానైట్ క్వారీలు నడుస్తున్నాయి. ఇందులో సగానికిపైగా గుట్టలు నేలమట్టమయ్యాయి. వరంగల్ అర్బన్ జిల్లాలో 93, వరంగల్ రూరల్ జిల్లాలో 101 గుట్టలను క్వారీల పేర ధ్వంసం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 25, సిద్దిపేట జిల్లాలో 21, సంగారెడ్డి జిల్లాలో 26, ఖమ్మం జిల్లాలో 23 గుట్టలపై క్వారీలు నడుస్తున్నాయి. ఆయా చోట్ల తంగేడు వనాలు కనుమరుగయ్యాయి.
పట్టణీకరణ కూడా కారణమే
మరోవైపు రాష్ట్రంలో పట్టణ జనాభా అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం తెలంగాణలో 40% జనాభా పట్టణాల్లోనే ఉంటోంది. సర్కారు కూడా పంచాయతీలను పట్టణాలుగా మార్చే కార్యక్రమాన్ని వేగవంతం చేస్తోంది. ఈ క్రమంలో ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల చుట్టూ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల ద్వారా సర్కారే దగ్గరుండి రియల్ఎస్టేట్వ్యాపారాన్ని ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో వేల ఎకరాల చెల్క భూముల్లో రియల్ వ్యాపారులు తంగేడు వనాలను తొలగించి వెంచర్లు వేస్తున్నారు.
ఎన్నో ప్రత్యేకతలు
‘కేషియా ఆరిక్యులేటా’ అనే సైంటిఫిక్ నేమ్కలిగిన తంగేడు అడవి జాతి మొక్క. ఈ చెట్లు గుట్టల పొంట, ఊరి శివారుల్లోని చెరువు గట్లపై, బంజరు, చెల్క భూముల్లో మాత్రమే పెరుగుతాయి. వేసవిలో ఎండిపోయే తంగేడు మొక్క తొలకరికి చిగురించి, బతుకమ్మ నాటికి నిండుగా పూసి నేలకు బంగారు వర్ణాన్ని అద్దుతుంది. మనకు బతుకమ్మ పువ్వుగానే తెలిసిన తంగేడు నిజానికి ఔషధ మొక్క అని ఆయుర్వేద డాక్టర్లు చెబుతున్నారు. దీనిని అనేక మందుల తయారీలో వాడుతారు. ఇందులో యాంటీ హెచ్ఐవీ, యాంటీ వైరల్ ప్రాపర్టీస్ మెండుగా ఉన్నట్లు పలు పరిశోధనల్లో తేలింది. చెరువులు, కుంటల్లో నీటిని శుభ్రం చేయడానికి, తోళ్ల పరిశ్రమల్లో తోళ్లను కడిగే ప్రక్రియలోనూ తంగేడును ఉపయోగిస్తారు.
తంగేడును కాపాడాలి
బీడు, బంజరు భూముల్లో సహజ సిద్ధంగా పెరిగే తంగేడు చెట్లు ఇప్పుడు కనిపిస్తలేవు. వివిధ జిల్లాలకు చెందిన మా విద్యార్థులు.. పండుగలు, సెలవుల్లో ఇండ్లకు వెళ్లినపుడు తంగేడు చెట్లు ఎలా ఉన్నాయి.. గతానికి ఇప్పటికి జరిగిన మార్పులపై క్షుణ్ణంగా పరిశీలించారు. చెట్ల సంఖ్య తగ్గిపోతోందని వారి పరిశీలనలో తేలింది. హరితహారంలో తంగేడు సంరక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించాం.
- ఎలగొండ నరసింహమూర్తి, అసిస్టెంట్ ప్రొఫెసర్, బోటనీ విభాగం, శాతావాహన వర్సిటీ