- డిసెంబర్లోగా రికార్డుల పరిశీలన, సర్వే పూర్తి చేయండి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కస్టోడియన్ ప్రాపర్టీ ఆఫ్ ఇండియా(సెపీ) సంరక్షణలో ఉన్న ఎనిమీ ప్రాపర్టీల లెక్క తేల్చాలని అధికారులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆదేశించారు. రాష్ట్రంలోని హైదరాబాద్, రంగారెడ్డి, కొత్తగూడెం, వికారాబాద్ జిల్లాల్లో ఎనిమీ ప్రాపర్టీల వివరాల విచా రణను వచ్చే నెలాఖరు నాటికి పూర్తి చేసి, జనవరి మొదటి వారంలో నివేదిక ఇవ్వాలన్నారు.
ఎనిమీ ప్రాపర్టీలకు సంబంధించి హైదరాబాద్లోని హోటల్ మారియట్లో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సెపీ ముంబై విభాగ అధికారులతోపాటు రాష్ట్ర రెవెన్యూ ముఖ్య కార్యదర్శి, సీసీఎల్ఏ నవీన్ మిట్టల్, హోంశాఖ సహాయ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి అండ్ర వంశీ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, హైద్రాబాద్, సికింద్రాబాద్, వికారాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణలోని ఎనిమీ ప్రాపర్టీలపై ప్రత్యేకంగా సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా 234 ఎనిమీ ప్రాపర్టీలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. రంగారెడ్డిలో 180, హైదరాబాద్ లో 44, కొత్తగూడెంలో 7, వికారాబాద్ లో 3 ఎనిమీ ప్రాపర్టీలున్నాయని వివరించారు. వీటిలో మెజారిటీ స్థలాలు ఆక్రమణలకు గురయ్యాయని, నిర్మాణాలు కూడా ఉన్నాయని అధికారులు తెలిపారు. రంగారెడ్డి జిల్లాకు సంబంధించి మియాపూర్, కొత్వాల్ గూడలో, హైదరాబాద్ చిక్కడపల్లి, ముషీరాబాద్ తోపాటు పాతబస్తీలోనూ విలువైన ఆస్తులు అన్యాక్రాంతమైనట్లు వివరించారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ... తక్షణమే ఆయా ఆస్తుల రికార్డుల పరిశీలన, సర్వే నిర్వహణకు సెపీ ఆధ్వర్యంలో ప్రత్యేక టీం ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరపున రికార్డుల పరిశీలన, సర్వే నిర్వహణ కోసం ప్రత్యేక టీములను ఏర్పాటు చేయాలని కోరారు. జనవరిలో ఇచ్చే నివేదిక ఆధారంగా ఎనిమీ ప్రాపర్టీలపై తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ పనితీరు భేష్
దేశంలో ఎక్కడ ఎలాంటి నేరాలు జరిగినా నిందితులను పట్టుకునేందుకు దోహదపడే వ్యవస్థ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ (సీఎఫ్ఎస్ఎల్) అని కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఫోరెన్సిక్ లాబోరేటరీ అద్భుతంగా పని చేస్తుందని కితాబు నిచ్చారు. గురువారం హైదరాబాద్ రామంతాపూర్ లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ (సీఎఫ్ఎస్ఎల్), నేషనల్ సైన్స్ ఫోరెన్సిక్ లాబోరేటరీ (ఎన్సీఎఫ్ఎల్), సెంట్రల్ డిటెక్టివ్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ (సీడీటీఐ) సంస్థలను మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తో కలిసి కేంద్రమంత్రి సందర్శించారు.