నగరాల చుట్టూ పచ్చలహారం .. 75,748 ఎకరాల్లో109 అర్బన్ పార్కులు

నగరాల చుట్టూ పచ్చలహారం .. 75,748 ఎకరాల్లో109 అర్బన్ పార్కులు
  • ఇప్పటికే 75 పార్కులు ప్రారంభం.. 
  • అటవీ శాఖ ఆధ్వర్యంలో  రూ. 360 కోట్లు కేటాయింపు 
  • నగర వన్ యోజన కింద ఒక్కో పార్కుకు రూ.20 లక్షల నుంచి రూ.2 కోట్లు
  • నగర, పట్టణవాసులకు కాలుష్య నుంచి ఉపశమనం కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కృషి

హైదరాబాద్, వెలుగు: కాలుష్యంతో సతమతమవుతున్న పట్టణాలు, నగరాల్లోని జనాలకు స్వచ్ఛమైన గాలి అందించడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో చేపడ్తున్న ‘నగర వన్​యోజన’ రాష్ట్రంలో వేగవంతమైంది. అటవీశాఖ ఆధ్వర్యంలో దాదాపు రూ.360 కోట్లతో 109 అర్బన్ పార్కులు డెవలప్​ చేస్తున్నారు. ఇందులో ఇప్పటికే 75   పార్కులు ప్రారంభమై,  ప్రజలకు ఆహ్లాదాన్ని  పంచుతున్నాయి. మొత్తంగా 59 వనాలను కన్జర్వేషన్ పార్కులుగా తీర్చిదిద్దుతున్నారు.  నగరాలు, పట్టణాల శివార్లలోనే కాకుండా నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ స్థలాల్లో, శ్మశానవాటికల్లోనూ చెట్లు పెంచడం ద్వారా ఆయా భూములను రక్షించవచ్చని భావిస్తున్నారు.  

రూ.600 కోట్ల అంచనా వ్యయంతో 

నగర వన్ యోజన లో భాగంగా రాష్ట్రంలో 188 ఫారెస్టు బ్లాక్ లను గుర్తించారు. హెచ్ఎండీఏ పరిధిలోనే 65 వేల ఎకరాల్లో అర్బన్  ఫారెస్ట్  పార్కులను ఏర్పాటు చేస్తున్నారు.  అటవీప్రాంతాల్లో 27 చోట్ల,  హెచ్ఎండీఏ పరిధిలో 16 చోట్ల, టీజీఐఐసీ- పరిధిలో 7 చోట్ల, టీజీ ఎఫ్​డీసీ-4, జీహెచ్ఎంసీ-3, హైదరాబాద్ మెట్రో రైల్-2, అర్బన్ ప్రాంతాల్లో 50 చొప్పున109 చోట్ల అర్బన్ ఫారెస్ట్ పార్కులను ఏర్పాటుచేయాలని సంకల్పించారు. రూ. 600 కోట్ల అంచనా వ్యయంతో 75,748 ఎకరాల్లో వీటిని  ఏర్పాటు చేస్తున్నారు. 

ఇందులో  ఇప్పటికే 75 పార్కులు పూర్తి కాగా.. వాటిని ప్రారంభించారు.  హెచ్ఎండీఏ పరిధిలో 21 ఫారెస్ట్ పార్కులు, హెచ్ఎండీఏ పరిధిలో14, టీజీఐఐసీ ఆధ్వర్యంలో 3, టీజీ ఎఫ్​డీసీ పరిధిలో 3, జీహెచ్ఎంసీ 2, హైదరాబాద్ మెట్రో రైల్ ఆధ్వర్యంలో  1, అర్బన్  ఫారెస్ట్ పరిధిలో 31 పార్కులు ఉన్నాయి. మరో 34 పార్కుల పనులు శరవేగంగా జరుగుతున్నాయి.  వాటిని కూడా త్వరగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు  చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. 

నగర వన్  యోజనలో నిధులు మంజూరు 

నగర వన్ యోజన పథకంలో భాగంగా అర్బన్  ఫారెస్ట్​ల కోసం కేంద్ర ప్రభుత్వం ఫండ్స్​ రిలీజ్​చేస్తున్నది. గరిష్టంగా 50 హెక్టార్ల వరకు అభివృద్ధి చేసుకోవచ్చు.  పార్కు విస్తీర్ణం, చేపట్టే పనులను అంచనావేసి అటవీశాఖ కార్యాలయానికి పంపిస్తే ..  ఫైల్ ను కేంద్ర అటవీశాఖకు అందజేస్తున్నారు. ప్రపోజల్స్​ ఆధారంగా రూ.25 లక్షల నుంచి రూ. 2 కోట్ల వరకు  కేంద్రం కేటాయిస్తున్నది. పనుల్లో భాగంగా పార్కుల చుట్టూ ప్రహరీల నిర్మాణం, కంచెల ఏర్పాటు, వివిధ రకాల పూలు, పండ్ల మొక్కలు నాటడం, ఇంకుడు గుంతల నిర్మాణ పనులు చేస్తున్నారు. పర్యాటకులకు  తాగునీరు, సైక్లింగ్, బెంచీలు, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు.