- జిల్లాలో సేఫ్టీలేని ఫుడ్ కలకలం
- ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీమ్ తనిఖీల్లో బయటపడ్డ బాగోతం
- 960 కేజీల క్వాలిటీ లేని అల్లం, వెల్లుల్లి పేస్ట్ సీజ్
ఖమ్మం, వెలుగు: ఖమ్మంలోని హోటళ్లు, స్వీట్ షాపులు, ఆహార కేంద్రాల్లో విచ్చలవిడి కల్తీ వ్యవహారం మరోసారి బయటపడింది. జిల్లాలో సోమవారం రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పలు ఆహార తయారీ కేంద్రాలు, స్వీట్ తయారీ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రూ.లక్షన్నరకు పైగా విలువైన 960 కేజీల క్వాలిటీ లేని అల్లం వెల్లుల్లి పేస్ట్ ను సీజ్ చేశారు. పలు చోట్ల క్యాన్సర్ కారక రంగులను, కెమికల్స్ ను వంటల్లో ఉపయోగిస్తున్నారని గుర్తించారు. బ్యాచ్ నెంబర్లు లేకపోవడం, రీ ప్యాకింగ్ చేసి ఉండడం, నిర్వహణ లోపాలు, అపరిశుభ్రత వంటి లోపాలను గుర్తించి నోటీసులు అందజేశారు.
శాంపిల్స్ సేకరించి, పరీక్షల కోసం ల్యాబ్ కు పంపించారు. రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీం హెడ్, జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి. జ్యోతిర్మయి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ రోహిత్ రెడ్డి, స్వాతి, మనోజ్ కుమార్, రతన్ రావులతో కూడిన బృందం ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ఖమ్మం పట్టణంలో రిక్కా బజార్ లోని మ్యాజిక్ అల్లం, వెల్లుల్లి తయారీ కేంద్రంలో ఆకస్మిక తనిఖీలు జరపగా, తనిఖీల్లో పలు ఉల్లంఘనలు బయటపడ్డాయి.
ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ లైసెన్స్ లేకుండా తయారీ చేయడం, స్టోరేజ్, విక్రయ యూనిట్ చట్ట బద్ధమైన లైసెన్స్ లు లేకుండా బిజినెస్ జరుపుతుండడం, అల్లం వెల్లుల్లి మిశ్రమాల యొక్క బాటిల్స్ పై లేబుల్ లోపాలు, బ్యాచ్ నంబర్, ఎఫ్ ఎస్ ఎస్ సీ ఐ లోగో, తయారీ, చిరునామా సరైన వివరాలు లేవని గుర్తించారు. నిల్వ ప్రాంగణం నీట్ గా లేకపోవడం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ను డిటర్జెంట్లు, ఫినాయిల్ వంటి రసాయనాల పక్కనే నిల్వ చేయడం వల్ల కెమికల్స్ తో క్రాస్ కంటామినేషన్ జరగడం, పేస్ట్ నుంచి దుర్గంధం రావడం, అతి తక్కువ ధరకు రిటైలర్లకు విక్రయం చేయడంతో కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ గా అనుమానించి నమూనాలు సేకరించారు. రూ.లక్ష 50 వేల విలువగల 960 కేజీల అల్లం, వెల్లుల్లి మిశ్రమాన్ని సీజ్ చేశారు. సేకరించిన నమూనాలను పరీక్ష కోసం ప్రయోగశాలకు పంపిస్తున్నామని అధికారులు తెలిపారు.
చర్చ్ కాంపౌండ్ లో గల విజయలక్ష్మి పిండి వంటల్లో పూర్తిగా అపరిశుభ్రంగా ఉన్న వంట గదిలో ఆహార పదార్థాలు తయారు చేయడం, క్యాన్సర్ రసాయన రంగులను స్వీట్లలో అధిక మోతాదులలో ఉపయోగించడం గుర్తించారు. బ్యాచ్ నెంబర్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, లైసెన్స్ నెంబర్ లేని మిస్ బ్రాండెడ్ పిండి వంటలను, పచ్చళ్లను, ఇతర దుమ్ము, ధూళి అపరిశుభ్ర వాతావరణంలో ఉన్న ఆహారాలను గుర్తించి అక్కడికక్కడే ధ్వంసం చేశారు. శాంపిల్స్‌ను సేకరించి పరీక్ష కోసం పంపారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం చేస్తున్నందుకు గాను వారికి నోటీసులు, ఇంప్రూవ్మెంట్ నోటీసులు జారీ చేశారు.
మయూరి సెంటర్ లో హరి స్వీట్ హోమ్ లో తనిఖీ చేయగా పూర్తిగా అపరిశుభ్ర వాతావరణంలో తయారీ నిర్వహించడం, అధిక మోతాదులో రసాయన రంగులను వాడడాన్ని గుర్తించారు. ఎక్స్పైరీ కలర్, టాపింగ్ క్రీమ్స్, మిల్కీ మిస్ట్ క్రీమ్, ఇతర పదార్థాలు డేట్ లేకపోవడాన్ని గుర్తించి అక్కడికక్కడే ధ్వంసం చేశారు. ఇంకా ఆహార తయారీలో కీటకాలు, దుమ్ము, బూజు వంటి నాణ్యతా లోపాలున్న ముడి పదార్థాలను ఉపయోగించడం, వంట నూనెలను పదేపదే మరిగించడం వంటి చర్యలు అల్సర్, క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధుల వ్యాప్తికి దారితీసే అవకాశం ఉందని అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి వివరించారు.ఈ సందర్భంగా రాష్ట్ర టాస్క్ ఫోర్స్ టీం హెడ్ వి. జ్యోతిర్మయి మాట్లాడుతూ నిబంధనలు పాటించని, అనుమతులు లేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్న వ్యాపారాలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, అవసరమైతే సీజ్ చేస్తామని తేల్చిచెప్పారు. వ్యాపారులు నిబంధనలు పాటిస్తూ బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.